బానిసలుగా వెళ్లి…భారతీయులుగా వెలిగి

ప్రపంచంలోని వివిధ దేశాల్లో భారత సంతతికి చెందిన లక్షలాదిమంది నివసిస్తున్నారు. మంచి ఆదాయం, వసతులతో కూడిన జీవనం వారిది. అయితే, ఆ స్థాయికి ఎదగడం సాధారణంగా జరగలేదని, దశాబ్దాలుగా ఇతర దేశాల్లో భారత సంతతి వారు శ్రమించడంతో సాకారమైందని అమెరికాలోని భారత దౌత్యవేత్త ఒకరు తెలిపారు. బ్రిటీషు పాలనలో లక్షలాది భారతీయ కుటుంబాలను మారిషస్‌, వెస్టిండీస్‌, ఫిజీ, ఆఫ్రికా తదితర ప్రాంతాలకు వలసపాలకులు కూలీలుగా తీసుకువెళ్లారని, ఆ దుర్భర పరిస్థితులను వారు ధైర్యంగా ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు. భారతీయ ప్రవాస అధ్యయనం ఆధ్వర్యంలో ‘గిరిమిత్యాస్‌: చారిత్రక పోరాటం’’ అన్న అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. అంతర్‌ రాష్ట్రీయ సహయోగ్‌ పరిషత్‌ కార్యదర్శి శ్యాం పరందే మాట్లాడుతూ వలస పాలనలో లక్షలాదిమంది భారతీయులను ఇతర ప్రాంతాలకు కూలీలుగా తరలించిన అంశాన్ని గుర్తుచేశారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా బానిసత్వాన్ని నిషేధించిన అనంతరం బ్రిటీషు పాలకులు భారతీయులను ఇతర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ కూలీలుగా పంపినట్టు తెలిపారు. ప్రపంచంలోని పలుదేశాల్లో ఉంటున్న భారత సంతతికి చెందిన వారిని గిరిమిత్యాస్‌ అంటారని ఆయన వెల్లడించారు. ఇలా వెళ్లిన భారతీయులు తమతో పాటు దేశ సంస్కృతి, కళలు, ఆచారాలు, సంప్రదాయాలు వెంట తీసుకువెళ్లినట్టు తెలిపారు. అమెరికాలోని భారత కాన్సల్‌ జనరల్‌ వెంకటేశన్‌ అశోక్‌ మాట్లాడుతూ అప్పట్లో దేశానికి చెందిన వలస కార్మికులకు సరైన వైద్య, ఆహారం, నివాసయోగ్య పరిస్థితులు ఉండేవి కావని తెలిపారు. ఇది మరో రకమైన బానిస వ్యవస్థగా వలస పాలకులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. తులసీ రామాయణం, హిందీ భాషలను ప్రవాసులు ఇప్పటికీ పరిరక్షిస్తున్నారని వెల్లడించారు. ఫిజీ మాజీ కాన్సల్‌ జనరల్‌ నారాయణ్‌రాజు ప్రసంగిస్తూ ఫిజీలోని భారత సంతతివారు ఇప్పటికీ తమ పూర్వీకుల సంస్కృతిని, ఆచారాలను ఆచరించడంపై హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న భారత సంతతికి చెందిన వారి అభ్యున్నతికి భారత్‌ చేయూతనివ్వాలని సూచించారు. మంచి వేతనాలు ఇస్తామని ఆశబెట్టి లక్షలాదిమంది భారతీయులను వలస పాలకులు ఇతర దేశాలకు తరలించినట్టు తెలిపారు. 1833 నుంచి 1920 వరకు భారత్‌ నుంచి ఇలాంటి వలసలు కొనసాగినట్టు తెలుస్తోంది. భారతీయులను తరలించేందుకు అప్పట్లో ఏజెంట్లు పలు మార్గాలను అనుసరించారు. అందులో భాగంగా సురినామ్‌లో బంగారు దొరుకుతుందని ఆశపెట్టేవారు. అక్కడకు వెళ్లాక భయపెట్టి పనిచేయించేవారు. ఇలా ఎన్నో రకాలుగా మోసపోయిన భారత సంతతికి చెందినవారు నిరంతరం శ్రమించి నేడు ఆ దేశాలకు ఆర్థిక చోదక శక్తిగా మారినట్టు వక్తలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com