నేటి వాణిజ్య వార్తలు-05/12

* రిలయన్స్‌ జియో పోస్ట్‌ పెయిడ్‌ రాకతో ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టెలికాం కంపెనీలకు మళ్లీ సెగ తగలనుంది! జియో ఇచ్చే పోటీతో భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా వంటి సంస్థలు ఒక వినియోగదారుడిపై ఆర్జించే సగటు రాబడి (ఏఆర్‌పీయూ)ని మరింత తగ్గించుకునే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ జెఫెరీస్‌ అంచనా వేసింది.
* ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌లో మరికొన్ని అప్‌డేట్స్‌‌ అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌ గ్రూప్‌ సెట్టింగ్స్‌లో పలు మార్పులను చేసింది. దీని ప్రకారం గ్రూప్‌ అడ్మిన్‌.. గ్రూప్‌ వివరాలను ఏ సభ్యుడు ఎడిట్‌ చేయవచ్చో అతనికి మాత్రమే అనుమతినిస్తూ సెట్టింగ్స్‌లో మార్పులు చేయొచ్చు.
*భారతదేశంలో గత నెలలో తొలిసారి ‘క్రిప్టోజాకింగ్‌’ దాడి జరిగింది. ఆదిత్యా బిర్లా గ్రూప్‌ లక్ష్యంగా ఈ దాడి జరగడం గమనార్హం. ఆ గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థల్లోని 2వేలకు పైగా కంప్యూటర్లను హ్యాకర్లు లక్ష్యంగా ఎంచుకున్నారు.
*వ్యక్తిగత సాయం కోసం నిధులు అర్థించే వారికి శుభవార్త! ఇకపై ఫేస్‌బుక్‌ ద్వారా నిధులు సమీకరించడం పూర్తిగా ఉచితం. నిధులు సమీకరించేందుకు ఇందుకు ముందున్న రుసుములను రద్దు చేస్తూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ ఫేస్‌బుక్‌ నిర్ణయం తీసుకుంది.
*ప్రస్తుత సంవత్సరానికి దేశంలోని ఉత్తమ యాజమాన్య సంస్థలుగా హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌), టాటా కమ్యూనికేషన్స్‌, ఆదిత్యా బిర్లా గ్రూపులకు చోటు దక్కింది. అంతర్జాతీయ వృత్తినిపుణల సేవల సంస్థ ఏఅన్‌ రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 16 సంస్థలు చోటు దక్కించుకున్నాయి.
*ఈ ఏడాది (2018)లో దేశీయ ఐటీ రంగం మరో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశముందని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.
*బ్యాంకులు వినియోగదారులకు అందిస్తున్న కొన్ని ఉచిత సేవలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధింపు విషయంలో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు రెవెన్యూ శాఖను సంప్రదించాలని ఆర్థిక సేవల విభాగం నిర్ణయం తీసుకుంది.
* ఉపాధి కల్పనలో కీలకమైన రత్నాభరణాల పరిశ్రమకు రుణాలివ్వడం మానొద్దని బ్యాంకులకు, వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు సూచించారు.
*ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో ప్రభుత్వం నియమించిన సీనియర్‌ అధికారి లోక్‌ రంజన్‌, ఆర్థిక సేవల విభాగం నుంచి మానవ వనరులు, శిక్షణ విభాగానికి గురువారం బదిలీ అయ్యారు. అయినా కూడా ఆయన ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్పైస్‌జెట్‌ లాభం 11 శాతం పెరిగి, రూ.46.1 కోట్లకు చేరింది. గడచిన 13 త్రైమాసికాల నుంచి సంస్థ వరుసగా లాభాల బాటలోనే నడుస్తోంది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ రూ.4,859.77 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా చేయాల్సి రావడంతోనే నష్టం పెరిగినట్లు బ్యాంకు పేర్కొంది.
*గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.8.05 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం నికర లాభం రూ.14.68 కోట్లతో పోలిస్తే 45 శాతం తగ్గింది. ఆదాయం రూ.141.69 కోట్ల నుంచి రూ.160.51 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది.
* అహ్మదాబాద్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్‌లో ఆంధ్రాబ్యాంకు దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. బ్యాంకుకు రూ.4,000 కోట్ల రుణాలను కంపెనీ తిరిగి చెల్లించకపోవడంతో ఆంధ్రా బ్యాంకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.
*ఇన్ఫోసిస్‌ బోర్డు నుంచి స్వతంత్ర డైరెక్టర్‌ రవి వెంకటేశన్‌ తప్పుకున్నారు. సరికొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com