నేను బతికున్నది ఆయన వలనే

2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెదేపా కీలక పాత్ర పోషిస్తుందని, తెదేపాను కాదని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ తెదేపా మహానాడులో ఆయన మాట్లాడారు. 1996లో తృతీయ కూటమి ఏర్పాటుచేసి దేవెగౌడను ప్రధానిగా చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు, భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుచేసిన ఘనత తెదేపాదన్నారు. తనకు ప్రధాని పదవి అవసరం లేదని 20 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ వద్దని చెప్పానన్నారు. ప్రధాని పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటే.. పదవుల కోసం కాదని, ప్రజాసేవ కోసమేననిఅన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలంతా పార్టీ వెంటే నడిచారని కొనియాడారు. తెలంగాణలో తెదేపా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో తెదేపా కృషి ఎంతో ఉందన్నారు.ఒకప్పుడు హైదరాబాద్‌లో తాగునీరు లేని పరిస్థితి ఉండేదని, ఈ రోజు మహానగరంగా మారిందంటే తెదేపా చేసిన కృషే అందుకు కారణమన్నారు. దేశంలోనే నంబర్‌ 1గా పేరొందిన బేగంపేట విమానాశ్రయం తెదేపా హయాంలో నెలకొల్పిందేనని గుర్తు చేశారు. రాష్ట్రమంతా రహదారులను వెడల్పు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతోందంటే గతంలో తాముచేసిన కృషిఫలితంగానేనన్నారు. భావితరాల భవిష్యత్తు కోసమే హైటెక్‌ సిటీ నిర్మించామని, విద్యకు ప్రాధాన్యం ఇచ్చి.. సైబరాబాద్‌ నగరానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రపంచమంతా తిరిగానన్నారు. రాష్ట్రంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దుచేసింది ఎన్టీఆరేనని, తెదేపా పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలుచేయకుండా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలుగుజాతికి న్యాయం జరగాలనే ఇటీవల కర్ణాటకకు వెళ్లానన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం అందరినీ కూడగట్టి ధర్మపోరాటం చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో తెదేపాను కాపాడుకుంటానని చంద్రబాబు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తెదేపా శ్రేణులు ఏడాది పాటు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే అంకితం కావాలని పిలుపునిచ్చారు. తిరుమల వెంకన్న ఆభరణాలు తన వద్ద ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారని, తనకు ప్రాణభిక్ష పెట్టింది తిరుమల వెంకటేశ్వరస్వామేనన్నారు. నక్సలైట్లు 24 క్లైమోర్లు ప్రయోగించినా స్వామి దయ వల్ల తనకేం కాలేదని గుర్తు చేసుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com