ప్రమాణస్వీకారం సంపూర్ణం

కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా బి.ఎస్‌.యడ్యూరప్ప గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. బలమైన లింగాయత్‌ సామాజిక వర్గం అండదండలు, ఇప్పటికీ చెరగని ప్రజాదరణ ఆయనకు అనుకూలం. గతంలో ముఖ్యమంత్రి పదవికి ఎసరుపెట్టిన అవినీతి ఆరోపణలను ఆయన సమర్థంగా తిప్పికొట్టి మరోసారి కర్ణాటక పగ్గాలను అందుకున్నారు. బి.ఎస్‌. యడ్యూరప్ప ఫిబ్రవరి 27, 1943లో సిద్ధలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన బూకనకెరె గ్రామం. బెంగళూరులో డిగ్రీ పూర్తిచేసిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరేవరకు రైతుగా, గుమస్తాగా పనిచేయడంతో పాటు హార్డ్‌వేర్‌ షాపునూ నడిపారు. ఆయన సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేయడంతో పాటు రైస్‌ మిల్లులోను ఓ చిన్న ఉద్యోగం చేశారు. తర్వాత ఓ హార్డ్‌వేర్‌ షాపును ఏర్పాటు చేసుకున్నారు.

*** ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక, రాజకీయరంగ ప్రవేశం..
యడ్యూరప్ప సుమారు 15ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా చేరారు. 1970లో ఆయన స్వస్థలమైన శివమొగ్గ జిల్లాలోని శికరిపుర తాలుకాకు జన్‌సంఘ్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 1983లో యడ్యూరప్ప తొలిసారిగా శికరిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన ఐదుసార్లుకు పైగా గెలుపుపొందారు. లింగాయత్‌ సామాజిక వర్గంలో ఆయనకు బలమైన అండదండలు ఉన్నాయి. అంతేకాదు.. ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పేరును ఎక్కువగా ప్రస్తావించారు.

*** ఎమర్జెన్సీ సమయంలో జైలుకు..
1975లోనే ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించడంతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్లారు.

*** 2008లో తొలిసారి సీఎంగా..
2008లో భాజపా, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో జేడీఎస్‌ కుమారస్వామి, యడ్యూరప్ప మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండగా.. యడ్యూరప్ప ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యహరించారు. 20 మాసాల గడువు ముగిసిపోయిన తర్వాత యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. జేడీఎస్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో ఆయన జేడీఎస్‌ నుంచి విడిపోయారు. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో యడ్యూరప్ప సీఎం అయ్యారు. దక్షిణాదిన యడ్యూరప్ప ఆధ్వర్యంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అదే తొలిసారి.

*** అవినీతి ఆరోపణలు, వివాదాలు, కేసులు..
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చారు. భూములు, గనుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో మూడేళ్లకే పదవి నుంచి దిగిపోయారు. బెంగళూరులోని కొన్ని భూములను అక్రమంగా తన కొడుకుకు చెందేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు అక్రమంగా గనుల కేటాయింపు చేసినట్లు ఆయనపై లోకాయుక్తలో కేసు నమోదైంది. దీంతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెరిగింది. దీంతో 2011, జులై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది అక్టోబరు 15న లోకాయుక్త న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు. ఈ ఆరోపణలతోనే యడ్యూరప్ప జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అక్రమ మైనింగ్‌ కేసు నుంచి ఆయనకు 2016లో విముక్తి లభించింది. ప్రత్యేక సీబీఐ కోర్టు యడ్యూరప్పను నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఆయనపై ఉన్న 15 ఎఫ్‌ఐఆర్‌ల‌ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది.

*** కొత్త పార్టీ ఆవిర్భావం..
కష్టపడి సంపాదించిన పదవి దూరం కావడం, అధిష్ఠానం తనను పట్టించుకోవట్లేదనే అసంతృప్తికి గురైన యడ్యూరప్ప 2011లో భాజపా నుంచి వైదొలిగారు. ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2013లో అదే పార్టీ పేరుతో అభ్యర్థుల్ని బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో తనతో పాటు ఆరుగురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ భాజపా ఓటమికి కీలక పాత్ర పోషించారు. అనంతరం 2014, జనవరి 9న యడ్యూరప్ప ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు.

*** మళ్లీ భాజపాలోకి..
2014 ఎన్నికల్లో భాజపా యడ్యూరప్పకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కర్ణాటకలోని 29 లోక్‌సభ స్థానాలకు భాజపా 17చోట్ల జయభేరి మోగించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు సంవత్సరాల ముందే ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనకు అతిపెద్ద బలం లింగాయత్‌లు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 104 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్‌ ఆహ్వానం మేరకు యడ్యూరప్ప గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com