“ప్రపంచ వింత”గా రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు–TNI ప్రత్యేక కథనం


ప్రస్తుతం ఆంధ్రా రాష్ట్రంలో శరవేగంగా గోదావరి నది పై రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు… నిర్మాణం పూర్తీ అయితే ప్రపంచంలోనే అదొక ముఖ్య పర్యాటక ప్రదేశంగా మారుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక మూడేళ్ళ అనంతరం ప్రపంచ దేశాల నుండి ఏ పర్యాటకులు భారతదేశానికి వచ్చిన పోలవరం ప్రాజెక్టును చూడకుండా తిరిగి వెళ్ళలేని విధంగా పోలవరం ప్రాజెక్టు శరవేగంగా తయారవుతోంది. ప్రపంచ వింతల్లో ఈ ప్రాజెక్టు ఒకటిగా మారబోతోంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు దాని చుట్టూ ఉన్న పాపికొండలు అన్ని ఎన్నో ఆహ్లాదకరమైన ప్రదేశాలు పర్యాటకులు విశేషంగా ఆకర్షించబోతున్నాయి. ఏపీఎన్ఆర్టీ ఆద్వర్యంలో గత ఎనిమిదో తేదీన పోలవరం ప్రాజెక్టు చూపించడానికి కొందరు ప్రవాసులును తీసుకువెళ్ళారు. TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ ఈ పర్యటనలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన ప్రధానమైన పనులన్నీ ముఖ్య ఇంజనీరు రమేష్ బాబు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. దాదాపు రెండు గంటల పాటు రమేష్ బాబు ఈ ప్రాజెక్టు అంతా పర్యటించి ప్రాజెక్టు విశేషాలను సమగ్రంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టు వెనుక చాలా ఆసక్తికరమైన కధనమే ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం 1942వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇప్పుడున్న ప్రాజెక్టు ఎగువన గోదావరి నది పై ఆనకట్ట నిర్మించాలని సన్నాహాలు చేసారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాచలంలో గోదావరి పొంగిన సమయంలో గర్భగుడిలో శ్రీరాముని పాదాలు మునుగుతాయని అప్పటి ఇంజనీర్ అంచనా వేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు ‘శ్రిరామపాద’ ప్రాజెక్టుగా నామకరణం చేసారు. మొత్తం మీద బ్రిటిష్ వారి హయాంలో ఈ ప్రాజెక్టు కొన్ని సాంకేతిక కారణాలతోనూ, స్వాతంత్ర్య ఉద్యమ మూలంగాను ముందుకు సాగలేదు. **అనంతరం టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. అనంతరం రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టుకు కేంద్రం నుండి పూర్తిగా అనుమతులు రాకపోతే కాలువలు తవ్వేశారు. ఈ కాల్వ ద్వారానే పట్టిసీమ నుండి కృష్ణానదికి నీళ్ళు అందించే విధంగా చంద్రబాబు ప్రణాళిక వేసి సఫలీకృతం అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కూడా నిధులు అందిస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం దీనిని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తీ అయితే ఆంధ్రా రాష్ట్రంలో చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకూ కుడి, ఎడమ కలువల ద్వారా దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందుతున్నాయి. 540 గ్రామాలకు మంచి నీటిని అందించవచ్చు. ** మరొక విషాదకరమైన విషయం కూడా ఇందులో దాగి ఉంది. ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రా, తెలంగాణా , ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోని 1.70లక్షవేల ఎకరాల్లో అటవీ, సాగు భూములతో పాటు కొన్ని మిగిలిన గ్రామాలు కూడా ముంపుకు గురవుతాయి అందుకనే ఓడిశా రాష్ట్రం తన అబ్యార్ధంతరాలు తెలుపుతూ కోర్టుకు వెళ్ళింది. ఇన్ని విశేషాలతో కూడిన పోలవరం ప్రాజెక్టుకు సంబందించి పూర్తీ సమాచారాన్ని ఈ దిగువ చదవండి. వీలును బట్టి ఈ ప్రాజెక్టును తప్పని సరిగా సందర్శించండి.

