నేటి రాజకీయ వార్తలు

* వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 19వ రోజు కర్నూలు జిల్లా వెంకటగిరి నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన వెంట నడిచేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మార్గమధ్యలో తనను కలిసిన వారందరితో ప్రేమగా మాట్లాడారు. కరచాలనాలు చేశారు. సెల్ఫీలు దిగారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. కోడుమూరు సోమప్ప కోట సర్కిల్, కోడుమూరు కొత్త బస్టాండ్‌, వక్కూరు ఎస్సీ కాలనీ మీదుగా ఈ రోజు యాత్ర కొనసాగుతుంది.
* ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత తన విన్నపాన్ని తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆమె మాట్లాడుతూ… ఆర్టీసీని నష్టాల ఊబీలో నుంచి లాభాల బాటలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రూ.600 కోట్ల నష్టం నుంచి రూ. 200కోట్లు వరకు తగ్గించినట్లు ఇటీవల ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం చాలా సంతోషమని ఆమె తెలిపారు.
* మహబూబ్‌నగర్జిల్లాలోని కోస్గి మండలం నాగసానిపల్లిలో గందరగోళ వాతావరణం నెలకొంది. నాగసానిపల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు. కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. తిరుపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
* రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఏపీ అభివృద్ధి కోసం రాజకీయాలకు అంతా కలిసి రావాలని కోరానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు కలిసి రావడం సంతోషంగా ఉందని అన్నారు. తాజాగా కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో చేరడం పెద్ద పరిణామం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అరకు కాఫీ బ్రాంచ్‌ని పెంచడమే తన లక్ష్యమని సీఎం తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీల నేతలే కాదు… స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చినా అహ్వానిస్తామని ఆయన చెప్పారు.
* గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించడం ద్వారా వ్యాదుల వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశారు. టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటువ్యాధుల వ్యాప్తిని వీలైనంత తగ్గించాలని, మలేరియా, డెంగ్యూ కేసులు రాష్ట్రంలో నమోదు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. సురక్షిత తాగునీరు అందించడానికి యుద్ధప్రాతిపదికన క్లోరినేషన్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వాట్సప్‌, కైజాలాయాప్‌తో ప్రత్యేక యాక్షన్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతి రోజు గ్రామాల్లో జరుగుతున్న క్లోరినేషన్‌ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
* రాష్ట్రంలో తమిళ్‌ దేశీయ కట్చి (టీడీకే) పేరుతో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. నగరంలో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో టీడీకే అధ్యక్షుడు సత్యమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ విధివిధానాలపై ప్రసంగించారు. రాష్ట్రాన్ని 1967 నుంచి పరిపాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల వల్ల ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని, ముఖ్యంగా శ్రామిక వర్గాలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.
|* గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘చాయ్‌’కి మరోసారి ప్రాధాన్యం ఏర్పడింది. 2014 ఎన్నికలకు ముందు ‘చాయ్‌ పే చర్చ’ పేరిట ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితో పాటు.. ఇటీవల ‘చాయ్‌వాలా’ అంటూ మోదీని అవమానించిన కాంగ్రెస్‌కు కౌంటర్‌గా భాజపా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు టీ దుకాణాల వద్ద స్థానికులతో కలిసి ప్రసంగాన్ని వింటూ టీ సేవించారు. రాష్ట్రవ్యాప్తంగా 182 నియోజకవర్గాలు.. 50,128 పోలింగ్‌ స్టేషన్లలో ‘మన్‌కీ బాత్‌, చాయ్‌కే సాత్‌’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు.
* ఆత్మరక్షణకు, దేవాలయాల సంరక్షణకు ప్రతి ఒక్కరి వద్ద ఆయుధాలు అత్యవసరమంటూ ఉత్తరాదిలోని మహేశ్వరాచార్య ఆలయం ప్రతినిధి నరేంద్రనాథ్‌స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ధర్మసంసద్‌ సమావేశాల చివరి రోజైన ఆదివారం ఆయన మాట్లాడారు. ‘‘మత విద్వేషాలను ముందుంచుకుని వచ్చే ముష్కరులను అడ్డుకునేందుకు, ఆత్మరక్షణకు ఆయుధం అత్యవసరం’’ అని పేర్కొన్నారు. హిందువులు ఒక్కొక్కరికి నలుగురు సంతానం ఉండాలంటూ హరిద్వార్‌లోని భారత్‌ మాతా మందిరం స్వామి గోవింద దేవ్‌ గిరీజీ మహారాజ్‌ చేసిన వ్యాఖ్యలను నరేంద్రనాథ్‌స్వామి సమర్థించారు.
* గుజరాత్‌లోని గాంధీనగర్‌ క్రైస్తవ మతాధికారి (ఆర్చ్‌బిషప్‌) థామస్‌ మాక్వాన్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) తాఖీదు జారీ చేసింది. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని క్రైస్తవులను కోరుతూ ఆయన విడుదల చేసిన లేఖపై వివరణ కోరింది. ప్రస్తుతం మనదేశంలోని అల్పసంఖ్యాక వర్గాల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని పేర్కొంటూ థామస్‌ గతవారం ఓ లేఖ విడుదల చేశారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని క్రైస్తవ వర్గ ప్రజలకు అందులో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార భాజపాకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారని విశ్లేషణలు, వాదనలు వినిపించాయి. పలు వార్తాసంస్థల్లో దీనికి సంబంధించి కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కలుగజేసుకుంది.
* తన ఏకైక కుమారుడు ముస్లిం మతాచార్యుని (మౌలానా)గా మారాలని నిర్ణయించుకోవడంపై ఉగ్రవాది ‘డాన్‌’ దావూద్‌ ఇబ్రహీం తీవ్రనిరాశకు లోనయ్యారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా, మొయిన్‌ నవాజ్‌ దావూద్‌ కస్కర్‌ ఒక్కడే కుమారుడు. 31 ఏళ్ల మొయిన్‌ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటాడని దావూద్‌ ఆశిస్తుంటే.. ఈ అక్రమ వ్యాపారాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రాజప్రాసాదం లాంటి ఇంటిని వదిలి భార్యాపిల్లలతో మసీదు యాజమాన్యం సమకూర్చిన ఇంట్లో ఉంటున్నారు.
* దేశంలోని తీరప్రాంత భద్రతలో భాగంగా కేంద్రం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయం తీసుకోనుంది. ఉపగ్రహాల ద్వారా తీరప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని తెలుసుకుని ఇస్రో అప్రమత్తం చేయనుంది. 20 మీటర్ల వరకు సముద్రంలో తిరిగే పడవలపై నిఘా వ్యవస్థను తీసుకురానుంది. దేశంలో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. భద్రతలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి వెయ్యి ట్రాన్స్ పాండర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకు కేంద్రం కూడా అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇస్రో వద్ద ప్రస్తుతం 445 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. వాటి కొరతను అధిగమించేందుకు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com