బినామీలతో రాజీనామాలు ఎందుకు చేయించరు?

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు, ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్న సీఎం వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎన్నికలకు వెళదామని సవాలు విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71శాతం సంతృప్తి ఉందట! రుణమాఫీ కాక రైతులు అప్పులపాలైనందుకా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చినందుకా, ఇంటికో ఉద్యోగం, దళితులకు ఇళ్లు దక్కినందుకా? అమరావతిని స్కాం క్యాపిటల్‌గా మార్చినందుకా? ఏ విషయంలో జనం సంతృప్తిగా ఉన్నారు?. నాడు వైఎస్సార్‌ అంటే ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత కరెంట్‌ లాంటి పథకాలు గుర్తొచ్చేవి. మరి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎన్నికలకు వెళదాం. టీడీపీ సిద్ధమేనా? ఏపీకి చెందిన అందరు ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే ఈపాటికి కేంద్రం దిగివచ్చేది. కానీ చిత్తశుద్దిలేని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించరు. ఢిల్లీలో డ్రామాలు చేసి, రాజీనామాలు చేయకుండా వచ్చిన టీడీపీ ఎంపీలను ప్రజలంతా తరిమికొట్టాలి. నాడు సమైఖ్యాంద్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదు? హోదా కోసం ఆందోళనలు చేస్తోన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులతో అడ్డగించడం సిగ్గుచేటుకాదా? మీరు 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది నియోజకవర్గాల పెంపు కోసం కాదా?’’ అని ప్రశ్నించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com