బొంగుచికెన్‌ వలన వెదురుపొదలు నాశనం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి పేరు చెబుతేనే… గుర్తుకు వచ్చేది బొంగుచికెన్‌. ఇక్కడికి వచ్చేవారు బొంగుచికెన్‌ రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. కొందరైతే దీని కోసమే ఇక్కడికి వస్తున్నారనేది బహిరంగ రహస్యం. అంతగా పర్యాటకులను ఆకర్షించే బొంగుచికెన్‌ దుకాణాలు పది రోజులుగా మూతపడ్డాయి. దీంతో స్థానికంగా సుమారు 35 కుటుంబాలు ఉపాధి కోల్పోవడంతోపాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ ప్రాంతానికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మందిని స్థానికంగా లభించే బొంగుచికెన్‌ ఎంతగానో ఆకర్షిస్తోంది. కోడి మాంసాన్ని వెదురుబొంగులో ప్రత్యేకంగా వేడిచేసి అందజేస్తారు. మారేడుమిల్లిలోని సుమారు 35 కుటుంబాలు బొంగు చికెన్‌ను తయారీ చేసి పర్యాటకులకు అందజేస్తున్నాయి. దీని తయారీకి వెదురుబొంగులను ఉపయోగించడం ద్వారా అడవులకు నష్టం కలుగుతుందని చెబుతూ అటవీశాఖ అధికారులు దీని తయారీని నిలిపివేశారు. బొంగులు తెచ్చినా, బొంగుచికెన్‌ తయారు చేసినా కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని తయారీకి అనుమతులు కావాలంటే ఒక్కొక్క దుకాణానికి నెలకు రూ.2500 చొప్పున అటవీశాఖకు అపరాధ రుసుం చెల్లించాలంటూ ఆ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెలకు అంత భారీ మొత్తంలో అపరాధ రుసుం చెల్లించలేమని, ఆ స్థాయిలో వ్యాపారాలు సాగడం లేదని కొందరు వ్యాపారులు వాపోతున్నారు. గత ఏడాది  నవంబరులోనూ ఇదే విధంగా అటవీశాఖ అధికారులు బొంగుచికెన్‌ దుకాణాలను మూయించివేశారు. అప్పట్లో ఒక్కొక్క దుకాణానికి రూ.3వేలు చొప్పున అపరాధ రుసుం చెల్లించి తయారీని కొనసాగించారు. తరువాత చెల్లించడం నిలిపివేశారు. దీంతో మళ్లీ ఇదే వివాదం నెలకొంది. ఆదివారం మారేడుమిల్లికి భారీగా తరలివచ్చిన పర్యాటకులు బొంగుచికెన్‌ కోసం దుకాణాల వద్దకు వెళ్లి విషయం తెలుసుకుని నిరాశకు గురయ్యారు. దీనిపై రంపచోడవరం అటవీశాఖ రేంజర్‌ ఎ.సునీల్‌కుమార్‌ను వివరణ కోరగా.. బొంగుల కోసం వెదురుపొదలను అశాస్త్రీయ పద్ధతుల్లో నరికివేస్తుండటంతో తిరిగి చిగురించడం లేదన్నారు. దీని వల్ల వెదురుపొదలు నాశనం అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో గతంలో బొంగుచికెన్‌ దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి అపరాధరుసుం చెల్లించాలని కోరామని.. ఆ డబ్బులను వెదరు పెంచేందుకు వినియోగిస్తామని చెప్పామని అన్నారు. తరువాత వారు స్పందించకపోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com