పూరి తలుపులు తెరిచారు

విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో రెండేళ్ల రెండు నెలల తర్వాత సోమవారం సాయంత్రం 5.30 గంటలకు జగ్మోహన ద్వారం తలుపులు తెరిచారు. అంతకు ముందు శ్రీక్షేత్ర యంత్రాంగం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. సేవలు ఆలస్యమైనందున మధ్యాహ్నం తెరవాల్సిన తలుపులను సాయంత్రం తెరిచారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జగ్మోహన ద్వారం తలుపులు తెరిపించిన సంగతి గమనార్హం. జగన్నాథ ఆలయ మరమ్మతులను పర్యవేక్షిస్తున్న పురావస్తుశాఖ 2016 జనవరి నెలాఖరులో జగ్మోహన(గర్భగుడి) పైకప్పు మరమ్మతులు ప్రారంభించింది. ఇటీవల పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) పనులు పూర్తయినట్లు న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు జగ్మోహన తలుపులు తెరవాలని ఆలయ యంత్రాంగానికి ఆదేశించింది. ఏప్రిల్‌ 16లోగా దీనిని అమలుచేయాలని సూచించింది. కోర్టు తన ఉత్తర్వులలో గర్భగుడిలోకి సేవలతో సంబంధం ఉన్న అర్చకులు మాత్రమే ఉండాలని, ఇతరులను అనుమతించరాదని స్పష్టం చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల సేవలు విభిన్నవర్గాల సేవాయత్‌లు కలసిమెలసి చేపట్టేవారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పళ్యాసేవకులు మాత్రమే సోమవారం సేవలలో పాల్గొన్నారు. దీని వల్ల నిర్ణీత వేళల్లో సేవలు సాధ్యం కాలేదు, స్వల్పంగా ఆలస్యమైందని ఆలయ సమాచారశాఖాధికారి లక్ష్మీధరపూజాపండా సాయంత్రం చెప్పారు. మరోవైపు అందరు సేవకులు అన్నివేళల్లో జగ్మోహన గుడిలోకి వెళ్లగలిగేలా కోర్టులో రివ్యూపిటీషన్‌ వేయడానికి సేవాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. పళ్యాసేవాయత్‌లు మాత్రమే గర్భగుడిలోకి వెళితే నిర్ణీత వేళలలో జగన్నాథుని సేవలు సాధ్యం కావు. అందరూ పాల్గొనాల్సి ఉండగా, దీనిపై కోర్టుకి తెలియజేస్తామని సేవాయత్‌ ప్రతినిధి బినాయక్‌దాస్‌ మహాపాత్ర్‌ చెప్పారు. మరోవైపు రెండేళ్ల తరువాత జగ్మోహన తలుపులు తెరుచుకోవడంతో భక్తులలో ఆనందం వెల్లివిరిసింది. సాయంత్రం జగ్మోహన ద్వారానికి ఎదురుగా యంత్రాంగం అమర్చిన బారికేడ్ల వద్ద నుంచి ముగ్గురు మూర్తులను దర్శనం చేసుకుని మురిసిపోయారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com