నేటి వాణిజ్య వార్తలు-౧౧/౨౫

*లాజిస్టిక్స్‌ రంగంలోని గోదాములు, శీతలీకరణ గొలుసుకట్టు వ్యవస్థల వంటి వాటికి మౌలిక సదుపాయాల హోదా కల్పించడం తొలి చర్యేనని, వీలైనంత త్వరలో ఇటువంటి చర్యలు మరిన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల విభాగం ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్‌) బినయ్‌ కుమార్‌ తెలిపారు.
*సోమవారం నుంచి ప్రారంభమయ్యే సార్వభౌమ పసిడిబాండ్లకు ధరను గ్రాముకు రూ.2961గా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 చొప్పున రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే వారికి గ్రాము ధర రూ.2911 మాత్రమే అవుతుంది.
*చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎస్‌ఎంఈ)లకు ప్రత్యేక రుణ పథకాన్ని ముత్తూట్‌ గ్రూప్‌నకు చెందిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఆవిష్కరించింది. రూ.10 లక్షలకు పైబడిన పసిడి రుణాలకు 12 శాతం వడ్డీ అమలవుతుందని సంస్థ తెలిపింది. పరిశ్రమలో ప్రస్తుతం ఈ రుణాలకు 14-15 శాతం వడ్డీ అమలవుతోందని వివరించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన సీమెన్స్‌ రూ.623.77 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
*స్టాక్‌ బ్రోకర్ల వద్ద మీ నిధులు, సెక్యూరిటీలను లావాదేవీలను అట్టే పెట్టి ఉంచరాదని.. ఎప్పటికప్పుడు సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని మదుపర్లకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) పంపిన సందేశం దుమారం రేపింది. దీనిపై ప్రముఖ స్టాక్‌ బ్రోకర్ల సంఘం ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తరహా సందేశాల(ఎస్‌ఎమ్‌ఎస్‌) వల్ల బ్రోకరేజీలపై అవిశ్వాసం ఏర్పడుతుందని ద అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్ఛేంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా(యాన్మి) పేర్కొంది. తక్షణం ఆ సందేశాన్ని సవరించాలని ఎస్‌ఎస్‌ఈని కోరింది.
*సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రాణే బ్రేక్‌ లైనింగ్‌ రూ.9.33 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.10.10 కోట్లు నమోదైంది.
*వ్యాధుల చికిత్సలో వినియోగించే మినోసైక్లిన్‌ హైడ్రోక్లోరైడ్‌ మాత్రల అమ్మకాలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తమ అనుబంధ సంస్థ జైడస్‌ ఫార్మాస్యూటికల్స్‌ యూఎస్‌ఏకు అనుమతి ఇచ్చిందని కేడిలా హెల్త్‌కేర్‌వెల్లడించింది.
*మెనా ప్రాంతంలో నీటి ప్రాజెక్ట్‌ కోసం 392కే ఎంటీ పైపుల సరఫరా కాంట్రాక్ట్‌ లభించిందని వెల్‌స్పన్‌ కార్ప్‌ ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్‌తో తమ ఆర్డరు పుస్తకం రూ.6,300 కోట్లకు చేరిందని తెలిపింది.
*సూపర్‌బైక్‌ ఎంటీ-09 మోడల్‌లో కొత్త వెర్షన్‌ను శుక్రవారం ఇండియా యమహా మోటార్‌ విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.10.88 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. కొత్తగా అభివృద్ధి చేసిన 847సీసీ 3-సిలిండర్‌ ఇంజిన్‌ను ఇందులో అమర్చారు.
*గత నవంబరులో రూ.500, 1000 నోట్లు రద్దు చేశాక, దేశ ప్రజల చెల్లింపు అలవాటులో గణనీయ మార్పు వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అధ్యయనం వెల్లడించింది. నగదు చెల్లింపులు భారీగా తగ్గాయని, రిటైల్‌ కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు అధికమయ్యాయని తెలిపింది.
*అమెరికా ఖరీదైన బైకుల తయారీ సంస్థ ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ కొత్త స్కౌట్‌ బాబర్‌ మోడల్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.12.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). 6-స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఈ బైకులో 1133 సీసీ ఇంజిన్‌ అమర్చారు.
*స్కోడా ఆటో ఇండియా తమ అన్ని మోడళ్ల శ్రేణిపై 2-3 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, వివిధ ఆర్థిక కారణాలు.. ధరల పెంపునకు దారితీశాయని స్కోడా ఇండియా వెల్లడించింది.
*2022 కల్లా 200 మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్‌(ఆర్‌ఈ)ను భారత్‌ చాలా సులువుగా సాధించగలదని విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ పేర్కొన్నారు. 175 మెగావాట్ల లక్ష్యం కంటే ఇది ఎక్కువేనని పరిశుద్ధ ఇంధన ప్రణాళికను విడుదల చేస్తూ పేర్కొన్నారు. మార్చి 2018 కల్లా 21 గిగా వాట్ల సౌర, పవన విద్యుత్‌ సామర్థ్యానికి చేరడానికి అవసరమైన ప్రణాళికను సైతం ఆయన ఆవిష్కరించారు.
*ఆర్థిక వ్యవస్థ వేగంగా క్రమబద్ధీకరణ చెందుతున్న దశలో ఉందని, ఈ సందర్భంగా అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. చెల్లింపుల్లో నగదు ప్రాధాన్యత తగ్గుతోందని, డిజిటల్‌ లావాదేవీలు అధికమవుతున్నాయని తెలిపారు. 10-20 తరవాత చరిత్ర రాసినపుడు, ప్రస్తుత కాలంలో చోటుచేసుకున్న ఈ మార్పును ప్రస్తావిస్తారని వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com