పాసుపోర్టులో చిరునామా ఉండదు

రాబోయే రోజుల్లో పాస్‌పోర్టులో చిరునామా కనిపించదు. కేవలం బార్‌ కోడ్‌ రూపంలోనే చిరునామాను ముద్రించనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి శాఖకు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు మాత్రమే అది కనిపిస్తుంది. ఈ విధానాన్ని త్వరలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న నంబరు సిరీస్‌ ముగిసిన వెంటనే నూతన విధానం అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్రం వ్యూహం. పునరుద్ధరించుకునే, కొత్త పాస్‌పోర్టులకు మాత్రమే నూతన విధానం వర్తిస్తుంది. చెల్లుబాటు కాలం ఉన్న వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.ప్రస్తుతం పాస్‌పోర్టు పుస్తకం చివరిలో పాస్‌పోర్టుదారుడి పూర్తి చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, చెల్లుబాటు వ్యవధి తదితర సమాచారం ఉంటుంది. ఇక నుంచి ఆ పేజీలో చిరునామా స్థానంలో బార్‌కోడ్‌ ఉండనుంది. ఆ కోడ్‌ను విమానాశ్రయాల్లో స్కాన్‌ చేసిన వెంటనే పాస్‌పోర్టుదారుడి చిరునామాతోపాటు మునుపటి వివరాలన్నీ అధికారులకు కనిపిస్తాయి. పాస్‌పోర్టు ఉన్నవారి వివరాలను భద్రంగా ఉంచే క్రమంలోనే ప్రభుత్వం బార్‌కోడ్‌ను ప్రతిపాదించిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇది కేవలం ప్రయాణానికి గుర్తింపులాంటిదని అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో నూతన విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చిన తరువాత నూతన విధానాన్ని అమలు చేస్తామని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ప్రతినిధి ఒకరు మంగళవారం చెప్పారు. చిరునామా రుజువు (అడ్రస్‌ ప్రూఫ్‌)ల జాబితా నుంచి పాస్‌పోర్టును తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బార్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చిరునామాకు రుజువుగా పరిగణించేందుకు 21 రకాల పత్రాలను కేంద్రం గతంలోనే ఎంపిక చేసింది. ఆధార్‌కు ప్రాచుర్యం పెరిగిన నేపథ్యంలో ఆ జాబితా నుంచి పాస్‌పోర్టును తొలగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com