బాలయ్య డ్యాన్స్ ఫేమస్

‘‘కథానాయకుడు ఎవరన్నది ఆలోచించను. నాకు పాత్ర నచ్చితే సినిమా చేసేస్తా’’ అంటోంది నటాషా దోషి. నందమూరి బాలకృష్ణ ‘జైసింహా’తో ఆమె తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయమవుతోంది. శుక్రవారం ‘జై సింహా’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నటాషా విలేకరులతో మాట్లాడింది. ‘‘నందమూరి బాలకృష్ణ, కె.ఎస్‌.రవికుమార్‌.. ఇద్దరూ దిగ్గజాలే. వీళ్లతో పనిచేసే అవకాశం తొలి తెలుగు చిత్రంతోనే దక్కింది. ఇంతకంటే ఓ శుభారంభం ఎవరు కోరుకుంటారు? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నా. ‘జై సింహా’లో నా పేరు దానియా. అమెరికా నుంచి వస్తాను. మోడ్రన్‌గా ఉంటాను. నా పాత్ర తీరుతెన్నులు కథకు కీలకం. ఓ విధంగా ‘జై సింహా’ కథని మలుపు తిప్పే పాత్ర నాది. ‘అమ్మకుట్టి’ పాటలో బాలకృష్ణతో కలసి డ్యాన్స్‌ చేయడం మర్చిపోలేని అనుభూతి. బాలయ్య డ్యాన్సులకు ప్రసిద్ధి. ఆయన డ్యాన్సులు చూడ్డానికే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. అలాంటిది ఆయన పక్కన నృత్యం చేసే అవకాశం రావడం నా అదృష్టం. సంప్రదాయ నృత్యం నేర్చుకున్నాను కాబట్టి సులభంగానే స్టెప్పులేశా’’ ‘‘నయనతారకు వీరాభిమానిని. మలయాళ ‘బాడీగార్డ్‌’లో ఆమె నటన బాగా నచ్చింది. నా అభిమాన నటితో కలసి ప్రయాణం చేయడం కలలో కూడా ఊహించని సంఘటన. నేను పుట్టి పెరిగింది మొత్తం ముంబైలోనే. చిన్నప్పుడు కొన్ని హిందీ ధారావాహికలలో నటించాను. కథానాయికగా రెండు మలయాళ చిత్రాలు చేశాను. ‘జై సింహా’లోని నా పాత్ర కోసం ముందు వందమంది అమ్మాయిల్ని పరిశీలించారట. చివరికి ఆ అదృష్టం నాకు దక్కింది’’ ‘‘వైద్య వృత్తిలో స్థిరపడాలన్నది నా ఆశ. సినిమాలంటే ప్రేమ. ఈ రెండింటిలో ఏది కావాలంటే చెప్పలేను. అందుకే ముందు చదువు పూర్తి చేశా. ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఓ బెంగాలీ చిత్రంలో నటిస్తున్నా. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ‘జై సింహా’ తరవాత తెలుగులో మరిన్ని మంచి అవకాశాలొస్తాయన్న నమ్మకం ఉంది’’

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com