పోలవరం సందర్శించిన గడ్కరీ. ఆదుకోవాలని ఆబగా అడిగిన చంద్రబాబు.

కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరాన్ని సందర్శించారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ద్వారా పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, గడ్కరీ కలిసి పోలవరం స్పిల్‌వే పనుల్ని పరిశీలించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పనులు జరిగిన తీరును అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై గడ్కరీ ఆరా తీశారు. వాస్తవానికి గడ్కరీ ఈ మధ్యాహ్నం మూడు గంటలకే రావాల్సి ఉన్నా.. రెండు గంటలు ఆలస్యంగా రావడంతో ఆయన కోసం సీఎం చంద్రబాబు వేచి ఉన్నారు.నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో రైతుగా తనకు తెలుసునని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏప్రిల్‌ నాటికి సివిల్స్‌ వర్క్స్‌ పూర్తిచేస్తామని అధికారులు అన్నారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించానన్నారు. పోలవరానికి నిధుల సమస్య లేదన్నారు. ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం అడిగారని, ఆర్థికశాఖతో చర్చిస్తాననని వెల్లడించారు. సహాయ, పునరావాసంలో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమని, పోలవరాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని స్పష్టంచేశారు. సవరించిన అంచనాలపై ఆర్థిక శాఖ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు.తొలుత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జెడ్‌ గ్రౌండింగ్‌ పనులు పూర్తిచేశామన్నారు. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్‌పనులు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని, దాంట్లో భూసేకరణకు రూ.33వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. 2019 డిసెంబర్‌ వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్టు చెప్పారు. పోలవరానికి ఖర్చు చేసిన రూ.2200 కోట్లు బకాయిలు విడుదల చేయాలని కోరారు. ముందస్తుగా నిధులు విడుదల చేస్తే పనులు పూర్తిచేసేందుకు సాధ్యమవుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com