నేటి వాణిజ్య వార్తలు-04/17

*దేశంలో ఇ-వాహనాల వినియోగానికి మరింత ప్రోత్సాహానిచ్చే దిశగా ఓ అడుగు పడింది. ప్రధాన సమస్య ఛార్జింగ్‌ పాయింట్లే కావడంతో.. వాటి ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని అందించడం కోసం ఓ ప్రకటన చేసింది. విద్యుత్‌ వాహనాలకు చెందిన బ్యాటరీలను ఛార్జింగ్‌ చేయడమనేది ‘సేవ’ విభాగం కింద గుర్తిస్తామని విద్యుత్‌ శాఖ పేర్కొంది.
*మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే రిటైల్‌ మదుపర్లు ఎక్కువ మంది ‘సిప్‌’(క్రమానుగత పెట్టుబడుల పథకం-ఎస్‌ఐపి) దారి పడుతున్నారు. 2017-18లో ఏకంగా రూ.67,910 కోట్ల మేర పెట్టుబడులు సిప్‌ ద్వారానే ఫండ్‌లలోకి వచ్చాయి.
*జీఎస్‌టీపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ. ఇంకా ఏదో తెలియని సందిగ్ధత. ఈనేపథ్యంలో పాఠకుల సందేహాలను ఆహ్వానించగా.. వారు అనూహ్య స్థాయిలో స్పందించారు.
*వొడాఫోన్‌-ఐడియాల విలీనం అనంతరం 21,000 ఉద్యోగాల్లో .. 5000 వరకు ఉద్యోగాలకు కోత పడవచ్చని తెలుస్తోంది. వేసవి నెలల తర్వాత ఇది జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు.. అనవసర ఉద్యోగాలను తొలగించడం కోసం అవి ఈ నిర్ణయం తీసుకోవచ్చని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.
*గృహ కొనుగోలుదార్లు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు వచ్చే నెల 10 కల్లా రూ.100 కోట్లు డిపాజిట్లు చెల్లించాల్సిందిగా జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే కంపెనీ సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికను పరిశీలించాల్సిందిగా దివాలా పరిష్కార వృత్తినిపుణునికి సూచించింది.
*భారత్‌లో ఒపో ఎఫ్‌7 డైమండ్‌ బ్లాక్‌ వేరియంట్‌ అమ్మకాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ధర రూ.26,990. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఒప్పో విక్రయ కేంద్రాల్లోనూ ఇవి లభ్యమవుతాయి.
*వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణాలపై తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం(ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు చేస్తోందో లేదో తమకు తెలియదని వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.
*అతి పల్చని డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ‘రీఇన్వెంట్‌’ను యెర్హా డాట్‌కామ్‌ విడుదల చేసింది. పసిడి, నలుపు రంగుల్లో భారత్‌లో మాత్రమే లభ్యం కానున్న దీని ధర రూ.3,999. 6.4 మిల్లి మీటరు మందం, 12 సెం.మీ ఎత్తు, 4.4 వెడల్పు, 80గ్రా. బరువుతో సాంకేతికత, విలాసం కలయికగా ఈ ఫోనును తీర్చిదిద్దినట్లు యెర్హా డాట్‌కామ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
*ఆన్‌లైన్‌ విక్రయాల సంస్థ షాప్‌క్లూస్‌ నష్టాన్ని తగ్గించుకుంది. 2016-17లో రూ.333 నష్టాన్ని చవిచూసిన ఈ సంస్థ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.208 కోట్లకు నష్టాన్ని పరిమితం చేసుకుంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 45 శాతం పెరిగి రూ.189 కోట్ల నుంచి రూ.275 కోట్లకు పెరిగింది.
*పాన్‌కార్డ్‌ క్లబ్స్‌(పీసీఎల్‌), ఆ కంపెనీ డైరెక్టర్లకు చెందిన ఆస్తులు, విలాస కార్లు, బంగారం, ఆభరణాలను అటాచ్‌ చేయాలంటూ మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.
*అన్ని టెలికాం నెట్‌వర్క్‌ సంస్థల మొబైల్‌ టారిఫ్‌లు ఒకేచోట పరిశీలించుకునే అవకాశం లభించనుంది. టెలికాం సర్కిళ్లలో మొబైల్‌ టారిఫ్‌లన్నీ పారదర్శకంగా ఒకేచోట పొందుపరుస్తున్నందున, అనువైనది ఎంచుకోవడం వినియోగదారులకు సులభమవుతుంది.
*గత ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసికంలో గృహ్‌ ఫైనాన్స్‌ రూ.130.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.110.45 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 18.16 శాతం అధికం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com