నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

ఉదయం.. ఆకలిని చల్లబరిచేది. తక్షణ శక్తికి వైద్యులు సూచించేది… గడబిడ లేకుండా జీర్ణమయ్యేది…. అర్ధరాత్రి.. అపరాత్రి అంటూ లేకుండా.. ఎప్పుడైనా మనసారా లాగించేది… ఏమిటది? అదే ఇడ్లీ. అన్ని వయసుల వారూ ఇష్టపడే ఆవిరితో ఉడికే అల్పాహారం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఇడ్లీకీ ఓ రోజుంది. ఏటా మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో భిన్నరుచులతో.. నోరూరించే ఇడ్లీ తయారు చేస్తూ కొత్త రుచులు అందిస్తున్నారు. కాలం మారినా.. ఆధునిక జీవనశైలికి అలవాటుపడినా.. హైదరాబాద్‌ నగరవాసుల తొలి ఓటు.. ఇడ్లీకే. ఉదయం వేళ.. సాయంత్రం సమయాల్లోనూ అల్పాహారంగా అధికశాతం మంది దీనికే జై కొడుతున్నారు. గత ఏడాది స్విజ్జీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిన విశేషమిది. ఇంతగా ఇష్టపడే ఇడ్లీలు.. మరింత రుచిగా.. సరికొత్తగా ఉండేందుకు సుమారు 50-60 రకాలతో పలు హోటళ్లు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. మెచ్చే రుచి… అబ్బా.. ఈ రోజూ అదే కూరా అనేవాళ్లున్నారేమో కానీ.. ఇడ్లీని వద్దనే వారు కనిపించరు. పిజ్జా, బర్గర్లు.. బిర్యానీ, కబాబ్స్‌.. ఎన్ని కొత్త రుచులు పలుకరించినా మన తిండిని ఎలా వదలుకుంటాం… ఇది సగటు గృహిణుల అంతరంగం. ఇందరు మెచ్చే ఈ అల్పాహారానికి పెద్ద చరిత్రే ఉందంటారు ఆహార నిపుణులు. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు కేరళ, ఆంధ్ర, తెలంగాణల్లో అల్పాహారంగా ఎక్కువ మంది తీసుకునే ఆహారం ఇదే. ఈ సంప్రదాయ తిండికి.. కర్ణాటక పుట్టినిల్లు అనేవారూ ఉన్నారు. క్రమంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చేరిందంటారు. తమిళనాడు ఇడ్లీ, సాంబారు అంటే ప్రసిద్ధి. దేశ, విదేశీ రుచులు లభించే గ్రేటర్‌ నగరంలోనూ 60-70 శాతం మంది అల్పాహారంగా ఇడ్లీకే ఓటేస్తున్నారు. ఈ జాబితాలో సంపన్నులు, సామాన్యులూ ఉన్నారు. చాలామంది ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. అమీర్‌పేట్‌లో ఇడ్లీబండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చే యాదగిరి చేతి రుచికి ఆ ప్రాంతంలో విపరీతమైన ఆదరణ. తెల్లవారుజామున 4 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ వచ్చే వారిలో ఎక్కువ మంది ఇడ్లీనే కావాలని అడుగుతారంటూ తన అనుభవాన్ని వివరించారాయన. మొదట్లో ఇడ్లీ పూర్తిగా మినుప పిండి, బియ్యం పిండిని కలిపి వండేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బియ్యం దిగుమతి సమస్య తలెత్తింది. అప్పుడు రవ్వతో ఇడ్లీ చేసేసి రవ్వ ఇడ్లీగా మార్చేశారు. మిగిలిన పదార్థాలతో పోలిస్తే ఇడ్లీ తయారు చేయటం చాలా తేలిక అంటారు గృహిణులు. రుబ్బిన పిండిన ఇడ్లీ పాత్రలో ఉంచితే చాలు కుటుంబానికి సరిపడా అల్పాహారం తయారవుతుందంటారు. అదే దోసె, పూరీ వంటి వాటికి సమయం ఎక్కువ. పైగా నూనె పదార్థాలు కావటంతో అరుగుదల సమస్య ఉంటుందనేది వారి అభిప్రాయం. నగరంలో ఉదయం 9.30 గంటలలోపు అల్పాహారం ముగించే వారే అధికం. వీరిలో అధికశాతం ఇడ్లీతోపాటు దోసె తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. అర్ధరాత్రి దాటాక జంక్‌ఫుడ్‌ కంటే ఆవిరి ఆహారమే ఉత్తమం అంటున్నారు. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, నిపుణులకు ఇదే మేలు అని పోషకాహార నిపుణుల మాట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com