ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ ప్రసంగం-TNI ప్రత్యేకం

అద్భుత సాహిత్యాన్ని పండించిన మాగాణం తెలంగాణ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఎందరో సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట అని, అది తనకు కూడా సంక్రమించిందన్నారు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకకు అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి, బాల్యం నుంచే తెలుగు భాషపై, సాహిత్యంపై తనకు మక్కువ ఏర్పడిందని చెప్పారు. ఎంత గొప్పవారికైనా అమ్మఒడి తొలి బడి, జోలపాటతోనే బిడ్డకు తల్లి గమ్యం నిర్దేశిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. నీతి ఉంటుందని తల్లిదండ్రులు, గురువులు శతక పద్యాలను ఆనాడు నేర్పించేవారని గుర్తుచేశారు. ఒక్కో సందర్భానికి తగ్గ పద్యం చెబుతూ వాటి ప్రాశస్త్యాన్ని వివరించారు. కమ్మనైన భాషలో జాలువారే పదాలు మన కవులు రాశారు కాబట్టే సాహిత్యం మిగిలి ఉందన్నారు. తెలంగాణలో పూర్వకాలం నుంచే అద్భుతమైన కవులు ఉన్నారని, అత్యుత్తమ సాహిత్యం వెలువడిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలుగు భాష ఖ్యాతిని, సాహిత్యాన్ని ఇనుమడింపజేసిన ఎందరో తెలంగాణలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ నేల మీద ధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన కవిగా బమ్మెర పోతన నిలుస్తాడని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. వ్యవసాయం చేస్తేనేమీ, కందమూలాలు తింటేనేమీ మంచి కవిత్వం రాశారని కొనియాడారు. సందర్భం వస్తే కవులు దేవుళ్లను కూడా విమర్శిస్తారని తెలిపారు. గొప్ప కవులు సన్మానాలు, సత్కారాల కోసం కాకుండా భక్తి భావంతో రాస్తారని చెప్పారు. పోతన భాగవతంపై అలతి పదాలతో సి నారాయణరెడ్డి రాసిన వ్యాఖ్యానం అద్భుతమన్నారు.  ఆధునిక కవుల్లో గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అంటూ గోరెటి వెంకన్న కళ్లు చెమర్చేలా పాట రాశారని, అందెశ్రీ, జయరాజు లాంటి ఎందరో కవులు అద్భుతమైన పాటలు రాశారని వివరించారు. శోభన్ బాబు సినిమాలో ఓ పాటలో పూతరేకులు అనే పదం ఉంటే తనకు సందేహం కలిగిందని, దాన్ని తన గురువు ముదిగొండ వీరభద్రయ్యను అడిగితే ఆయనకు కూడా తెలియక విజయవాడకు లేఖ రాసి తెలుసుకొని మరీ చెప్పారని వివరించారు. కొత్త పదాన్ని తనకు పరిచయం చేసినందుకు తనను అభినందించారని తెలిపారు. అలాంటి అద్భుతమైన గురువులు ఉన్నందువల్లే మన సాహిత్యం ఇంకా బతికి ఉందన్నారు. ఉత్తర గోగ్రహణంలో కఠినమైన పద్యం చెప్పినందుకు ఆనాటి గురువు తనను మృత్యుంజయ శర్మకు అప్పగించారని, ఆనాటి నుంచి తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. 9వ తరగతి నుంచే చెరువు కట్టపైకి వెళ్లి పద్యాలు రాయడం మొదలుపెట్టానని చెప్పారు. తెలుగును విస్తరింపజేయాలన్న సంకల్పం ఈ మహాసభలు కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ప్రతి భాషా పండితుడు మరో భాషా పండితుడిని తయారు చేసే సంకల్పం తీసుకోవాలని కోరారు. ప్రతి కవి మరో కవిని తయారు చేయాలన్నారు. వారం, పది రోజుల్లోనే భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. బతకలేక బడిపంతులు అనే నానుడి సరికాదని, దేశాన్ని, సమాజాన్ని బతికించేవాడే బడిపంతులు అని ముఖ్యమంత్రి అన్నారు. అమ్మ అనే పిలుపు కడుపులోనుంచి వచ్చినట్టుంటుందని, మమ్మీ అనే పదం పెదవులు మీద నుంచి వచ్చినట్టుంటుందని అన్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ జీవో ఇచ్చినందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనను ప్రశంసించారని, భాషా భూషణుడు అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com