బడా విమానం భలే ఎగిరింది

ప్రపంచంలోనే అతిపెద్దదైన విమానం పైకెగిరింది. ఎయిర్‌ల్యాండర్-10 ప్రజల హర్షాతిరేకాల మధ్య ఆకాశంలో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. సాంకేతిక సమస్యల కారణంగా గతంలో పలుమార్లు ఈ విమానం టెస్ట్ ఫ్లైట్స్ విఫలమయ్యాయి. బుధవారం ఇంగ్లండ్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌లోని కార్డింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి విమానం టెస్ట్ ఫ్లైట్‌ కోసం పైకెగిరింది. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. హైబ్రిడ్ ప్లేన్/బ్లింప్/ హెలికాప్టర్‌గా పిలిచే ఈ ఎయిర్‌షిప్‌ను నిజానికి అమెరికా మిలటరీ కోసం తయారుచేశారు. 92 మీటర్ల పొడవు ఉండే ఎయిర్‌ల్యాండర్‌ను కార్గో విమానంగానూ, సాధారణ విమానంలానూ వినియోగించుకునే అవకాశం ఉంది. 4,880 మీటర్ల ఎత్తులో గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ విమానం ప్రాజెక్టు కోసం బ్రిటిష్ ప్రభుత్వం 3.7 మిలియన్ డాలర్లు ఇచ్చింది. హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏఏ) సంస్థ ఈ విమానాన్ని తయారుచేసింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్‌ల్యాండర్10కు హెచ్ఏఏ చైర్మన్ ఫిలిప్ గ్వైన్ భార్య పేరుమీద మార్తా గ్వైన్ అని పేరుపెట్టారు. 85 ఏళ్ల క్రితం ఎయిర్‌షిప్ ఆర్101 సరిగ్గా ఇక్కడి నుంచే టేకాఫ్ అయింది. అయితే దురదృష్టవశాత్తు ఫ్రాన్సులో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 48 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అతిపెద్ద విమానం టెస్ట్‌ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తిచేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com