అక్కడ మహా యజ్ఞం జరుగుతోంది! నీటిని నిలిపేందుకు కొండలు బద్దలవుతున్నాయి! పుడమికి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమవుతున్నాయి! కోరలు తొడిగిన యంత్రాలు విరామమెరుగకుండా శ్రమిస్తున్నాయి! రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందుతోంది! దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంజనీరింగ్‌ అద్భుతం జరుగుతోంది! అదే… పోలవరం ప్రాజెక్టు! నవ్యాంధ్రకు జల-జీవ నాడి! రాష్ట్రంలోని అన్ని పరివాహక ప్రాంతాలను తడిపేంత స్థాయి! రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా… కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ఇది తెర దించుతుంది. ఆ చివర అనంతపురం నుంచి పైనున్న శ్రీకాకుళం దాకా దాదాపు అన్ని నదీ బేసిన్లకు అదనపు ప్రయోజనం కలిగించే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది. దీని ప్రత్యేకత దృష్ట్యా కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది! సాంకేతికత, యాంత్రికత, నిర్మాణంలో అనేక విశిష్టతలున్న ఈ ప్రాజెక్టు విశేషాల మాలిక.


వెరీ వెరీ స్పెషల్‌.
ఏ ప్రాజెక్టుదైనా ఒకటే శైలి. నది ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట కడతారు. నీటిని నిలుపుతారు. అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు వైపులా రాయి లేదా మట్టితో కట్ట పోస్తారు. నాగార్జున సాగర్‌ నిర్మాణం ఇలాంటిదే. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇలా కట్టలు పోయాల్సిన అవసరం రాలేదు. ప్రధాన ప్రవాహంపై రెండు కొండల మధ్య ఆనకట్ట కట్టారు. కానీ… పోలవరం నిర్మాణ శైలే ప్రత్యేకం. గేట్లతో కూడిన ప్రధానమైన ఆనకట్ట (స్పిల్‌వే)ను నది ప్రవాహంపై కాకుండా పక్కన నిర్మిస్తున్నారు. నది ప్రవాహంపై రాళ్లు, మట్టి, కాంక్రీట్‌తో కూడిన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌) నిర్మితమవుతుంది. నదీ ప్రవాహాన్ని ఇదే అడ్డుకుంటుంది. అక్కడ నిండే నీరు చుట్టూ విస్తరించి, నిలుస్తుంది. పక్కనే ఉన్న స్పిల్‌వేనూ తాకుతుంది.

నీటి విడుదల అక్కడి నుంచే జరుగుతుంది. అక్కడ విడుదలైన నీరు కిలోమీటరు పాటు ప్రవహించి అసలైన ప్రవాహంలో కలుస్తుంది. అంటే… ఇక్కడ నదీ ప్రవాహాన్నే మారుస్తున్నారన్న మాట! ప్రవాహంపై రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కట్టడం ఎందుకు? గోదావరి లోతుకు వెళ్లేకొద్దీ ఇసుకే! ప్రవాహ ప్రాంతంలో గరిష్ఠంగా 150 మీటర్లు ఇసుకే ఉంది. ఇక్కడ స్పిల్‌వే నిర్మించాలంటే రాయి వచ్చేదాకా వెళ్లి అక్కడి నుంచి కాంక్రీటు నిర్మాణం మొదలుపెట్టాలి. ఇది అసాధ్యం! అందుకే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. భూగర్భంలో ఇసుక ఉన్న చోట ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మించి స్పిల్‌వేను పక్కకు మార్చారు. ఇదే పోలవరం డిజైన్‌లో ప్రత్యేకత!

ప్రవాహానికి అడ్డుగా ‘కొండ’
ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌… ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా 1750 మీటర్ల పొడవు, 41 మీటర్లు ఎత్తు ఉంటుంది. కింది భాగంలో 300 మీటర్ల వెడల్పులో నిర్మిస్తారు. పైన 30 మీటర్లు ఉంటుంది. అంటే… నదీ ప్రవాహానికి 1.75 కిలోమీటర్ల పొడవున ఒక కొండనే అడ్డు వేస్తారన్న మాట. ఈ అడ్డుకట్టే నీటిని నిలిపి ఉంచుతుంది. ఇది గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఉంటుంది. గోదావరిపై ఇప్పటిదాకా వచ్చిన గరిష్ఠ వరద 30 లక్షల క్యూసెక్కుల లోపే! ప్రాజెక్టులో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు ఆ ప్రాంతంలో భూమిపై ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల స్వల్పస్థాయిలో ప్రకంపనలు రావొచ్చు. అందుకే… భూగర్భంలో వేసే కాంక్రీట్‌కు ‘ప్లాస్టిసిటీ’ లక్షణాలు ఉండేలా ‘బెంటనైట్‌ క్లే’ అనే రసాయనాన్ని కలుపుతున్నారు.

