ఫ్లాష్: హెచ్‌-4 ఈఎడీకి మంగళం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకోనుంది. హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతి తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోందని అమెరికాలోని ఉన్నత స్థాయి ఫెడరల్‌ ఏజెన్సీ అధికారి అక్కడి శాసనకర్తలకు వెల్లడించారు. ఈ వర్క్‌ పర్మిట్‌ తొలగిస్తే అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. హెచ్‌1-బీ వీసాదారుల భాగస్వాములకు చట్టబద్ధంగా పని అనుమతి కల్పిస్తూ మాజీ అధ్యక్షుడు ఒబామా కాలంలో చట్టం చేశారు. అయితే ఈ నిబంధనను ఎత్తేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. హెచ్‌1-బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారి జీవిత భాగస్వాములకు హెచ్‌-4 వీసా ఇస్తారు. దీని ద్వారా వర్క్‌ పర్మిట్‌తో చాలా మంది భారతీయులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. హెచ్‌-4 వీసాపై దాదాపు లక్ష మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు. హెచ్‌1-బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్‌ పర్మిట్‌ తొలగించాలని ట్రంప్‌ చేస్తున్న ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పలువురు శాసనకర్తలు కూడా ఈ విధానంపై వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. హెచ్‌-4 నిబంధనకు సంబంధించిన ప్రొవిజన్‌ను తొలగించాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది.. దీనిపై ఈ వేసవి తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది అని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్సానా సెనేటర్‌ చుక్‌ గ్రేస్‌లీకి రాసిన లేఖలో స్పష్టంచేశారు. అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించడానికి, వారి ఆసక్తులను రక్షించడానికి గతంలో ఉన్న ఈ నిబంధనను తొలగించి కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రజలకు అవకాశం ఉంటుందని చెప్పారు. మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్ట్యూట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 71వేలకు పైగా హెచ్‌1-బీ వీసాదారుల జీవితభాగస్వాములకు పని అనుమతి కల్పిస్తూ పత్రాలు జారీ చేయగా, వారిలో 90శాతం మంది భారతీయులే ఉన్నారు. 2017 ప్రారంభంలో హెచ్‌-4 వీసాతో పని అనుమతి పొందిన వారిలో 94శాతం మంది మహిళలే. అందులోనూ 93శాతం మంది భారతీయులు. కేవలం నాలుగు శాతం చైనాకు చెందిన వారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com