బంగారు తాపడంలో శ్రీకాళహస్తీశ్వరుడు ధగధగ

భగవంతుని దరిచేరేందుకు భక్తే ప్రధాన మార్గం. ఆ మార్గం గుండా వెళ్లి.. ఆయన్ను ప్రసన్నం చేసుకున్న భక్తులెందరో. భక్తుల పాలిట భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రెండేళ్లకు మునుపు.. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని విమాన గోపుర శిఖరాలు మాత్రం బంగారు పూత ఉండేది. గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా.. కొంత మేరకు స్వర్ణమయమైతే.. ఈ ఏడాది నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు చాలా వరకు స్వర్ణశోభితంగా మారిపోయింది. అంతేకాదు.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తకోటికి ఈ సువర్ణమయ ప్రాభవం మరెంతో ఆకట్టుకుంటోంది.
***పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం చక్రవర్తులు, రాజులు, జమిందార్ల పాలనతో ఎంతో వైభవాన్ని చాటుకుంది. ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలు తన హయాంలో చేయించిన కైలాసహారం ఇప్పటికి చెక్కుచెదరలేదు. ఎంతో మంది వాళ్ల హయాంలో ఇక్కడి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. భక్తుల పాలిట బోళాశంకరుడైన సర్వేశ్వరునిపై ఉన్న అపారమైన భక్తి విశ్వాసాలతో ఆలయానికి వస్తున్న భక్తులతో పాటు తద్వారా వచ్చే ఆదాయం రూ.వంద కోట్లకు చేరింది. అంతేకాదు.. భగవంతునికి తమ వంతుగా సమర్పించేందుకు భక్తులు ముందుకు రావడంతో.. అన్నీ బంగారుమయంగా మారిపోతున్నాయి. రెండేళ్లల్లో మునుపెన్నడూ రానంత విధంగా బంగారంతో కూడిన శిఖరాలు, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయానికి బంగారు తలుపులు ఇలా ఎన్నెన్నో సమకూరాయి. భక్తుల్లో ఉన్న నిస్వార్థ భక్తినే.. ఆ భక్తి, విశ్వాసాలే.. ప్రస్తుతం ముక్కంటి ఆలయాన్ని స్వర్ణశోభితం చేశాయంటే అతిశయోక్తి కాదు.
**విమర్శలకు తావులేకుండా..
ముక్కంటి ఆలయంలో గడిచిన రెండేళ్ల వ్యవధిలో.. దాదాపుగా రూ.35 కోట్ల వ్యయంతో బంగారుతాపడం పనులు పూర్తయ్యాయి. ఇంత మేర నిధులతో చేశారంటే అవినీతి జరిగిందేమో అన్న సందేహం రాకమానదు. ఇక్కడ ఆ అవకాశం లేకుండా.. ఇందుకు భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళాలు స్వీకరించలేదు. భక్తులు వాళ్లంతట వాళ్లే స్వతహాగా ఏమేమీ చేయించదలుచుకున్నారో.. అవి చేయించి ఆలయానికి అప్పగించడం విశేషం. విమాన గోపురాలకు అమర్చిన శిఖరాల్లో స్వామి వారి విమాన గోపుర శిఖరాన్ని ఆలయ ఈవో నుంచి.. అటెండర్‌ స్థాయి వరకు ఒక్క రోజు జీతంతో స్వర్ణతాపడం చేయించారు.
శ్రీజ్ఞానప్రసూనాంబిక అమ్మవారితో పాటు నటరాజస్వామి ఆలయ గోపుర కలశాలకు ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షుడు గురవయ్యనాయుడు, ఆయన వియ్యంకులు గంగాప్రసాద్‌ సంయుక్తంగా చేయించారు.
కుంభాభిషేక సమయంలో ఉన్న ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలసి.. పరివార దేవతామూర్తుల గోపురాల కలశాలకు స్వర్ణతాపడం చేయించారు.
భిక్షాల గాలి గోపుర శిఖరాలు, ఈ ఏడాది స్వామి, అమ్మవార్లు తిరిగే వాహనాలకు బంగారు తాపడం పనులను నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి చేయించారు.
దక్షిణ గోపురం విమాన గోపుర కలశాలను స్థానికంగా ఉన్న ఆర్యవైశ్య కుటుంబీకులందరూ కలసి చేయించారు.
శివయ్య గోపుర కలశాలను.. నాయుడుపేట నుంచి వచ్చే నిమ్మకాయల వ్యాపారస్థులు చేయించారు.
ముక్కంటీశుని ధ్వజస్తంభానికి చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ బంగారు పూత వేయించారు.
చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్తలు అమ్మవారి ఆలయానికి బంగారు వాకిలి చేయించారు.
ముక్కంటి ఆలయంలోని శ్రీమేధో దక్షిణామూర్తి ధ్వజస్తంభానికి పారిశ్రామికవేత్త ఆదినారాయణరెడ్డి బంగారు పూత వేయించి ప్రతిష్ఠింపచేశారు.
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్వర్ణపోతికలను కుంభకోణంలోని బంగారు వ్యాపారస్థులు చేయించారు. ఇలా భక్తులు తమకు వీలైన రీతిలో.. ఆ భగవంతుని ఆలయం సువర్ణమయం చేసేందుకు తమవంతుగా సహకారం అందించడంతో పాటు శివయ్యపై ఉన్న భక్తి విశ్వాసాలను చాటుకున్నారు.
**ఆకట్టుకునే అందం
ముక్కంటి ఆలయం అభివృద్ధి చెందేకొద్ది.. భక్తులు ఇక్కడి స్వామి, అమ్మవార్లకు బంగారు ఉడుపులు చేయించారు. 1999-2000లో నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా స్వామి, అమ్మవార్ల విమాన కలశాలకు స్వర్ణతాపడం చేయించారు. 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన మహాకుంభాభిషేక వేడుకలు, ఆనక నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఈ ఏడాది నిర్వహించిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారు వితరణతో ముక్కంటి ఆలయం స్వర్ణసోయగమైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com