నేటి వాణిజ్య వార్తలు-౧౨/౧౨

*పన్నురేట్ల హేతుబద్దీకరణ జరిపి మరింతమంది పన్ను చెల్లించేందుకు ముందుకు వచ్చేలా చూడాలని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ముందస్తు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక వేత్తలతో జైట్లీ సమావేశమయ్యారు. సామాజిక భద్రతా పింఛన్‌ (వృద్ధులకు రూ.200 నుంచి రూ.500కు, వితంతువులకు రూ.300 నుంచి రూ.500కు) పెంచాలని, మినహాయింపులు తొలగించి కార్పొరేట్‌ పన్ను 20 శాతానికి పరిమితం చేయాలని, పింఛన్లు-మౌలిక సదుపాయాలకు దీర్ఘకాలిక న్యూ ఇండియా బాండ్లు జారీ చేయాలని, ఉపాధి హామీ పథకం నారేగా వేతనాలు పెంచాలని, పదేళ్లుగా మార్పులు చేయని కస్టమ్స్‌, ఎగ్జిమ్‌ విభాగంలో సంస్కరణలు చేపట్టాలని ఆర్థికవేత్తలు కోరారు.
*నియామకాల విషయంలో బి-కేటగిరీ బిజినెస్‌ స్కూళ్లు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ ఏడాది కేవలం 20 శాతం మందికే ఉద్యోగావకాశాలు లభించాయని అసోచామ్‌ నివేదిక పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యంత గడ్డు ఏడాదిగా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దు, వ్యాపార సెంటిమెంట్‌ అంతంత మాత్రంగా ఉండటం, కొత్త ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి వాటి వల్ల బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులకు అవకాశాలు తగ్గాయని అభిప్రాయపడింది.
*హైదరాబాద్‌ బాచుపల్లిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్ములేషన్ల తయారీ యూనిట్‌కు ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ నివేదిక (ఈఐఆర్‌) వచ్చింది. యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలను ముగించి ఈఐఆర్‌ను జారీ చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. గతంలో ఈ ప్లాంటులో తనిఖీలు నిర్వహించి 11 లోపాలు గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ 483 ఫారమ్‌ను జారీ చేసింది.
*దేశంలోని ఏదేని ఆర్థిక సంస్థలో ఉన్న ప్రజల డిపాజిట్లకు ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భరోసా ఇచ్చారు. ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డీఐ (ఫైనాన్షియల్‌ రిసొల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) ముసాయిదా బిల్లులోని నిబంధనలపై డిపాజిటుదార్లలో నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నంలో భాగంగా పై వ్యాఖ్య చేశారు. అలాగే ఈ ముసాయిదా బిల్లులో మార్పులు కూడా చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.
*4జీ సేవలు ఆరంభం అయ్యాక, మొబైల్‌పై ఇంట‌ర్నెట్‌ వేగం పెరిగిన మాట నిజమే. అయితే 4జీ స్మార్ట్‌ఫోన్లు వినియోగించే వారే అత్యధికవేగం డేటా వేగాన్ని పొందే వీలుంది. ఇంకా 2జీ, 3జీ కనెక్షన్ల సంఖ్యే దేశంలో అధికంగా ఉంది. అందువల్లే మొబైల్‌ నెట్‌ సగటు వేగానికి వచ్చేసరికి మనదేశం 109వ స్థానంలోనే ఉంది. ల్యాండ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో మాత్రం 76వ స్థానంలో ఉంది. నవంబరు నెలకు సంబంధించి, వివిధ దేశాల్లో మొబైల్‌ నెట్‌ సగటు వేగాన్ని విశ్లేషిస్తూ, వెబ్‌ సేవల సంస్థ ఓక్లా వెలువరించిన ‘ నవంబర్‌ స్పీడ్‌టెస్ట్‌ అంతర్జాతీయ సూచీ’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
*జనవరి నుంచి ప్రయాణికుల కార్లపై రూ.25,000 వరకు ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. పెరిగిన తయారీ ఖర్చులే ఇందుకు కారణమని తెలిపింది. ‘మారిన మార్కెట్‌ పరిస్థితులు, పెరిగిన తయారీ ఖర్చులు, వివిధ ఇతర ఆర్థిక కారణాలు ధరల పెంపునకు దారితీసింది’ అని టాటా మోటార్స్‌ అధ్యక్షుడు (ప్రయాణికుల వాహన విభాగం) మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌ సహా మొత్తం వాహన శ్రేణి ధరలు పెరగనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టయోటా, హోండా, స్కోడా, ఇసుజు వంటి కంపెనీలు ధరలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
*భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వృద్ధి చెందుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం పెరగడం, ప్రభుత్వ వ్యయాలు అధికమవ్వడం, వ్యవస్థాగత సంస్కరణలు ఇందుకు ఉపకరిస్తాయని తెలిపింది.
*తగ్గుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో సంస్థాగత మదుపరులు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని సీబీఆర్‌ఈ భారత, ఆగ్నేయాసియా ఛైర్మన్‌ అన్షుమన్‌ మేగజైన్‌ పేర్కొన్నారు. విదేశాల్లో బీమా, పింఛను నిధులు ఎక్కువగా స్థిరాస్తుల్లోనే ఉంటాయనీ, మనదేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
*రైతులకు రుణ మాఫీ చేయాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి ఇప్పుడు వస్తున్నాయి. గుజరాత్‌లో కూడా రుణమాఫీ చేస్తామని తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ప్రకటించడం గమనార్హం.
* బిట్‌కాయిన్‌ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ ఎక్స్ఛేంజీ షికాగో బోర్డ్‌ ఆప్షన్స్‌ ఎక్స్ఛేంజీ (సీబీఓఈ)లో అరంగేట్రం చేసిన కొద్దిసేపట్లోనే బిట్‌కాయిన్‌ 18,000 డాలర్ల (దాదాపు రూ.11.70 లక్షలు)ను అధిగమించింది. తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య చలిస్తుండటంతో బిట్‌కాయిన్‌ విలువ మదుపర్లలో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. సీబీఓఈలో 15,000 డాలర్ల వద్ద బిట్‌కాయిన్‌ నమోదైంది. మొదటి 20 నిమిషాల్లో తీవ్ర స్పందన రావడంతో సీబీఓఈ వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. అనంతరం 18,000 డాలర్లను అధిగమించింది. మొదటి 2గంటల్లో వేలాది లావాదేవీలు చోటుచేసుకున్నాయని.. అనంతరం బిట్‌కాయిన్‌ స్థిరంగా ట్రేడవుతున్నట్లు వెడ్‌బుష్‌ సెక్యూరిటీస్‌ ఫ్యూచర్స్‌ మేనేజర్‌ బాబ్‌ విశ్లేషించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com