నేటి వాణిజ్య వార్తలు-06/14

*ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఐటీ/ఐటీఈఎస్‌ సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు నిమిత్తం కేంద్ర ప్రభుత్వ అనుమతిని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కోరింది. మొత్తం 10.43 హెక్టార్ల స్థలంలో ఈ సెజ్‌ను అభివృద్ధి చేసేందుకు కంపెనీ రూ.408.48 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ నెల 19న జరిగే సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా నేతృత్వంలోని మంత్రివర్గ బోర్డు, హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రతిపాదనను పరిశీలించనుంది.
*మేలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠ స్థాయి అయిన 4.87 శాతానికి చేరడంతో ఆర్‌బీఐ తన ఆగస్టు పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
*ముఖ గుర్తింపు(ఫేస్‌ రికగ్నిషన్‌) సదుపాయం అమలును ఆధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ ఒక నెల పాటు ఆలస్యం చేయనుంది. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలును జులై 1 నుంచి ఆగస్టు 1 కి వాయిదా వేసినట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సీఈఓ అజయ్‌ భూషణ్‌ పాండే పేర్కొన్నారు.
*ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆగస్టు నెల నుంచి తెలంగాణలో 4జీ సేవలు ప్రారంభించనుంది. తొలుత ఈ సేవలను జడ్చర్ల (మహబూబ్‌నగర్‌ జిల్లా), వైరా (ఖమ్మం జిల్లా)లో ప్రయోగాత్మకంగా అందించనున్నారు. డిసెంబరు నాటికి తెలంగాణ వ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) వి.సుందర్‌ తెలిపారు.
*వాహన, నిర్మాణ, ఎంఎఫ్‌సీజీ రంగాల్లో నియామకాలు పెరగడంతో మే నెలలో 11 శాతం వృద్ధి నమోదైందని నౌకరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ మే నెలలో 2,106 వద్ద నిలిచింది. గత ఏడాది మేలో నమోదైన సూచీ 1,904తో పోలిస్తే ఈసారి 11 శాతం వృద్ధి లభించింది.
* ఐసీఐసీఐ బ్యాంకు వివాదంతో సంబంధమున్న న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, మరో అయిదు ఇతర కంపెనీలను కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని బుధవారమిక్కడ కేంద్ర మంత్రి పి.పి. చౌధరి వెల్లడించారు.
*అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరిగాయి. ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం పెంచింది. తాజా పెంపుతో ఫెడరల్‌ ఫండ్‌ రేటు 1.75- 2.0 శాతానికి చేరింది. ఈ ఏడాదిలో ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి.
*గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) మూడింతలు పెరిగి 48.7 బిలియన్‌ డాలర్లకు లేదా జీడీపీలో 1.9 శాతానికి చేరింది. వాణిజ్య లోటు పెరగడం ఇందుకు నేపథ్యం.
*కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగ వార్షికోత్సవం సందర్భంగా టాటా టిగోర్‌లో కొత్త మోడల్‌ ‘టిగోర్‌ బజ్‌’ను టాటా మోటార్స్‌ విపణిలోకి విడుదల చేసింది.
*భారత్‌-22 ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) మలివిడత ఇష్యూను ఈ నెల 19న ప్రభుత్వం ప్రారంభించనుంది. మొదటి రోజు యాంకర్‌ ఇన్వెస్టర్లు, ఆ తర్వాతి రోజు నుంచి చిన్న మదుపర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 వరకు ఇష్యూ అందుబాటులో ఉంటుంది.
*మోన్‌శాంటో ఇండియాలో 26% వాటా కొనుగోలు నిమిత్తం రూ.1300 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ ప్రక్రియను బేయర్‌ గ్రూపు ప్రారంభించనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com