పొత్తు చిత్తవుతోందా? అంతటా ఉత్కంఠ-TNI ప్రత్యేకం

కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించింది. వాస్తవానికి మొదటి నుండి భాజపా ప్రభుత్వం రాష్ట్రం పట్ల చిన్న చూపే చూస్తోంది. తెదేపా నేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో సర్దుబాటు ధోరణిలో ఉంటూ వస్తున్నారు. కానీ ప్రధాని మోడీ ప్రభుత్వం మాత్రం తెదేపా ప్రభుత్వంతో కలిసి వచ్చేటట్లుగా పరిణామాలు కనిపించడం లేదు. “పోమ్మనకుండా పోగబెట్టినట్లుగా” భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిన్నటి బడ్జెట్ లో భాజపా వైఖరి స్పష్టంగా తెలుగు ప్రజలకు అర్థమైంది. ఇప్పటి వరకు సర్దుబాటు ధోరణి ప్రదర్శించిన చంద్రబాబునాయుడు గురువారం రాత్రి పార్టీ నేతల ముందు భాజపా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. ఆదివారం నాడు పార్లమెంట్ సభ్యులతో చంద్రబాబు జరిపే సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ సర్దుకుపోవాలా లేక తాడో పేడో తేల్చుకోవాలా అనే విషయంపై ఆదివారం నాడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

*** సుజనాచౌదరి మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండవలసింది.
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్న వై.సుజనాచౌదరి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం తెలుగుదేశం ఎంపీలతో కలసి తన నివాసంలో విలేకర్లతో మాట్లాడాడు. బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా కేటాయింపులు లేకపోవడం పట్ల సుజనా తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులందరికి సమిష్ఠి బాధ్యత ఉంటుంది. తన సహచర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి మండలిలో ఉంటూ నిరసన వ్యక్తపరచటం రాజ్యంగసూత్రాలకి విరుద్ధం. సుజనాచౌదరి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేసి బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వానికి తన నిరసనను వెలిబుచ్చి ఉంటే బాగుండేది. తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ కూడా ఉత్తరకుమారుడిలాగా ప్రగల్భాలు పలికారు. తెదేపా ఎంపీలంతా రాజీనామా చేస్తారని, భాజపా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రగల్భాలు పలికారు. టీజీ.వెంకటేష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రగల్భాలు పలికి ఉంటే అందరూ సంతోషించేవారు. మరో ఎంపీ జేసీ.దివాకరరెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వంపై తన సహజ ధోరణిలో నిరసన వ్యక్తపరిచారు. ఎప్పుడూ రాజకీయాల నుండి విరమించుకుంటానని ఆర్భాటంగా ప్రకటించే జేసీ నిన్న పార్లమెంట్ లోనే తన పదవికి రాజీనామా చేసి ఉంటే తెలుగు ప్రజలు ఆయనకు జైజైలు పలికేవారు. మొత్తం మీద రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా భాజపా-తెదేపాల సయోధ్యపైన రాజకీయ పరిశీలకులు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆరితేరినవారే. అవసరమయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సర్దుకుపోయే గుణం ఉన్న చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో సర్దుబాటు ధోరణి అవలంబిస్తారు అనడంలో సందేహం లేదు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుకుపోవడం అనివార్యం కూడా. ఎదురు తిరిగి భాజపాతో తెగతెంపులు చేసుకోవడం కన్నా కొంతకాలం పాటు సర్డుకుపోవడమే మేలన్న ధోరణిలో చంద్రబాబు వ్యవహరించక తప్పదు. జరగబోయే పరిణామాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.—కిలారు ముద్దుకృష్ణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com