నేటి రాజకీయ వార్తలు-07/13

*జనాల గొంతుకగా ఎన్నికల ప్రణాళిక
తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) ఎన్నికల ప్రణాళికను ఇద్దరు, ముగ్గురు కూర్చొని రాయరని.. జనాభిప్రాయాలు తెలుసుకొని వారి గొంతుకగా దాన్ని తయారు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. ప్రతి వర్గం ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి, ప్రణాళికతో వాటిని సాధించుకోవడానికే బయల్దేరామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో గురువారం ‘‘తెలంగాణలో విద్యా వ్యవస్థ- సమస్యలు’’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.
*బీసీల పట్ల తెరాసది కపట ప్రేమ -పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం బీసీల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తుందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ హైకోర్టు తీర్పును కాంగ్రెస్‌ పార్టీపై వేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానంలో కేసు కూడా వేయలేదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
*నిర్ణీత గడువును పేర్కొనని నిబంధనలు
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు- పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు గత నెల 19నే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌తో చర్చించారు. భాజపా, లేదా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సరిపడా సంఖ్యాబలం లేదని అధికార పార్టీ గ్రహించడంతో- ఈ నెల 18 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ఉండకపోవచ్చని తెలుస్తోంది. పరిస్థితులు భాజపాకి అనుకూలంగా మారేవరకు ఈ ఎన్నికను వాయిదా వేయనున్నారు.
*పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి-బొత్స
పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనే చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని వైకాపా సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశ్నలతో చంద్రబాబు అవినీతి బట్టబయలైందన్నారు.
*తెదేపా జెండా నందమూరి వంశానిది- మోత్కుపల్లి
ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెదేపా పేరు చెప్పుకొనే అర్హత లేదని తెలంగాణకు చెందిన తెదేపా బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీతి, నిజాయతీ, ధర్మ కోసం ఎన్టీ రామారావు తెదేపాను స్థాపించారని, పేదప్రజల కోసం పెట్టిన తెదేపాను చంద్రబాబు అవినీతి పార్టీగా మార్చేశారని విమర్శించారు. పవన్‌, జగన్‌లది సొంత జెండా, సొంత పార్టీ అయితే.. చంద్రబాబుది నందమూరి వంశానికి చెందిన జెండా అని తెలిపారు. తెదేపా జెండాను దొంగిలించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
* 2019 ఎన్నికల్లో ఊహించని విజయం సాధిస్తాం-మంత్రి జగదీశ్‌
తెరాసకు వంద శాతం ప్రజామోదం ఉందన్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. తమ ప్రభుత్వం వల్ల ఏదోరకంగా ప్రతి ఒక్కరూ లాభం పొందారన్నారు. కొన్ని కారణాల వల్ల దళితుల భూ పంపిణీలో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరవాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన పార్టీ ఏదీ లేదన్నారు. కానీ తెరాస ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ మూడేళ్లలోనే అమలు చేసినట్టు చెప్పారు.
* అన్యాయం చేయొద్దని గడ్కరీకి చెప్పా- చంద్రబాబు
విభజన తర్వాత సరైన ప్రణాళిక లేకపోతే ఆంధ్రప్రదేశ్‌ మరో బిహార్‌ అయ్యేదని, ఆ పరిస్థితి రాకుండా పటిష్ట ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో తెదేపా అధికారం చేపట్టి 1500 రోజులు అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యశాలలో ఎన్నికల ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా పరిటాల రవి సహా 350 మందికి పైగా కార్యకర్తలను కోల్పోయామని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.
