భక్తులను కరుణించిన వెంకన్న. ఏడు రూపాయలకే రెండు ఇడ్లీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇకపై అక్కడి హోటళ్లకు ధైర్యంగా వెళ్లే పరిస్థితులేర్పడ్డాయి. కొండమీద వివిధ హోటళ్లలో అడ్డగోలు ధరల దోపిడీ నిలిచిపోయింది. ఇప్పటి వరకూ రూ.25 పలికిలిన రెండు ఇడ్లీల ధర రూ.7.50కు దిగివచ్చింది. ఏకంగా రూ.15 అమ్మిన టీ ఇప్పుడు రూ.5కు దొరుకుతోంది. రూ.100 పూర్తి భోజనం రూ.31కు తగ్గింది. ఇలా వివిధ రకాల ఆహార పదార్థాల ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. అంతేకాకుండా ఈ ధరలను అన్ని హోటళ్ల ముందు పట్టికల్లో బహిరంగా ప్రదర్శిస్తున్నారు. పట్టికలో ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే… ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించేలా ఫోన్‌ నెంబర్లు వేస్తున్నారు. గతంలో తిరుమలలో హోటళ్లలో ఆహారపదార్థాల ధరలకు అడ్డూఅదుపు ఉండేది కాదు. భక్తులు కోరుకున్నది తిన్నాక.. వారు చెప్పినంత డబ్బు కట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితితో భక్తులు దోపిడీకి గురవుతున్నారంటూ కొన్ని ప్రజాసంఘాలు ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇటీవల కోర్టు తితిదే ఉన్నతాధికారులకు అక్షింతలు వేసింది. కొండపైకి వచ్చే భక్తుల నుంచి హోటళ్లు దర్జాగా వసూలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని తితిదే ఉన్నతాధికారులను ప్రశ్నించింది. వెంటనే దీనికి అడ్టుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ప్రతిస్పందించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టారు. హోటల్‌ యజమానులు, తితిదే రెవెన్యూ, ఎస్టేట్‌, ఇతర శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుమలలో సామాన్య భక్తులకు సాంత్వన చేకూరేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో హోటల్‌ యజమానులు అధిక ధరలను తగ్గించాలని, ఆయా ధరల పట్టికలను హోటళ్ల ముందు అందరికీ కనిపించేలా వేలాడదీయాలని, దీన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం తిరుమలలోని ప్రతి చిన్న హోటల్‌లోనూ ధరల తగ్గి, పట్టికలు కనిపిస్తున్నాయి. అద్దెలను సమీక్షించాలని…: ఇదే సమావేశంలో వివిధ అంశాల చర్చ తర్వాత హోటళ్ల యజమానులు నెలవారీ చెల్లిస్తున్న అద్దెలు భారీగా ఉంటున్నాయనే అంశం తితిదే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. తాము తితిదేకు చెల్లిస్తున్న అద్దెలు భారీ స్థాయిలో ఉండటం వల్లనే అధిక ధరలకు అమ్ముతున్నామని వారు బహిరంగంగా తెలిపారు. దీనిపై సమీక్షించి… అద్దెలను కాస్త తగ్గిస్తే… తాము కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే అమ్మకాలు సాగిస్తామని హోటల్‌ యజమానులంతా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వారు సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే తీరు కొనసాగాలి…: కొండపై ప్రస్తుతం ప్రతి హోటల్‌లో పక్కాగా ఎమ్మార్పీ ధరలు, తక్కువ ధరలు అమలవుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగాలని… రెండ్రోజులు హడావుడి చేసి… గాలికొదిలేయడం సరికాదని భక్తులు కోరుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com