వేగానికి నిదర్శనం…
చైనాలోని త్రీగార్జె్‌సలో గరిష్ఠంగా రోజుకు 7000వేల క్యూబిక్‌ మీటర్ల పని జరిగింది. పోలవరం ప్రాజెక్టులో రోజుకు 10వేల క్యూబిక్‌ మీటర్ల పని జరగనుంది. హెడ్‌ వర్క్స్‌లో మొత్తం 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని జరగాల్సి ఉంది. ఇప్పటికి 717 లక్షల క్యూబిక్‌ మీటర్లు, అంటే 68 శాతం పని పూర్తయింది. గంటకు 250 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ కలిపే బ్యాచింగ్‌ ప్లాంట్‌లు మూడు ఉన్నాయి. ప్రాజెక్టులో వినియోగిస్తున్న మొత్తం పరికరాల విలువ రూ.2వేల కోట్లు. ఈ ఖర్చుతో మధ్య తరహా ప్రాజెక్టునే నిర్మించవచ్చు. ప్రాజెక్టులో గంటకు 1750 టన్నుల క్యూబిక్‌ మీటర్ల కంకర కొట్టే యంత్రాలున్నాయి. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారు. ఏ నిర్మాణ ప్రాజెక్టుకైనా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవు. అయితే, పోలవరం పనులు మాత్రం ఎండకాసినా, వాన కురిసినా ఆగవు. వర్షాకాలంలో స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో చేరే నీటిని తోడి, నదిలో కలిపేందుకు 350 హెచ్‌పీ మోటర్లను ఉపయోగిస్తున్నారు. గట్టున ఉండే 200 మీటర్ల వరకు కాంక్రీట్‌ను తీసుకెళ్లి వేయగల ‘ఫుడ్జ్‌ మిస్టర్‌’ టెలీబెల్ట్‌ యంత్రాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే 130 మీటర్ల దూరం వరకు కాంక్రీట్‌ను వేయగల యంత్రాలూ ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో 3, 4 వేల మంది పని చేస్తున్నారు. ఒక దశలో ఇది 10వేల మందికి చేరుతోంది. అంటే… ఒక మోస్తరు ఊరే ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమవుతుందన్న మాట!

కాఫర్‌ డ్యామ్‌
పోలవరం నిర్మాణంలో మరో ప్రత్యేకత కాఫర్‌ డ్యామ్‌. రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరిగేందుకు నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించేందుకు తాత్కాలికంగా కాఫర్‌ డ్యామ్‌ను నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాదికి కాఫర్‌ డ్యామ్‌ ద్వారానే నీటిని మళ్లించి.. గ్రావిటీ ద్వారా కుడి కాలువకు నీరు అందించాలనే యోచన. ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ కిందివైపున కూడా మరో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాల్సి వస్తోంది.

కూల్‌ కూల్‌
ఒక చిన్న ఇంటికి స్లాబ్‌ వేస్తే 20 రోజులు క్యూరింగ్‌ చేయాలి. రసాయన చర్య ఫలితంగా కాంక్రీట్‌ నుంచి ఉష్ణోగ్రత వెలువడి, చీలికలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి… లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంకీట్ర్‌ పని జరిగే పోలవరంలాంటి ప్రాజెక్టుల మాటేమిటి? ప్రతి 3మీటర్ల కాంక్రీట్‌కు అన్నేసి రోజులు క్యూరింగ్‌ చేసుకుంటూ వెళితే… ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? అందుకే… ప్రత్యేకమైన ‘కూలింగ్‌ టెక్నాలజీ’ ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా… కాంక్రీట్‌ను 12 నుంచి 15 డిగ్రీల వరకు చల్లార్చుతారు. దీనికోసం కాంక్రీట్‌ మిక్సింగ్‌ సమయంలోనే మంచు ఫలకాలను (ఫ్లేకీ ఐస్‌) పంపిస్తారు. లిక్విడ్‌ నైట్రోజన్‌తోనూ కాంక్రీట్‌ను చల్లబరుస్తారు. ఇందుకోసం2 ప్లాంట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఇదీ చరిత్ర…
పోలవరం ప్రాజెక్టుపై 1942లో బ్రిటిష్‌ పాలకులు తొలి ఆలోచన చేశారు. అయ్యంగార్‌ అనే చీఫ్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు కోసం తొలిసారి కృషి చేశారు. అమెరికా నుంచి కార్న్‌ టెరిజాగీతోపాటు మరికొందరు ఇంజనీరింగ్‌ నిపుణులు గోదావరిపై డ్యామ్‌ను ఎక్కడ కట్టాలో పరిశీలించారు. ఇప్పుడున్న డ్యామ్‌ సైట్‌ నుంచి వందమీటర్ల దిగువన నిర్మాణానికి అనుకూలంగా ఉందని సూచించారు. అవన్నీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ… ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ ప్రాజెక్టును చేపట్టలేకపోయారు. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