*ఘార్ వాపసీ
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని దాదాపుగా ప్రజలు మార్చిపోయారు. అయినా ఇంకా తమ మనుగడ ప్రదర్శించు కోవాలన్నది ఆ పార్టీ యత్నం. ఏ పార్టీలోనూ చెల్లుబాటు కానివారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో మిగిలారు. హాయిగా నలభై రెండు లోక్ సభ సీట్లో బలంగా ఉన్న పార్టీ చేతులారా విభజన చట్టం తెచ్చి ద్వంసం చేసుకుంది. చివరికి ఇప్పుడు మనుగడ కోసం నువ్వు వాసతావా? నువ్వు వస్తావా? అని బతిమాలాడుకుంటుంది. నాలుగేళ్ళుగా పార్టీకి దూరంగా ఉంటున్న మాజీలను తిరిగి కాంగ్రెస్ లోకి తెచ్చే ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టింది. తొలిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం చెపుతోంది. అయితే విభజన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాడు కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి ఆయన్ని పార్టీలోకి తెచ్చినా రాష్ట్రంలో తిప్పితే పలు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం హైకమాండర్ ది. అందుకే పార్టీలోకి చేర్చుకుని మరో రాష్ట్రానికి ఇన్చార్జిగా పంపుతారు. కిరణ్ కుమార్ తర్వాత ఘర్ వాపసీకి ఒప్పుకునే వారెవరన్నది సందేహమే. మునిగే ఓడ ఎక్కేందుకు ఎవరూ ఇష్టపడరూ అటువంటిది మునిగి ఉన్న ఓడ ఎక్కమంటే ఎవరూ ఎక్కుతారు చెప్పండి.
* కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన డొక్కా
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌కు అదనంగా ఒక ఓటు వచ్చిందని ఎద్దేవా చేశారు. కిరణ్‌ చేరికతో కాంగ్రెస్‌కు ఒక ఓటు పెరగడం మినహా కాంగ్రెస్‌కు ఏమీ లాభం లేదన్నారు. దేశంలో అత్యంత ధనికుడైన రాజకీయ నేత కిరణ్‌కుమార్‌రెడ్డేనని మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.
* డ్రెజ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించే ఆలోచన లేదు- గడ్కరీ
డ్రెజ్జింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించే ఆలోచన లేదని, డీసీఐ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉంటుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. డీసీఐలో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రకాశం జిల్లా వాడరేవుకు 3వేల ఎకరాలు కేటాయస్తే పోర్టునిర్మాణానికి సిద్ధమని, ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని గడ్కరీ చెప్పారు. విశాఖ పోర్టుకు అనుబంధంగా శాటిలైట్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధానపోర్టుల నుంచి వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి ప్రాధాన్యమిస్తామని, అన్ని మేజర్ పోర్టుల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాగరమాల ప్రాజెక్టులో మేజర్ పోర్టుల పాత్ర కీలకంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు.
* గడువు కంటే ముందే ఎయిమ్స్ పూర్తి – నడ్డా
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ నెలకొల్పాలని నిర్ణయించారన్నారు. రూ.1618కోట్లతో ఎయిమ్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. గడువు కంటే ముందుగానే ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలకు కేంద్రం ఇస్తున్న కానుక ఎయిమ్స్ అని అన్నారు. ఆగస్ట్‌లో విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని, 2019 జనవరి నాటికి ఓపిడి బ్లాక్ సిద్ధం చేస్తామని తెలిపారు. ఎయిమ్స్‌లో బెస్ట్ ఫ్యాకల్టీని అందిస్తామని జేపీ నడ్డా పేర్కొన్నారు.
* మంత్రి పోచారంతో ఎంపీ కవిత భేటీ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ కవిత కలిశారు. మంత్రి అధికారిక నివాసంలో కవిత ఆయనతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో హరితహారం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
* తెలంగాణ పథకాలే దేశానికి ఆదర్శం- మంత్రి ఈటల
తెలంగాణలోని పథకాలే దేశానికి ఆదర్శమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ నగరంలోని హోటల్ మారియట్‌లో జరిగిన జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి జోయల్ ఓరం, మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఢిల్లీలో అధికార ప్రతినిధి రామచంద్రుడు హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటల.. గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారి కోసం పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com