నేటి వాణిజ్య వార్తలు -06/13

*జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్తగా ఎక్స్‌ 3 పెట్రోల్‌ వేరియంట్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనాన్ని (ఎస్‌యూవీ) దేశీయ విపణిలో విడుదల చేసింది. దీని ధర రూ.56.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించారు. ఈ వాహనాన్ని చెన్నై ప్లాంటులో తయారు చేసినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.
*రిలయన్స్‌ జియో ప్రీ-పెయిడ్‌ వినియోగదారులకు శుభవార్త. రోజూ అదనంగా 1.5 జీబీ 4జీ డేటాను పొందే సదుపాయాన్ని జియో కల్పిస్తోంది.
*టెలికాం నూతన విధానానికి కేంద్ర మంత్రివర్గం జులై ఆఖరులో ఆమోదం తెలిపే అవకాశం ఉందని కేంద్ర సమాచార మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. జాతీయ డిజిటల్‌ సమాచార విధానం-2018 (ఎన్‌డీసీపీ) ముసాయిదాను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
* ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) కింద ఇచ్చే పింఛన్‌ పరిమితిని రూ.10000 వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
*విలాసవంత ఫర్నిచర్‌ను విక్రయించే ‘ఎలివేట్‌ ఎక్స్‌’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఖజానా గ్రూపు-ఇండియాకు చెందిన ఈ విక్రయశాలలో 20 దేశాల నుంచి దాదాపు 100కు పైగా ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు లభించనున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.20 వేలని నిర్వాహకులు తెలిపారు.
* ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు, బ్రెజిల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తమకు రూ.3900 కోట్ల రుణభారం (57.9 కోట్ల డాలర్లు) పేరుకుపోయిందని వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.
* మార్కెట్లో పోటీని ఎదుర్కోడానికి కొత్త సాంకేతికత, ఉత్పత్తి నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలనుకునే చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు.
*నిర్మాణ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని, దీనికి తగినట్లు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు ప్రయత్నిస్తున్నామని మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి రంజిత్‌ కుమార్‌ అన్నారు.
*విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు ‘సంసిద్ధంగా ఉండే’ ఒక విధానం లేకపోవడం ప్రభుత్వ తప్పు కాదని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈవీ అనేది ఇంకా ఒక కొత్త రంగమేనని, పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని మంగళవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు.
*ఇటీవల భారీ మోసానికి గురైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)తో పాటు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సహా మరో 13 భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ కౌంటర్‌పార్టీ రిస్క్‌ రేటింగ్‌ (సీఆర్‌ఆర్‌) ఇచ్చింది.
* నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధానికి చైనా, అమెరికాలో పేటెంటు లభించినట్లు సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పేర్కొంది. కొత్త రసాయనాల విభాగంలో లభించిన ఈ పేటెంట్లు 2034, 2036 వరకూ అమల్లో ఉంటాయని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
*రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ఆర్‌ఐటీఈఎస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా సంస్థలోని 12 శాతం వాటాకు సమానమైన 2.52 కోట్ల షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది.
*విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) ఆన్‌లైన్‌ కోర్సును ప్రారంభించింది. ఇందులోనే విమాన నిర్వహణకు సంబంధించి ఆరు నెలల సర్టిఫికెట్‌ ప్రోగామ్‌ను కూడా జత చేసింది. ఇందుకోసం ‘అమిటీ’ విశ్వవిద్యాలయంతో చేతులు కలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com