“నేను వెళ్లను గాక వెళ్లను”-మొండిపట్టు పట్టిన చందా. అయినా పంపించేసిన బోర్డు.

వీడియోకాన్‌ రుణాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో, ఎండీ చందాకొచ్చర్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. కార్పొరేట్‌ పాలనా అత్యున్నత ప్రమాణాల మేరకు, విచారణ పూర్తయ్యే వరకు సెలవుపై వెళ్లాలని చందాకొచ్చర్‌ నిర్ణయించినట్లు గత సోమవారం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సెలవు నిర్ణయాన్ని ఆమె స్వచ్ఛందంగా తీసుకోలేదని, ఇందుకు బోర్డు సభ్యులు చందాకొచ్చర్‌ను బలవంతంగా ఒప్పించాల్సి వచ్చిందని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. సమావేశంలో చాలా సేపు హైడ్రామా జరిగిన తర్వాత బోర్డు ఈ ప్రకటన వెలువరించినట్లు కొన్ని మీడియా వర్గాల కథనాలు పేర్కొంటున్నాయి. సెలవుపై వెళ్లాలని ఏ నియంత్రణ సంస్థలు అడగనప్పుడు తాను ఎందుకు సెలవు పెట్టాలని చందాకొచ్చర్‌ బోర్డు సమావేశంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఎల్‌ఐసీ ఛైర్మన్‌ మాత్రం ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారని సమాచారం. ఈ విషయమై చందాకొచ్చర్‌, ఇతర బోర్డు సభ్యుల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగినట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఒక దశలో ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో చందాకొచ్చర్‌ కోపంతో సమావేశం గది నుంచి బయటకు వెళ్లిపోయారట. దీంతో మిగతా సభ్యులు ఆమెను ఒప్పించి మళ్లీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చందాకొచ్చర్‌ సెలవుపై వెళ్లాలని తామంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సభ్యులు ఓ ప్రకటన తీసుకొచ్చారు. ఆ ప్రకటనకు ఆమె అంగీకరించలేదని మీడియా కథనాలు తెలిపాయి. అయితే చాలా సేపటి తర్వాత ఆమెను బలవంతంగా ఒప్పించి సెలవుపై పంపించారట. అనంతరం సెలవుపై వెళ్లాలని చందాకొచ్చర్‌ నిర్ణయించుకున్నట్లు బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎన్‌.శ్రీకృష్ణ నేతృత్వంలో అంతర్గత కమిటీని ఐసీఐసీఐ బ్యాంక్‌ గత నెలలో నియమించిన సంగతి విదితమే. చందాకొచ్చర్‌పై తొలుత ఆరోపణలు వచ్చినపుడు, ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. కొచ్చర్‌ నిబంధనలు ఏమీ ఉల్లంఘించలేదని బ్యాంక్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ ఎం.కె.శర్మ పేర్కొన్నారు. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని అప్పట్లో ఛైర్మన్‌గా ఉన్న కె.వి.కామత్‌ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిందనీ వెల్లడించారు. అయితే 4 నెలలు గడిచాక, రెండోవిడతగా మే 3న మరిన్ని ఆరోపణలు వచ్చినపుడు, స్వతంత్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమె సెలవులోనే ఉంటారు. చందాకొచ్చర్‌ సెలవుపై వెళ్లడంతో బ్యాంకు వ్యవహారాలు చూసేందుకు సీఓఓగా సందీప్‌ బక్షిని నియమించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com