ప్రశ్నించినందుకు సన్మానం

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై భాజపా తీరును పార్లమెంట్‌లో ఎండగట్టిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆదివారం భారీగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని లోక్‌సభలో జయదేవ్‌ నిలదీసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అటు సామాజిక మాధ్యమాల్లో ఇటు సామాన్య ప్రజల్లో సైతం ఇదే చర్చనీయాంశమైంది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగేళ్లగా ఏవిధంగా అన్యాయం చేస్తూ వచ్చిందీ, న్యాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా 29 పర్యాయాలు దిల్లీ వచ్చి విజ్ఞాపనలు అందజేస్తే స్పందించక పోవడాన్ని ఆయన లోక్‌సభలో జరిగిన చర్చలో ఎండగట్టడంతో పాటు అక్కడ అన్ని రాజకీయ పక్షాలకు తెలియజెప్పారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చాటిచెప్పిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఆదివారం గుంటూరుకు విచ్చేస్తున్న జయదేవ్‌కు ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమయ్యాయి. మంగళగిరి, తాడేపల్లికి చెందిన నాయకులు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన అక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు. ఆటోనగర్‌ నుంచి భారీ ప్రదర్శనగా గుంటూరులోని ప్రధాన రహదారుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి జయదేవ్‌ను తీసుకురానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com