బిట్‌కాయిన్లకు జైట్లీ బంధనం

క్రిప్టో కరెన్సీలపై బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని ఏమాత్రం అంగీకరించదని స్పష్టం చేశారు. వీటి వినియోగాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుందన్నారు. దీంతో బిట్‌కాయిన్ల వినియోగంపై నిషేధం పడినట్లయింది. డిజిటల్‌ పేమెంట్లకు మాత్రం బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని జైట్లీ చెప్పారు. ఈ వూహాజనిత కరెన్సీ గురించి జైట్లీ గతేడాది జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రస్తావించారు. భారత్‌లో క్రిప్టో కరెన్సీ చెల్లుబాటు అవుతుందని చెప్పేందుకు ఎలాంటి చట్టాలు లేవు, ఇందుకోసం ఆర్‌బీఐ ఏ కంపెనీలకు లైసెన్సులు కల్పించలేదని చెప్పారు. తాజాగా బడ్జెట్‌ ప్రసంగంలో దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. ఇటీవల కాలంలో దేశంలో బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. బిట్‌కాయిన్ల కొనుగోళ్లకు ప్రత్యేక ట్రేడర్లు తయారయ్యారు. వీటి కొనుగోళ్లు, అమ్మకాలపై చట్టబద్ధమైన నిబంధనలు ఏవీ లేవు. బిట్‌కాయిన్లను కొనుగోలు చేస్తే రోజుల్లో కుబేరులైపోవచ్చు అనే భ్రమలను ఈ ట్రేడర్లు కల్పిస్తున్నారు. సాధారణగా ఆర్థిక వ్యవస్థలో మోసపూరిత పథకాలను ప్రచారం చేసేందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తుంటారు. దాదాపు ఏడాది కాలంలో భారత్‌లో బిట్‌కాయిన్ల మార్కెట్‌ 2,000 రెట్లు పెరిగింది. ప్రజలు కూడా బాగానే సంపాదించారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ ఒక్కసారిగా కుప్పకూలితే పెట్టుబడి దారులు విపరీతంగా నష్టపోయే ప్రమాదముంది.

* బిట్‌కాయిన్లను చీకటి మార్గాల్లో చెల్లింపులకు వాహకంగా చేసుకోవడం కూడా ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది. కిడ్నాపులు, బెదిరింపులు, హవాలు ఇతర దందాలకు బిట్‌కాయిన్లే మూలంగా మారుతున్నాయి.
* బిట్‌కాయిన్లతో చేసే వ్యాపారాలపై చట్ట పర్యవేక్షణ లేకుండా పోతోంది. సేవారంగం వంటి వాటిల్లో బిట్‌కాయిన్లను వినియోగిస్తే ఇక ఆ లెక్కలు ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో ఆ మేరకు ప్రభుత్వం పన్ను నష్టపోవాల్సిందే.
* బిట్‌కాయిన్లలో పెట్టబడి పెడితే ఎటువంటి పన్ను విధించాలనే విషయంపైనా స్పష్టత లేదు. క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించాలో, ఆదాయ పన్ను విభాగంలో పరిశీలించాలో అధికారులకు తెలియని పరిస్థితి. ఇక జీఎస్‌టీ విధింపుపైనా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించడమే మంచిదని కేంద్రం భావించింది.
* ఇప్పటికే ఐటీశాఖ దాదాపు 5లక్షల బిట్‌కాయిన్‌ కొనుగోలుదార్లను గుర్తించి నోటీసులు జారీ చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com