ప్రతినిధుల సభకు బరిలో తెలుగు మహిళా అరుణా మిల్లర్

మన విజయవాడలో పుట్టిన మహిళ అమెరికా చట్టసభకు ఎన్నికయ్యే చారిత్రక సందర్భం నెలకొన్నది. అమెరికాలో స్థిరపడిన కాట్రగడ్డ అరుణా ఆదేశానికి చెందిన మిల్లర్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. అందులో విజయం సాధిస్తే వాషింగ్టన్ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభలోకి ప్రవేశించనున్న రెండో ప్రవాస భారతీయ మహిళగా ఆమె నిలువనున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ నుంచి గెలుపొందిన ప్రమీలా జయపాల్ దిగువసభ సభ్యురాలుగా ఉన్నారు. మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి అదే పార్టీలోని సహచర నేత డేవిడ్ ట్రోన్‌తో అరుణ పోటీ పడుతున్నారు. మంగళవారం ఈ ఎన్నిక జరుగనున్నది. ఇందులో విజయం సాధిస్తే డెమొక్రటిక్ పార్టీ ఆమెను తన అభ్యర్థిగా ప్రకటించనుంది. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుపొంది ఆమె ప్రతినిధుల సభకు ఎన్నికకావడం లాంఛనం కానున్నది. పార్టీకి కంచుకోటగా ఉన్న మేరీల్యాండ్ నుంచి మిల్లర్ గెలుపు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండింటిలో గెలుపొందితే వచ్చే ఏడాది జనవరిలో ఆమె అమెరికా చట్ట సభలోకి అడుగుపెట్టనున్నారు. 53 ఏండ్ల అరుణా మిల్లర్ వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్. కాట్రగడ్డ వెంకటరామారావు, హేమలత దంపతులకు 1964లో హైదరాబాద్‌లో జన్మించిన ఆమె తన ఏండేడ్ల వయసులో అమెరికా వెళ్లారు. తెలుగు అనర్గళంగా మాట్లాడటమేగాక తెలుగు సంప్రదాయాలను పాటించడం ఆమెకు ఇష్టం. డేవిడ్ మిల్లర్‌తో వివాహం తర్వాత ఆమె కాట్రగడ్డ అరుణా మిల్లర్‌గా మారారు.వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాలతోపాటు మౌంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు రవాణాశాఖలో ఇంజినీరుగా ఆమె సేవలందించారు. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొంది, పూర్తిస్థాయిలో మేరీల్యాండ్ నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. 2010లో మేరీల్యాండ్ నుంచి డెమొక్రటిక్ డెలిగేట్‌గా ఎన్నికైన అరుణ ఆ రాష్ట్ర గవర్నర్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, 60మిలియన్ డాలర్ల (రూ.408.7కోట్ల) వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదిర్చారు. డెమొక్రటిక్ పార్టీలో చురుకైన కార్యకర్త అయిన అరుణ గత అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హిల్లరీ క్లింటన్ ప్రచారబృందంలో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం మేరీల్యాండ్ రాష్ట్ర ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె అమెరికా కాంగ్రెస్ దిగువ సభలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘకాలం చట్టసభలో మహిళా ప్రతినిధిగా పనిచేసిన బార్బారా మికుల్‌స్కీ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో మేరీల్యాండ్ స్థానంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో వ్యాపారవేత్త అయిన డేవిడ్ ట్రోన్‌తో అరుణా మిల్లర్ గట్టిపోటీని ఎదుర్కొంటున్నారని సమాచారం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రోన్ భారీగా ఖర్చుచేస్తున్నారు. ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే కోటి అమెరికన్ డాలర్లు (రూ.68 కోట్లు) ఖర్చు చేశారు. ఒక పార్టీ అభ్యర్థిత్వం కోసం ఈ స్థాయిలో ఖర్చుచేయడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. ఇక తన విశ్వసనీయత, సామాజిక కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని నమ్ముతున్న అరుణ ప్రచారవ్యయంలో వెనుకబడ్డారు. మద్దతుదారుల సాయంతో సేకరించిన విరాళాల నుంచి ఆమె ఇప్పటివరకు 13.6లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.9కోట్లు) మాత్రమే ఖర్చుచేశారు. ఈ నేపథ్యంలో వీరి పోటీపై అమెరికా వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మహిళాశక్తి అనేక విజయాలను నమోదు చేసిన ఈ ఏడాది.. రూ.68కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి గెలువగలుగుతారా? అని వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల ప్రశ్నించింది. భారతీయ అమెరికన్లు ప్రధానంగా మిల్లర్‌కు మద్దతుగా నిలుస్తుండడం వల్ల ఆమె గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతున్నది. తాను గెలిస్తే.. భారత్-అమెరికా మధ్య బలమైన సంబంధాలకు, ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మెరుగుపరించేందుకు ప్రయత్నిస్తానని అరుణ చెబుతున్నారు. మేరీల్యాండ్‌లోని ఆరుస్థానాలకు పోటీపడుతున్న వారంతా పురుషులే కాగా, అరుణా మిల్లర్ ఒక్కరే మహిళ. దీంతో మహిళాప్రాతినిధ్యం కోసమైనా తనను గెలిపిస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తంచేస్తున్నారు. వలస విధానంలో మార్పులపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో చాలామంది అమెరికన్లు తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ధ్వంసమైన వలసచట్టాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com