పెరియార్ రాయలసీమ వాడే

ద్రావిడ ఉద్యమానికి పితగా పేరొందిన పెరియార్‌పై భాజపా జాతీయ నేత హెచ్‌.రాజా చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్‌ పట్టణంలో 1879 సెప్టెంబరు 17న పెరియార్‌ ఈరోడ్‌ వేంకట రామస్వామి నాయకర్‌ జన్మించారు. అనంతరం తందై పెరియార్‌, రామస్వామి, ఈవీఆర్‌, పెరియార్‌గా సుప్రసిద్ధులయ్యారు. నాస్తికవాది అయిన ఆయన సంఘ సంస్కర్తగా రాష్ట్రంలో ఆత్మగౌరవ, ద్రావిడ ఉద్యమాలను ప్రారంభించారు. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశ్వనాథస్వామి దర్శనం కోసం 1904లో కాశీకి వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన అవమానంతో నాస్తికుడిగా మారారని పలువురు ఆయన సన్నిహితులు చెబుతారు. హేతువాదిగా మారి హిందూమతాన్ని, అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నారని పేర్కొంటారు. ముఖ్యంగా బ్రాహ్మణవర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన్ను దగ్గరి నుంచి చూసినవారు తెలిపేవారు. పెరియార్‌ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు చెందినవారు కాగా… వ్యాపారం రీత్యా పెరియార్‌ తండ్రి కర్ణాటకలో నివసించారని ప్రచారంలో ఉంది. 1919 నుంచి 1925 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పెరియార్‌…. ఆ స్ఫూర్తితో అనంతరం కొంతమంది అనుచరులతో కలసి స్వాతంత్య్రం కన్నా సాంఘిక సమానత్వం సాధించాలని ఉద్యమించారు. అన్ని కులాలవారికీ సమానంగా దేవాలయాల ప్రవేశం ఉండాలని వాదించారు. 1937లో రాజాజీ నేతృత్వంలోని మద్రాసు ప్రెసిడెన్సీ కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందీ భాషను రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినప్పుడు పెరియార్‌ వ్యతిరేకించారు. అప్పటికే ప్రారంభించిన జస్టిస్‌ పార్టీ తరఫున హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. చివరకు అది తీవ్రరూపం దాల్చి హిందీ బోధనను రాష్ట్రంలో విరమించేంతవరకు దారితీసింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి జస్టిస్‌ పార్టీని ద్రావిడర్‌ కళగం అనే సామాజిక ఉద్యమ సంస్థగా మార్చారు. ఇదే సమయలో రాజకీయంగా మొగ్గుచూపిన కొందరు ఆయన అనుచరులు, మద్దతుదారులు అన్నాదురైతో కలసి ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)ను ప్రారంభించారు. అన్నాదురై మరణం తర్వాత ఆ పార్టీకి కరుణానిధి నాయకత్వం వహిస్తున్నారు. కరుణానిధితో విభేదించిన ఎంజీ రామచంద్రన్‌ డీఎంకే నుంచి బయటకు వచ్చి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)ను స్థాపించారు. ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల త్రిపురలో లెనిన్‌ విగ్రహం ధ్వంసం కావడం, ఆ నేపథ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా ఫేస్‌బుక్‌ పోస్టు కారణంగా రాష్ట్రంలో దుమారం రేగింది. లెనిన్‌కు పెరియార్‌కు సంబంధం ఏంటి? ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పెరియార్‌ విగ్రహానికి ఎందుకు ముడిపెట్టాల్సివచ్చింది? అసలు పెరియార్‌ ఎవరు? వంటి అంశాలు రాష్ట్రంలో చర్చకు వచ్చాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో పుట్టిన ఈరోడ్‌ వేంకట రామస్వామి నాయకర్‌ చదువుకుంటున్న రోజుల్లోనే తండ్రి వ్యాపారంలో భాగస్వామ్యం వహించారు. అలా కాంగ్రెస్‌ పార్టీకి ఆకర్షితులై తర్వాత అందులోనుంచి బయటకు వచ్చారు. తన కార్యక్రమాలతో ద్రావిడ ఉద్యమ పితగా ఎదిగారు. తంతై పెరియార్‌గా ప్రాముఖ్యం పొందిన ఈవీ రామస్వామి జయంతి వేడుకలను ఏటా ద్రావిడ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటాయి. త్రిపురలో ఇటీవల భాజపా అధికారంలోకి వచ్చింది. గంటల్లోనే అక్కడ లెనిన్‌ విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో కూడా దుమారం రేగింది. అనంతరం ఆయన తన పోస్టును తొలగించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ రాష్ట్రంలో పెరియార్‌ విగ్రహం ధ్వసం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ద్రావిడ పార్టీల నాయకులతోపాటు పలువురు నటులు, ఇతర ప్రముఖులు రాజా వ్యాఖ్యలను ఖండించారు. విగ్రహాల ధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించడం, ఆ చర్యలను ఖండించిన నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రత కల్పించారు. దీంతో పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పెరియార్‌ గురించి మరోసారి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com