పర్యాటకానికి మరింత ప్రభ
పోలవరం నిర్మాణం తర్వాత పాపికొండలు మునిగిపోతాయన్నది అపోహ మాత్రమే! పోలవరం ప్రాజెక్టుకు దిగువన 40 కి.మీ. దూరాన రాజమండ్రి ఉంది. ఆరు కి.మీ. ఎగువన పాపికొండలు ఉన్నాయి. పాపికొండల ఎత్తు సముద్ర మట్టం నుంచి 240 మీటర్లు. పోలవరంలో పూర్తి నిల్వ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 40 మీటర్లు మాత్రమే! పోలవరం నిర్మించినా పాపికొండల విహార యాత్ర ఆగదు. అంతేకాదు, పోలవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకుల పడవలు డ్యామ్‌ను అటూ ఇటూ దాటేందుకు ‘పనామా కాల్వ’ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. స్పిల్‌వే నుంచి జారి పడే గోదావరి జలాల అందాలను సమీపం నుంచి చూసేందుకు వీలుగా దేశంలోనే అతి పెద్ద సస్పెన్షన్‌ కేబుల్‌ (ఐకానిన్‌) బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు..

చేపలకోసం ప్రత్యేక దారి!
గోదావరి నదికి అడ్డుకట్ట వేసేస్తే గోదావరిలో ప్రత్యేకంగా లభించే ‘పులస’ వంటి మత్స్య సంపద ఏమైపోవాలి? ఇలాంటి అనుమానాలు అందరికీ వచ్చేవే! మత్స్య సంపదకు ఏ మాత్రం నష్టం జరగకుండా.. చేపలు, ఇతర జల చరాల కోసం ప్రత్యేక మార్గాన్నీ పోలవరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ‘ఫిష్‌ లేడర్‌’ అంటారు. దీని డిజైన్‌ను కేంద్ర జల వనరుల సంఘం రూపొందించింది. ఈ నిర్మాణం లేకుంటే అటవీ, పర్యావరణ శాఖ అసలు ప్రాజెక్టు నిర్మాణానికే అనుమతి ఇవ్వదు.

‘పవర్‌’ఫుల్‌ హౌస్‌
పోలవరం ప్రాజెక్టులో భాగంగా 969 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దీని నిర్మాణ బాధ్యత జెన్‌కోకు ప్రభుత్వం అప్పగించింది.

రాళ్లు, మట్టి పోస్తే సరిపోదు!
మట్టి, రాళ్లు, కాంక్రీటును కుప్పగా వేసేస్తే.. కింది నుంచి ఇసుక జారి పోతుంది. పైనున్న కట్ట కుంగిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ దిగువ నుంచి చుక్క నీరు అటువైపు వెళ్లకూడదు. పైనే కాదు, భూగర్భంలోనూ నీటి ప్రవాహాన్ని నిలిపి వేయాలి. దీనికోసం పైనుంచి భూగర్భంలో రాయి వచ్చేదాకా లోపలికి వెళ్లి ఒక కాంక్రీట్‌ గోడ కట్టాలి. అదే డయాఫ్రంవాల్‌. ప్రాజెక్టులో స్పిల్‌వే ఎంతకీలకమో డయాఫ్రంవాల్‌ అంతే కీలకం!

