పొంతన లేని కబుర్లు చెప్తున్నారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై ఎన్నో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. జయలలిత స్నేహితురాలు శశికళ, వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌లు ఇచ్చిన వాంగ్మూలంలో అమ్మ ఆస్పత్రిలో చేరినప్పుడు జరిగిన ఘటనలపై కాస్త భిన్న స్వరాలు వినిపించడం వివాదంగా మారింది. జయలలిత మరణంపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్‌కు శివకుమార్‌ ఇచ్చిన వాంగ్మూలంలో.. 2016 సెప్టెంబరు 22న సాయంత్రం 7 గంటల సమయంలో శశికళ తనకు ఫోన్‌ చేసిందని, అమ్మ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారని దీంతో తాను రాత్రి 8.45గంటలకు జయ నివాసానికి వెళ్లినట్లు చెప్పారు. సాయంత్రం తాను అమ్మతో మాట్లాడినప్పుడు సాధారణంగానే ఉన్నారని శివకుమార్‌ అన్నారు. అయితే ఏడు గంటలకు శశికళ ఫోన్‌ చేసినట్లు చెప్పారు. కాగా, శశికళ మాత్రం కమిషన్‌‌కు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా కూడా తాను శివకుమార్‌కు ఫోన్‌ చేసినట్లు చెప్పలేదు. జయలలిత నీరసంగా కన్పిస్తుంటే ఆస్పత్రికి వెళ్దామని అడిగానని, కానీ, తాను బాగానే ఉన్నానని ఆస్పత్రికి అవసరంలేదని అన్నారని తెలిపారు. తర్వాత జ్వరం ఎక్కువయ్యిందని రాత్రి 9 గంటల సమయంలో డా.శివకుమార్ పోయెస్‌ గార్డెన్‌కు వచ్చారని చెప్పారు. జయలలిత నివాసానికి వెళ్లినప్పుడు అక్కడ తనకు తెలియని ఇద్దరు పనివాళ్లు కనిపించారని, కానీ, వారిని గుర్తించగలనని డా.శివకుమార్‌ తన వాంగ్మూలంలో చెప్పారు. అయితే శశికళ ఇచ్చిన వాంగ్మూలంలో.. పనివాళ్ల గురించి ప్రస్తావించలేదు. జయలలిత స్పృహ తప్పి పడిపోవడానికి ముందు ‘సుమారు 9.30 సమయంలో మొదటి అంతస్థులోని గదిలో నేను అక్క(జయలలిత)తో పాటు ఉన్నాను. పళ్లు తోముకోవడానికి జయలలిత నెమ్మదిగా నడుచుకుంటూ బాత్రూంకు వెళ్లారు. లోపలి నుంచి శశి తల తిరుగుతోంది ఇటు రా అన్నారు. నేను లోపలికి వెళ్లి తనను పట్టుకుని తీసుకొచ్చి మంచంపై కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాను. అకస్మాత్తుగా జయ స్పృహ తప్పి నా భుజంపై వాలిపోయింది. అప్పుడే శివకుమార్‌ గదిలోకి వచ్చారు’ అని శశికళ వెల్లడించారు. అయితే శివకుమార్‌ ఇచ్చిన వాంగ్మూలంలో.. ‘నేను అమ్మ నివాసానికి వెళ్లే సరికి ఆమె దగ్గు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జయలలిత నన్ను వెళ్లమన్నారు. కానీ, నేను వెళ్లలేదు. అపోలోకు ఫోన్‌ చేసి నెబ్‌లైజర్‌ పంపించమన్నాను. జయలలిత ఎలాంటి సహాయం లేకుండా బాత్రూంకు వెళ్లారు. అయితే నిరంతరాయంగా దగ్గుతూనే ఉన్నారు. బయటకు రాగానే స్పృహ తప్పి నా మీద, శశికళ మీద పడిపోయారు. నేను వెంటనే అపోలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రీతా రెడ్డి భర్త విజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్‌ పంపిచమని అడిగాను’ అని చెప్పారు. తర్వాత అంబులెన్స్‌లో జయలలితకు స్పృహ వచ్చిందని తాను ఎక్కడున్నానని అడిగారని శశికళ చెప్పారు. అయితే శివకుమార్ మాత్రం జయలలితకు రక్తపరీక్షలు, ఈసీజీ, మరికొన్ని పరీక్షలు చేసిన తర్వాతే స్పృహలోకి వచ్చారని అప్పుడు ‘నేను ఎక్కడున్నాను’ అని అడిగారని వెల్లడించారు. సెప్టెంబరు 22న ఐసీయూ వెలుపల ఉన్నతాధికారుల విషయంలోనూ ఇద్దరూ వేర్వేరుగా స్పందించారు. ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్‌ ఇతర అధికారులు, పోలీసు అధికారులు, అపోలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను జయలలిత తల ఊపి గుర్తించారని శశికళ చెప్పారు. శివకుమార్‌ మాత్రం అపోలోలో ప్రభుత్వ అధికారులను చూసినట్లు తనకు గుర్తులేదని అన్నారు. జయలలిత అపోలో ఆస్పత్రిలో 2016 డిసెంబరులో మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఉన్న సమయంలో జయలలిత వద్దకు ఎవ్వరినీ అనుమతించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com