నేటి వాణిజ్య వార్తలు-౦౨/౦౭

*దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) నుంచి మినహాయింపు ఇవ్వడం వల్లే షేర్ల విలువలు అధికంగా పెరిగాయని, ఇందువల్ల చిన్న మదుపరికి నష్టభయం ఏర్పడుతోందని ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్‌ అధియా పేర్కొన్నారు.
* దేశంలో గతేడాది 727 టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2016లో 666.1 టన్నుల పసిడికే గిరాకీ లభించగా, ఈసారి 9.1 శాతం అధికమైందని పేర్కొంది. ధరలు తక్కువగా ఉండటం, శుభ ముహూర్తాలు అధికంగా ఉండటం, సానుకూల ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణాలని తాజా నివేదికలో విశ్లేషించింది.
*ప్రపంచ ప్రధాన మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్న వేళ బంగారానికి డిమాండ్‌ బాగా పెరిగింది. ఈరోజు పసిడి ధర 14నెలల గరిష్ఠానికి చేరుకుంది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.31,600కు చేరింది.
*అక్రమంగా తమ ట్రేడ్‌మార్క్‌ చరఖాను ఉపయోగించుకుంటున్నారని, దుస్తులను ఖాదీ ట్యాగ్‌తో అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఖాదీ, గ్రామ వ్యాపార కమిషన్‌(కేవీఐసీ) ఫ్యాబ్‌ ఇండియాకు నోటీసులు పంపించింది. నష్టపరిహారంగా రూ.525కోట్లు చెల్లించాలని ఖాదీ కమిషన్‌ డిమాండ్‌ చేసింది.
*బ్యాంకింగ్‌, బీమా, ఎగుమతులు, దిగుమతులు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల వంటి ఫైనాన్షియల్‌ సేవల విభాగాల్లో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ విప్లవం రానున్న కాలంలో అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపగలదని బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో లుపిన్‌ ఆకట్టుకోలేకపోయింది. ఈ ఔషధ సంస్థ ఏకీకృత నికర లాభం 64.97 శాతం క్షీణించి రూ.221.73 కోట్లకు చేరుకుంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నాట్కో ఫార్మా రూ.217.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.805.43 కోట్ల నికరలాభాన్ని హీరో మోటోకార్ప్‌ నమోదు చేసింది. 2016-17 ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన రూ.772.05 కోట్లతో పోలిస్తే, ఇది 4.32 శాతం అధికం. అధిక అమ్మకాలే ఇందుకు దోహదం చేశాయని సంస్థ తెలిపింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.16.75 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాల నికర లాభం రూ.20.71 కోట్లతో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గింది.
*వాటాదారులకు గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా బోర్డు మధ్యంతర డివిడెండును సిఫారసు చేసింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 (200 శాతం) మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించిందని కంపెనీ తెలిపింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో సీమెన్స్‌ నికర లాభం 18.6 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.160.7 కోట్లుగా ఉండగా.. ఈ సారి రూ.190.5 కోట్లకు చేరింది.
*డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సంస్థ కెల్టన్‌ టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.17కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*గొలుసుకట్టు విక్రయశాలల ద్వారా దుస్తులను విక్రయిస్తున్న ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రిటైల్‌ మాల్స్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. మాల్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించే అంశం పరిశీలనలో ఉందని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ డైరెక్టర్‌ సురేశ్‌ రాజా మౌళి తెలిపారు.
*డిసెంబరు 31, 2017తో ముగిసిన త్రైమాసికంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) లాభం 11.06 శాతం పెరిగి రూ.230.11 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.207.18 కోట్లుగా నమోదైంది.
*పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పట్లో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే అవకాశాలు లేవట. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com