చకచకా గేట్లు..
సహజంగా కాంక్రీట్‌ పని మొత్తం పూర్తయ్యాక రేడియల్‌ గేట్ల తయారీ మొదలుపెడతారు. కానీ… ప్రాజెక్టు పూర్తిపై నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటి నుంచే గేట్ల తయారీ మొదలుపెట్టింది. ఒక్కో గేటు పొడవు 20 మీటర్లు. వెడల్పు 15 మీటర్లు. మొత్తం 48 గేట్లలో 26 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో మూడు తయారవుతున్నాయి. స్కిన్‌ప్లేట్‌తో కలిపి ఒక్కో గేటు బరువు 90 టన్నులు. ఇతరత్రా సపోర్ట్స్‌తో కలిపి, వీటిని స్పిల్‌వేకు అమర్చే సరికి ఈ బరువు 325 టన్నులకు చేరుతుంది. గేట్లను ఆపరేట్‌ చేసేందుకు ‘హైడ్రాలిక్‌’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రిమోట్‌ద్వారా ఆపరేట్‌ చేస్తారు.

జర్మనీ యంత్రంతో ‘డయాఫ్రం’
మనదేశంలో ఇప్పటిదాకా ఎక్కడా, ఏ ప్రాజెక్టుకూ బాగా లోతుగా వెళ్లి డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సిన అవసరం రాలేదు. ఈ పని చేయడంలో జర్మనీకి చెందిన ‘బావర్‌’ దిట్ట. అందుకే… ‘ఎల్‌అండ్‌టీ-బావర్‌’కు డయాఫ్రం వాల్‌ నిర్మాణం పని అప్పగించారు. ఇందుకు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. కోరల చక్రాలున్న ఈ యంత్రం ఇసుకను తోస్తూ, భూమిని కోస్తూ లోపలికి దూసుకెళ్తుంది. అలా రాయి వచ్చేదాకా వెళ్తుంది. రాతిని కూడా రెండు మీటర్లపాటు కోసి… అక్కడి నుంచి కాంక్రీట్‌ వేస్తూ వెళుతుంది. ఈ సమయంలో వచ్చే ఇసుక, మట్టి, చిన్నచిన్న రాళ్లను పైపుల ద్వారం దూరంగా వేసేస్తుంది. ఇదంతా ఏకకాలంలో జరుగుతుంది. వెరసి… ఈ భారీ యంత్రం భూగర్భంలోనే ఐదు అడుగుల వెడల్పుతో భారీ కాంక్రీటు గోడను కడుతుంది. భూగర్భంలో డయాఫ్రం వాల్‌! ఎగువన… ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌! ఇక… ఒక్క చుక్క కూడా ఇటు నుంచి అటు వైపునకు ఇంకదు, వెళ్లదు! అడ్డుకట్ట భద్రంగా ఉంటుంది.

మహా స్పిల్‌ వే
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పొడవు 1150 మీటర్లు. దీని నిర్మాణం ఒక మహా యజ్ఞం. భూమి పై నుంచి గట్టి రాయు వచ్చేదాకా తవ్వి, ఆ రాయినీ మరింత తొలిచి… అక్కడి నుంచి కాంక్రీట్‌ వేసుకుంటూ వస్తారు. ప్రాజెక్టుకు ఒకవైపున తక్కువ లోతులోనే రాయి వచ్చింది. కుడివైపున మాత్రం 80 అడుగులు కిందికి వెళ్లాల్సి వచ్చింది. అంటే… దిగువకు ఎనిమిది అంతస్తులు తవ్వి, అక్కడి నుంచి కాంక్రీట్‌ పని చేస్తూ వస్తున్నారు. మరింత కింద కూడా రాళ్ల మధ్య ఎలాంటి ‘గ్యాప్స్‌’ ఉన్నా పూడ్చేందుకు… రంధ్రాలు వేసి ‘జెట్‌ గ్రౌటింగ్‌’ ద్వారా సిమెంటు పంపిస్తున్నారు.

ఇసుకను మజ్జిగ కవ్వంలా చిలికినట్లు పక్కకు నెట్టేసి… సిమెంటును పంపే ‘ఇంపెరియస్‌ జెట్‌ గ్రౌటింగ్‌’ కూడా చేస్తున్నారు. ఈ గ్రౌటింగ్‌ రంధ్రాలను ప్రతి ఆరు మీటర్లకు ఒకటి చొప్పున వేస్తున్నారు. జర్మనీకి చెందిన కెల్లెర్‌ సంస్థ ఈ పని చేస్తోంది. స్పిల్‌వేపై మొత్తం 48 గేట్లు ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం పనులు ఒకేసారి జరుగుతున్నాయి. స్పిల్‌వే నుంచి విడుదలయ్యే నీరు వేగంగా, బలంగా దూసుకొస్తుంది. ఆ నీరు పడే చోట భారీ కాంక్రీట్‌ బెడ్స్‌ను కూడా ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు.

