పంజాబ్ బ్యాంకుకు ఆగ్రహంతో లేఖ రాసిన మోడీ

భారీ కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు లేఖ రాశారు. బ్యాంకు తన బ్రాండ్‌ విలువను నాశనం చేసిందని, దీని వల్ల బ్యాంకుకు అప్పులను కట్టే అవకాశాన్ని తగ్గించేశారని నీరవ్‌ ఆరోపించారు. బ్యాంకు చర్యల కారణంగా తాను అప్పులను కట్టగలిగే పరిస్థితి లేకుండా అన్ని మార్గాలను మూసేశారని ఆయన పేర్కొన్నారు. తాను చెల్లించాల్సిన డబ్బు బ్యాంకు చెప్తున్న దాని కంటే చాలా తక్కువ ఉంటుందని వెల్లడించారు. తన కుటుంబసభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయని, అయితే వారికి దీనితో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. నీరవ్‌ ఈ లేఖను ఫిబ్రవరి 15 అర్ధరాత్రి తర్వాత రాసి పంపినట్లు తెలుస్తోంది. ‘నా నుంచి చెల్లించాల్సిన డబ్బును త్వరగా రాబట్టుకోవాలని ఆత్రుతతో.. మీరు నా ఆఫర్‌ను అంగీకరించడానికి బదులుగా విషయాన్ని బహిర్గతం చేశారు. దీని వల్ల నా బ్రాండ్‌ విలువ పడిపోయింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. డబ్బు తిరిగి చెల్లించే అవకాశాన్ని మీరే తగ్గించేశారు’ అని నీరవ్‌ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న దాదాపు రూ.11,400కోట్ల భారీ మోసాన్ని పీఎన్‌బీ బహిర్గతం చేసింది. అయితే ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీల మధ్య నీరవ్‌ మోదీకి, బ్యాంకు అధికారులకు మధ్య ఈమెయిల్స్‌ ద్వారా చర్చ జరిగింది. ఈ కుంభకోణంతో దాదాపు రూ.11వేల కోట్లు నష్టపోయినట్లు పీఎన్‌బీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అయితే నీరవ్‌ మోదీ గ్రూప్‌ చెల్లించాల్సిన మొత్తం చాలా తక్కువ అని, బ్యాంకు చెప్తున్న మొత్తం పూర్తిగా తప్పని నీరవ్‌ ఆరోపించారు. తన ఫైర్‌స్టా్ర్‌ గ్రూప్‌, ఇతర విలువైన ఆస్తులు అమ్మడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దేశీయంగా తన వ్యాపారం విలువ రూ.6,500కోట్లు ఉంటుందని నీరవ్‌ తెలిపారు. దీని ద్వారా కొంత డబ్బు చెల్లించవచ్చని.. అయితే అందుకు అవకాశం లేకుండా తన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు సీజ్‌ చేశారని తెలిపారు. తన ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌, ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఏ బ్యాంకుకు అప్పు లేవని, వాటికి సంబంధించి భద్రతకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు. చివరగా తనకు బ్యాంకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చెల్లించాల్సిన డబ్బు తిరిగి చెల్లించేందుకు బ్యాంకు మద్దతు అవసరమని అన్నారు. అలాగే తన భార్యకు తన వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన మామ ఛోక్సీది వేరే వ్యాపారమని, తన బ్యాంకు లావాదేవీలతో ఆయన కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని నీరవ్‌ చెప్పారు. తర్వాతి పరిణామాలేవైనా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తన కంపెనీలకు చెందిన దాదాపు 2,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు బ్యాంకు అనుమతి ఇవ్వాలని చివరగా ఆయన లేఖలో కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com