పద్నాలుగేళ్లకే నన్ను రేప్ చేశారు

తాను చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, పద్నాలుగేళ్లకే అత్యాచారానికి గురయ్యానని ప్రముఖ హాలీవుడ్‌ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్‌ బహిర్గతం చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి సమావేశాల్లో ఆష్లే పాల్గొని మాట్లాడారు. లింగవివక్ష గురించి, మహిళలపై అకృత్యాల గురించి ప్రసంగించిన ఆష్లే తానూ ఆ హింసకు బాధితురాలినేనని తెలిపారు. ‘నేను ఏడేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యా, 14ఏళ్లకు అత్యాచారానికి గురయ్యా, మళ్లీ 1998లో నాపై అత్యాచారం జరిగింది. అయితే నేను అక్రమ రవాణా బారిన పడకపోవడం మాత్రం అద్భుతం’ అంటూ 48ఏళ్ల ఆష్లే అక్రమ రవాణా బాధితుల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశాల కోసం భారత్‌ వచ్చిన ఆష్లే వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఆమె కుడి చేతికి మెహందీ పెట్టుకుని కనిపించారు. అందరికీ నమస్తే అంటూ పలకరించారు. అయిదు నిమిషాల ప్రసంగాన్ని ముగించే సమయంలో హిందీలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. మహిళలపై లైంగిక దోపిడి, హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. హాలీవుడ్‌లోనూ లింగ వివక్ష చూపుతున్నారని, నటీనటులకు ఇచ్చే పారితోషికంలో చాలా తేడా ఉంటోందన్నారు. మహిళలపై వివక్ష చూపుతున్నారని ఆష్లే ఆరోపించారు. దీని వల్ల తాను సహ నటుల(పురుషులు)తో పోలిస్తే సంపాదించాల్సిన దాని కంటే 40శాతం తక్కువ సంపాదిస్తున్నానని చెప్పారు. ఆష్లే అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్‌ స్టార్‌ నయోమి జడ్‌ కుమార్తె. గతంలో కూడా ఆష్లే తనను హాలీవుడ్‌ స్టూడియో ఎగ్జిక్యూటివ్‌ ఒకరు లైంగికంగా వేధించారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలసీలను వ్యతిరేకించిన హాలీవుడ్‌ సెలబ్రిటీలలో ఆష్లే కూడా ఒకరు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com