క్యాల్షియం అనగానే ఎక్కువ మంది దృష్టి పాలు, పెరుగు, వెన్న వీటి మీదికే వెళుతుంది. ఇవి నిత్యమూ అందరికీ అందుబాటులో ఉండే ఆహార పదార్థాలే. కాకపోతే కొంత మందికి ఈ పాల ఉత్పత్తులు అసలే పడవు. మరి వారి సంగతేమిటి? వారంతా ఆకుకూరల వినియోగాన్ని పెంచడం ఒక పరిష్కారం. సగటున ప్రతి ఒక్కరికీ రోజుకి 1000 మి, గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఆ మోతాదు క్యాల్షియం లభించడం లేదనిపించినప్పుడు సహజంగానే క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి సిద్ధమవుతాం. కాకపోతే ఈ మాత్రలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికీ, గుండె జబ్బులు రావడానికీ దారి తీస్తాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అదే మోతాదు క్యాల్షియం అందించే ప్రకృతి సిద్దమైన ఆకు కూరలతో ఈ సమస్యలకు తావు లేదు. అయితే క్యాల్షియంతో పాటు కొన్ని ప్రధానమైన విటమిన్లు కూడా ఈ ఆకుకూరల్లోంచి లభిస్తాయి. రోజూ సలాడ్ తీసుకునేవారికి ఇవన్నీ మామూలుగానే లభిస్తాయి. ఇవి కాకుండా కొన్ని రకాల గింజధాన్యాల నుంచి కూడా ఇవి లభిస్తాయి. కేవలం ఒక గ్లాసు కమలా పండు రసంలోంచి 300 మి. గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది కప్పు పాలలోంచి లభించే క్యాల్షియానికి సమానం. బాదాం పప్పులోంచి కూడా ఇదే స్థాయి క్యాల్షియం లభిస్తుంది. అలాగే గ్లాసు సోయా పాలల్లోంచి 60 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుంది.