నేటి వాణిజ్యం-౦౪/౧౨

*రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్న డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) దివాలా పరిష్కార ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా డీసీహెచ్‌ఎల్న్‌ు స్వాధీనం చేసుకోవడానికి 9 కంపెనీల దాకా ఆసక్తి వ్యక్తీకరించాయి. వీటిలో అయిదు మీడియా సంస్థలు ఉన్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో లావాదేవీల నిర్వహణకు తగిన సలహాలు ఇవ్వడానికి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థను నియమించారు. ఆస్తుల విలువ మదింపుదారుల నియామకం కూడా జరిగింది.
*కడప జిల్లాలోని మంగంపేట ముగ్గురాయికి మళ్లీ మంచిరోజులొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఖనిజం తన సత్తా చాటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి చొరవ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు తదితర చర్యల నేపథ్యంలో ‘ఇండియన్‌ బెరైటీస్‌’గా పేరొందిన కడప ఖనిజంపై విదేశాలు ఆసక్తి చూపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
*ప్రస్తుత (2018-19) ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.3 శాతం ఉంటుందని, వచ్చే (2019-20) ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి చేరుతుందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. ఆసియా దేశాల్లోనే అధిక వృద్ధిరేటు భారత్‌దే అవుతుందని పేర్కొంది.
*మార్చి నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ల నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఎక్కువగా లిక్విడ్‌, డెట్‌ ఫండ్‌ల నుంచి పెట్టుబడుదార్లు తమ నిధులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ సంఘం యాంఫీ గణాంకాల ప్రకారం.. గత నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో రూ.50,000 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి.
*మెస్‌లు, విద్యాసంస్థల క్యాంటీన్లలో విక్రయించే ఆహార, పానీయాలపై 5 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే మాధ్యమికోన్నత (హైయర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) బోధన వరకు నిర్వహించే పాఠశాలలు కనుక నేరుగా విద్యార్థులకు ఆహారం సరఫరా చేస్తే, జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.
*నిజాయతీగా వ్యాపారం చేసే వారికి ఇ-వే బిల్లు ద్వారా ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వదని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ (సీటీ, ఎక్సైజ్‌) ప్రిన్సిపల్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణలో ఇ-వే బిల్లు విధానం ఇప్పటికే అమల్లో ఉందనీ, ఏప్రిల్‌ 15 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోన్న పద్ధతిలోకి మారబోతున్నట్లు తెలిపారు.
*ఐటీసీ సంస్థ ప్యాక్‌ చేసిన రసాలు, పండ్ల పానీయాల విపణిలో 10-12% వాటా దక్కించుకోవాలని ఆశిస్తోంది. వచ్చే ఏడాదికల్లా దీన్ని సాధించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళుతోందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
*అన్ని ఫండ్‌ పథకాలను నిలిపేయాల్సిందిగా సహారా మ్యూచువల్‌ ఫండ్‌ (సహారా ఎమ్‌ఎఫ్‌)కు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 21, 2018 కల్లా ఒకటి తప్ప అన్ని పథకాలనూ నిలిపివేయాలని చెప్పిన సెబీ.. ‘సహారా టాక్స్‌ గెయిన్‌ ఫండ్‌’ను మాత్రం జులై 27 వరకు కొనసాగించడానికి గడువు ఇచ్చింది.
*దేశీయ విపణిలోకి బయోజెన్‌కు చెందిన మల్టిపల్‌ స్క్లేరోసిస్‌ (ఎంఎస్‌) ఔషధాలను ఈసాయ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండియా ప్రవేశపెట్టింది. జపాన్‌లోని మాతృసంస్థ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా బయోజెన్‌ ఎంఎస్‌ ఔషధాలను భారత్‌లో విక్రయించనున్నట్లు ఈసాయ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజిత్‌ సింగ్‌ లంబా తెలిపారు.
* దిల్లీకి చెందిన ఆరోగ్య సంరక్షణ ఫిన్‌టెక్‌ అంకుర కంపెనీలో శ్రీకేపిటల్‌ ఆధ్వర్యంలోని పలువురు మదుపర్లు తాజాగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు 10 లక్షల (రూ.6.5 కోట్లు) పెట్టుబడులను ప్రీ సిరీస్‌ ఏ నిధుల కింద సమీకరించినట్లు కంపెనీ తెలిపింది.
*కృత్రిమంగా ధరలను ప్రభావితం చేయడం ఎవరి గొయ్యి వారే తవ్వుకోవడం లాంటిదేనని ఒపెక్‌ దేశాలనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుబాటు ధరలోకి ఇంధనాన్ని అందరికీ తీసుకురావాలంటే బాధ్యతాయుత ధరలపై అంతర్జాతీయ ఏకాభిప్రాయం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
*ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లను కొనే విషయంలో మదుపర్లు మరికొన్ని రోజులు వేచిచూడటం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉన్నత యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ రెండు దిగ్గజ బ్యాంకుల షేర్లు ఒడుదొడుకుల మధ్య చలిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com