గర్వంగా ఉంది!
‘‘పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల! ఇది సాకారం చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. దీనిని అదృష్టంగా భావిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేటికవిగా విభజించి… ప్రతి పనికీ లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పనుల భారీతనం, ప్రత్యేకత కారణంగా యంత్ర పరికరాలను జర్మనీ నుంచి రప్పిస్తున్నాం. అంతర్జాతీయంగా అనుభవం కలిగిన సంస్థలు ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రానికి దశాదిశా చూపే ప్రాజెక్టు ఇది. పోలవరం పూర్తయితే రాష్ట్రంలోని రైతుల సాగు నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి.
Highlights OF పోలవరం..

పోలవరం ప్రత్యేకతలు :
గరిష్ట నీటి మట్టము :
+ 45.72 మీటర్లు (+ 150.00 అడుగులు)

కనీస నీటి మట్టము :
+ 41.15 మీటర్లు (+135.00 అడుగులు)

క్రెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిల్ వే :
+ 25.72 మీటర్లు (+84.39 అడుగులు)

ఈసీఆర్ఎఫ్ డ్యాం టాప్ బండ్ లెవెల్ :
+ 54.00 మీటర్లు (+177.16 అడుగులు)

గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్ :
194.60 టీఎంసి

లైవ్ స్టోరేజ్ : 75.20 టీఎంసి

ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జ్ :
50 లక్షల క్యూసెక్కులు

క్యాచ్ మెంట్ ఏరియా : 3,06,643 చ.కి.మీ
సబ్ మెర్జెన్స్ ఏరియా : 601 చ.కి.మీ

పోలవరంతో లాభాలు :
960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటి మళ్లింపు
2.91 లక్షల హెక్టార్లు (7.2 లక్షల హెక్టార్లు)కు సాగునీరు అందించొచ్చు
విశాఖ నగరవాసుల తాగునీటి కోసం 23.44 టీఎంసీల కేటాయింపు
540 గ్రామాలు (28.5 లక్షల మంది ప్రజలకు) తాగునీటి సౌకర్యం
చేపల పెంపకం, పడవలతో రవాణా మార్గానికి అవకాశాలు
ఒడీషా, చత్తీస్ ఘడ్ లకు 5 టీఎంసీలు, 1.5 టీఎంసీల నీటి సరఫరా.

కుడి కాలువ : 174 కిలోమీటర్ పొడవైన ఈ కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇదే కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తారు.
ఎడమ కాలువ : 181.5 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఎడమ కాలువ ద్వారా.. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.

పోలవరానికి 2014 అంచనాల ప్రకారం 58139 కోట్లు ఎందుకు?
222 మండలాలు,371 జనావాసాలు,ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల సంఖ్య 98818 , 2,00,000 పైగా నిర్వాసితులు, వేల ఇండ్లు, లక్షల ఎకరాలు. కాలువల బాగుకు, ఆర్దిక సర్దుబాట్లకు, ప్రపంచ ప్రసిద్ది చెందిన ఇంజినీరింగ్‌ వర్క్స్ కి మొత్తం ప్రజెక్టు 24,461 కోట్లు.

ఈ మహా యజ్ఞాన్ని సాకారం చేసేందుకు మన ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్న0 అసమాన్యం..చరస్మరణీయం
‘పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రే మేనేజర్‌’… కాంట్రాక్టు వర్గాలు సరదాగా చేసే వ్యాఖ్య ఇది. ఆయన ప్రతి సోమవారాన్ని ‘పోలవారం’గా ప్రకటించారు. ఇప్పటికి 45 సార్లు వర్చువల్‌ రివ్యూ (డ్రోన్‌ కెమెరాల దృశ్యాలను వీక్షించడం) చేశారు. 20 సార్లు స్వయంగా వచ్చి పనులు పరిశీలించారు. పనులకు లక్ష్యాలను నిర్దేశిస్తూ… పరిస్థితిని, అవసరాన్ని బట్టి గడువులు సవరిస్తూ… తాను పరుగులు తీస్తూ, అందరినీ పరుగులు తీయిస్తున్నారు. ఇవండి మన కలల పోలవరం వివరాలు.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com