ప్రతి తెలంగాణా వాసి గర్వించాల్సిన వ్యక్తి మహేందర్‌రెడ్డి

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ).. పోలీసు శాఖలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ అధికారి. ఓ పోలీసు అధికారి డీజీపీ స్థాయికి ఎదగాలంటే ఆ శాఖలో పని చేయాలనే ఆసక్తి మొదలు.. ఉన్నతాధికారుల సూచనల అమల, శాంతిభద్రతలను కాపాడే శక్తి సామర్థ్యం.. చతురత, పరిజ్ఞానం.. అన్నీ తనలో ఇమిడి ఉండాలి. వీటంన్నింటిని సరిగ్గా పుణికి పుచ్చుకొని.. సీనియర్‌ పోలీసు అధికారుల్లో ఒకరిగా రాష్ట్ర స్థాయిలో నిలిచిన వ్యక్తి రాష్ట్ర ఇన్‌ఛార్జి డీజీపీ ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి. ఇతను మన ఖమ్మం కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామవాసి.

కిష్టాపురం గ్రామం కూసుమంచి గ్రామ పంచాయతీలో ఒక వార్డుగా ఉండేది. 30 ఏళ్ల క్రితం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. కూసుమంచి రెవెన్యూ గ్రామం పరిధిలోనే కిష్టాపురం ప్రస్తుతం కొనసాగుతోంది. కూసుమంచి శివాలయం నుంచి గంగాదేవిచెరువు కట్ట మీదుగా బీరోలు వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. మండల కేంద్రం నుంచి 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా 1759. ఓటర్లు 920 మంది ఉన్నారు. గ్రామంలో ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ గ్రామానికి చుట్టూ ఉన్న అన్ని గ్రామాలతో బీటీ రహదారి సౌకర్యం ఉంది. గ్రామంలో 90శాతం అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా అభివృద్ధి చెంది ఉన్నాయి. కూసుమంచి నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా ఫ్లోరైడ్‌ రహిత తాగునీటి సరఫరా కొనసాగుతోంది. గ్రామంలోని రెండు చెరువులకు నర్సింహులగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు జలాలను చేర్చే పథకం నిర్వహణలో ఉంది. ఈ గ్రామంలోని అన్ని కుటుంబాల్లో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో 100శాతం ఇంకుడు గుంతల తవ్వకం నిర్మాణం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ఈ గ్రామం ఓడీఎఫ్‌ గ్రామంగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ గ్రామంలో ప్రతీ ఇంట కనీసం ఒక వేపచెట్టు ఉండడం ప్రత్యేకత. మహేందర్‌రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన గ్రామాభివృద్ధికి కృషి చేశారనడంలో సందేహం లేదు. రైతు ముదిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చమ్మల ఆరో సంతానం మహేందర్‌రెడ్డి. ఇతనికి ఇద్దరు అన్నలు, ముగ్గురు అక్కలున్నారు. తండ్రి నారాయణరెడ్డి కూసుమంచి గ్రామ పంచాయతీలో కిష్టాపురం వార్డుగా ఉన్న సమయంలో… రెండు సార్లు వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. పెద్ద సోదరుడు వెంకటరెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. 1995లో కిష్టాపురం మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిగా గెలిచి కూసుమంచి వైస్‌ఎంపీపీగా చేశారు. రెండో సోదరుడు ముదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నెస్పీ సీఈగా మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ముగ్గురు అక్కల పెళ్లిళ్లు జరిగాయి. మహేందర్‌రెడ్డి ప్రాథమిక విద్య స్వగ్రామంలో సాగింది. గ్రామంలో ఆయన నాలుగో తరగతి వరకు చదువుకున్నారు. మహేందర్‌రెడ్డి బడికి వెళ్లే సమయంలో పాఠశాల చింతచెట్టు కిందనే సాగుతుండగా, అక్కడే ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఐదు నుంచి ఏడో తరగతి వరకు ఆయన కూసుమంచి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు. అనంతరం నాగార్జునసాగర్‌లోని గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. వరంగల్‌లో బీఈ చేసిన అనంతరం గ్రూప్స్‌ రాశారు. ‘తన ప్రాథకమిక విద్య చింతచెట్టు కింద సాగిందనీ, ప్రతీ రోజు తన తల్లి వేలు పట్టుకొని చింతచెట్టు పాఠశాలకు వెళ్లేవాడినని’ మహేందర్‌రెడ్డి గతంలో చెప్పిన విషయం విదితమే. కూసుమంచి పాఠశాలకు రోజూ నాలుగు కిలోమీటర్లు తోటి విద్యార్థులతో కలిసి నడిచి వచ్చే వారు. మార్గమధ్యలో గంగాదేవిచెరువు కట్టపై నడక నరకాన్ని చూపించేంది. కట్టపై ఇరువైపులా ముళ్లపొదలు.. మోకాల్లోతు బురద మట్టిలో ఆయన నడిచి వచ్చి పట్టుదలగా చదివారు. చదువులో ఆపట్టుదలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన మహేందర్‌రెడ్డి వివిధ హోదాల్లో వివిధ జిల్లాల్లో విధులు నిర్వహించారు. కరీంనగర్‌, గుంటూరు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కర్నూల్‌, హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. హైదరాబాద్‌ కమిషనర్‌గా చేస్తూ.. ఆయన ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి సతీమణి అనిత గృహిణి. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జిల్లా వాసి.. సీనియర్‌ పోలీసు అధికారి అయిన మహేందర్‌రెడ్డికి ఇన్‌ఛార్జి డీజీపీగా ఎంపికయ్యారనే సమాచారంతో జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు, కూసుమంచి వాసులు, సమీప గ్రామాల ప్రజలకు డీజీపీ మహేందర్‌రెడ్డి.. మనోడే.. అంటూ ఎవరికి వారు చెప్పుకుంటూ సంతోషిస్తున్నారు. సమర్థుడైన అధికారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని అభిప్రాయపడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com