పిట్స్ బర్గ్ అర్చకులకు తితిదే శిక్షణ

శ్రీ వేంకటేశ్వరస్వామివారి స్వర్ణాభరణాలను ప్రదర్శించాలని తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందుకు దేవస్థానం ఆగమ సలహా మండలి అనుమతిని కోరింది. అనుమతిరాగానే భారీ భద్రతను కల్పించి భక్తుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రదర్శించాలని సంకల్పించింది. మిరాశీ వ్యవస్థ రద్దు అయిన అనంతరం ఆలయ అధికారులకు అప్పగించిన ఆభరణాలన్నింటినీ తిరువాభరణం దస్త్రాల్లో నమోదు చేసిన మేరకు ప్రదర్శనకు ఉంచాలని తీర్మానించింది. తిరుమలలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగింది. అజెండాలోని 208 అంశాలపై చర్చ మొదలు పెట్టగానే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వ్యవహారంపై ముందుగా చర్చించాలని మండలి సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, పొట్లూరి రమేష్‌బాబు, కె.రాఘవేంద్రరావు తదితరులు పట్టుబట్టారు. ఈ నెల 26న మరో సమావేశం నిర్వహించి అధ్యక్షుడితో పాటు సభ్యులు ఆభరణాలు పరిశీలించాలని నిర్ణయించారు. ఇందుకు కూడా ఆగమ సలహా మండలి అనుమతి తీసుకోవాలని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు సూచించారు. తవ్వేసినట్లుగా రమణదీక్షితులు ఆరోపిస్తున్న వకుళామాత పోటును పరిశీలించాలని కూడా నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పవిత్రత, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వ్యక్తులకు లీగల్‌ నోటీసులు ఇవ్వాలని తీర్మానించారు. వెంటనే ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో ప్రసారమైన, ప్రచురితమైన వార్తలను పరిశీలించి పరువునష్టం కలిగించిన వ్యక్తులను గుర్తించాలని దేవస్థానం న్యాయవిభాగాన్ని ఆదేశించింది. లీగల్‌ నోటీసులు ఇచ్చి న్యాయపోరాటం చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయరాదని కూడా నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు అందుకోనున్నవారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుట్టా సుధాకర యాదవ్‌ మాట్లాడుతూ.. రమణదీక్షితులు రోజుకో నగరానికి వెళ్లి అసత్య ఆరోపణలు చేయడం కాదు… ధైర్యం ఉంటే ధర్మకర్తల మండలి ముందుకు వచ్చి నిరూపించాలని, లేని పక్షంలో తగు చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పులు జరిగిఉంటే తమ ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకుంటామని, అసత్య ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు.

సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు..
* దళిత, గిరిజన, మత్య్సకారుల ఆవాసాల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల కేటాయింపును రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
* చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వేద పాఠశాల ఏర్పాటు
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తితిదే ఆస్పత్రులు, అనుబంధ ఆస్పత్రుల్లో మందులు పంపిణీ, వైద్య పరికరాల కోసం రూ.4.84 కోట్లు కేటాయింపు
* తిరుపతి అలిపిరి సమీపంలో టాటా ట్రస్టు ద్వారా క్యాన్సన్‌ ఆస్పత్రి నిర్మాణానికి ఎకరాకు ఏడాదికి రూ.లక్ష వంతున 33 సంవత్సరాల పాటు లీజు ప్రాతిపదికన 25 ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం
* అలిపిరి- చెర్లోపల్లి రహదారి మార్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న సైన్స్‌ మ్యూజియం నిర్మాణానికి 19.15 ఎకరాలు, సైన్స్‌ సిటీకి 50.96 ఎకరాలు కేటాయింపు. ఎకరాకు ఏడాదికి రూపాయి వంతున లీజు తీసుకోవాలని నిర్ణయం
* తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత మరింత పెంపు కోసం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వీడియోవాల్‌ ఏర్పాటుకు రూ.1.60 కోట్లు మంజూరు
* తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాల విద్యార్థులకు ఇస్తోన్న తరహాలో శ్రీవేంకటేశ్వర వేదిక్‌ యూనివర్శిటీ విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3 లక్షలు డిపాజిట్‌ చేయాలని నిర్ణయం
* శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీబాలాజీ వేద పరిపోషణ
ట్రస్టు ఏర్పాటుకు తీర్మానం. ఈ ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస ఇతర సదుపాయాలను కల్పించాలని ఆమోదం
* చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి సమేత శ్రీపద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి అనుమతి
* రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి వారి నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయం.
* అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు ఆగమ సంప్రదాయాలపై శిక్షణ శిబిరం నిర్వహించేందుకు ఆమోదం.
* 2018-19 సంవత్సరానికి గాను టిటిడి ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ పరికరాలను రూ.4.84 కోట్లతో కొనుగోలు.
* చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి ఆమోదించాం.
* 29 మంది ఇంజినీరింగ్‌ మజ్దూర్లను హెడ్‌ మజ్దూర్లుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు ఆమోదం.
* భక్తుల లగేజి, సెల్‌ఫోన్‌లను తిరుపతి, అలిపిరి, శ్రీవారిమెట్టు నుండి తిరుమలకు తరలించేందుకు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 3 సంవత్సరాల కాల పరిమితికి డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి ఇచ్చేందుకు ఆమోదం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com