పెళ్లికి ముందు విందు భోజనాలు ఏమిటీ?

మన సనాతన ధర్మాలలో వివాహానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. వివాహాల గురించి శాస్త్రం ఏం చెప్పిందో, మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో ఆచరించాలే తప్ప, ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్న రీతిలో వ్యవహరించకూడదు. మన రుషులు ఏం చెప్పినా, పెద్దలు ఏది ఆచరించినా అది మన అభ్యున్నతి కోసమే. వివాహం అంటే విశిష్టమైన ఆశ్రమం పొందటం అని అర్థం. అంటే పురుషుడు అప్పటివరకు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటాడు. అతడు ధర్మపత్నిని స్వీకరించడం ద్వారా ధర్మ, అర్థ కామాలను అనుభవించి తద్వారా మోక్షాన్ని పొందటానికి ఆశ్రమం మారుతున్నాడు. మన శాస్త్రాలు ఘోషిస్తున్నట్లు వివాహాలలో అనేక క్రతువులు ఉన్నాయి. ఆ క్రతువులను అలా ఆచరిస్తేనే ఆ నవ దంపతులు తప్పక అభ్యున్నతిని పొందుతారు.
అయతే, కాలగతిలో వివాహ వ్యవస్థలో అనేక కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయ. వీటిలో కొన్ని మన శాస్త్రాలకు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటున్నాయ. కొన్ని పద్ధతులను ఎవరు, ఎందుకు మొదలుపెట్టారో తెలియదు కానీ, వేలం వెర్రిగా మిగతా వారూ వాటిని ఆచరించడం విడ్డూరం అనిపిస్తుంది. ఈ కోవకు చెందినదే పెళ్లికి ముందు ‘రిసెప్షన్’ వేడుక. పెళ్లికి ముందే జరిగే ‘రిసెప్షన్’ వివరాలను శుభలేఖలో సైతం పేర్కొంటున్నారు. అంటే దీనికి ఆధునిక వివాహాల్లో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. మూడు ముళ్లు వేయడానికి ముందే ‘రిసెప్షన్’ వేడుక నిర్వహించి, అమ్మాయిని, అబ్బాయిని పక్క పక్కన కూర్చోబెడుతున్నారు. వారు అందరి సమక్షంలో దండలు మార్చుకుంటున్నారు. మరి వచ్చిన పెద్దలందరినీ ఆశీర్వదించమంటే శాస్త్రం తెలిసిన వారు ఎలా ఆశీర్వదిస్తారు. ఏదో పుట్టినరోజు వేడుకైతే- ‘కళ్యాణమస్తు, వివాహ ప్రాప్తిరస్తు, విద్యాబుద్ధులు ప్రాప్తిరస్తు’- అని దీవిస్తారు. మరి- రిసెప్షన్‌లో కూర్చున్న జంటని పెద్దలు ఏమని ఆశీర్వదించాలి? ఇలాంటి రిసెప్షన్‌ల్లో ముఖ్యంగా కన్యాదాత, వరుడి తండ్రి ఆ జంటను ఏ రకంగా కుర్చీలు వేసి కూర్చోబెడతారు? కన్యాదాత కన్యాదానం చేశాడా? సుముహూర్తం అయిందా? మాంగల్యధారణ జరిగిందా? ఏం జరిగిందని వారిద్దరినీ అలా కుర్చీల్లో కూర్చోబెట్టి వివాహం కాకమునుపే విందు భోజనాలు పెడుతున్నారు? నిజంగా ఉపాసనా బలం ఉన్న పెద్దలైతే వారి శక్తి అంతా తుడిచిపెట్టుకొని పోతుంది. వారి పుణ్యఫలం కూడా కరిగిపోతుంది. మన వివాహ వ్యవస్థలో రిసెప్షన్ అన్న పదానికి తావులేదు. ఎందుకంటే రిసెప్షన్‌లో మనం ఏం చేస్తున్నాం? వేదిక మీద చక్కగా మహారాజా కుర్చీలు వేస్తున్నాం. చక్కగా అబ్బాయి, అమ్మాయి పక్కపక్కన కూర్చుని సరదాగా గడుపుతారు. ఆ వేదికమీదకి చెప్పులు వేసుకుని కూర్చొనకూడదు. ఎందుకంటే మనం వివాహ క్రతువు నిర్వహించేటప్పుడు 33 కోట్లమంది దేవతలను, ఇంద్రుడి భార్య శచీదేవిని తన సపరివార సమేతంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామని అర్థం. మంత్రాలతో వారందరినీ పిలుస్తున్నాం. ఆ జంట చెప్పులు వేసుకుని వేదిక మీద కూర్చుంటే దేవతలను ఆహ్వానించి అవమానించినట్టే కదా! ఇది ఎంతవరకు సబబు? ఇక, శాస్త్ర ప్రకారం కన్యాదానం కాకుండా భోజనాలు పెట్టకూడదు. విందు అన్న మాట అసలు లేనేలేదు. ‘నేను కన్యాదానం చేసినందుకు, ఇంత గొప్ప క్రతువును పెద్దల ఆశీర్వాదబలంతో ఆచరించినందుకు నన్ను, నా కూతురు, అల్లుడిని ఆశీర్వదించడానికి మీరంతా వచ్చారు. దానికి కృతజ్ఞతగా, శాంతిగా మీరందరూ మృష్టాన్న భోజనం స్వీకరించాలి’-అని కన్యాదాత అన్నదానం చెయ్యాలి. అయతే, ఆధునికత పుణ్యమాని ఇప్పుడు వివాహం అంటే ఎన్ని పూటలు భోజనం పెడతారన్న ధోరణిలోనే పెళ్లి మాటలన్నీ జరిగిపోతున్నాయి. సంప్రదాయాల ప్రకారం రిసెప్షన్ అన్న పదానికి తావు లేనపుడు ఇంత హడావుడి దేనికి? కన్యాదాత ముందే నిర్ణయించుకుని వరుడి తండ్రితో చెప్పుకోవాలి. సుముహర్తం ఏ సమయానికి ఉన్నప్పటికీ పెళ్లి రోజునే భోజనం పెట్టాలి. శాస్త్రోక్తంగా వివాహం జరిగిన తరువాతే- అవసరమని అనిపిస్తే రిసెప్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతో ఖర్చుపెట్టి ఎంతో వైభవంగా పెళ్ళిళ్లు ఎందుకు చేస్తున్నామో ఆలోచించాలి. కొత్త దంపతుల అభ్యున్నతి, వారి అన్యోన్యత గురించే కదా! అని ఉభయులూ ఒక మాటమీదకి వస్తే మన శుభలేఖలలో రిసెప్షన్ అన్న పదాన్ని తేలికగా తీసివేయవచ్చు. ఈ పోకడలో యువతను తప్పుపట్టడానికి లేదు. కొన్ని విషయాల్ని వారికి సవివరంగా తెలియచేస్తే, పెద్దలు తమ కోసమే కదా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వారు వెంటనే ఒప్పుకుంటారు. ఆశీర్వదించే వారు కూడా మనస్ఫూర్తిగా అందుకు సిద్ధపడతారు. పెద్దల ఆశీర్వాదబలంతో కొత్త దంపతులు చక్కటి అభ్యున్నతిని పొందుతారు. ఆశీర్వదించేవారు కూడా మన ఆతిథ్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com