భద్రాద్రిలో కంకణాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం మరో నూతన సంప్రదాయానికి పూనుకుంది. భద్రాద్రి రామున్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు భద్రాద్రి శ్రీరామ కంకణం అందజేయనున్నారు. రామాలయ ప్రవేశ గాలిగోపురం వద్ద భక్తులకు ఈ కంకణం అందిస్తారు. ఈ కంకణంపై శ్రీరామజయరామ, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అని రాయబడి ఉంటుంది. రెండు ప్రత్యేక మిషన్ల ద్వారా వీటిని భక్తులకు ఉచితంగా అందజేస్తారు.తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సుదర్శన కంకణంలా ఇది ఉండనుంది. భక్తులకు తీపి జ్ఞాపకాలను ఈ కంకణం పంచనుంది. ఇందుకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రెండు మిషన్లు తెప్పించి పరిశీలించారు. ఈ నెలఖరులోగా ఏర్పాట్లు పూర్తిచేసి మే నెల మొదటివారం నుంచి భక్తులకు ఈ కంకణాలను పంపిణీ చేయనున్నారు. భద్రాద్రి రామున్ని దర్శించుకునే భక్తులందరికీ ఉచితంగా కంకణాలను అందించనుండటంతో ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారనేది ఖచ్చితమైన సమాచారం దేవస్థానానికి తెలియనుంది.ఈ కంకణంపై నెంబర్ కోడ్ సైతం ప్రింట్ కానుంది. ఈ కంకణం ధరించిన భక్తులు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత అన్నదానంలోకి ప్రవేశించే వీలుంది. ప్రస్తుతం అన్నదాన సత్రానికి 300 పైగా భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ కంకణం ధరించే భక్తులందరూ ఇక అన్నదాన సత్రానికి వెళ్లే అవకాశం దొరకనుంది. దీంతో భక్తులకు భోజన సౌకర్యానికి ప్రస్తుతం కలిగే స్వల్ప ఇక్కట్లు ఇక తొలగనున్నాయి. అంతే కాదు ఈ కంకణం ధరిచడం మూలంగా భద్రాద్రి ఆలయం ప్రాచుర్యం మరింత ఇనుమడించనుంది.మరికొందరు భక్తులు ఈ కంకణ సమాచారంతో భద్రాద్రికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత మరింత ఉట్టిపడనుంది. భద్రాద్రి రామాలయం ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. ఈ ఆలయ ఆలనా పాలనను గత ప్రభుత్వాలు మరిచాయి. దీంతో ఆలయ అభివృద్ధి అంతంత మాత్రమే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక భద్రాద్రి రామాలయం ప్రగతిబాట పడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుందర భద్రాద్రి ప్రగతికి రూ.100కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన విషయం విదితమే. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి ఆలయ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు.రామాలయం ఈవో ప్రభాకర శ్రీనివాసు ఈవోగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి అనేక నూతన సంప్రదాయాలకు తెరలేపారు. ఆలయంలో ప్రవేశించే భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. భక్తులు కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లేలా దక్షిణ మెట్లవైపు నీటి సౌకర్యం కల్పించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మజ్జిగ సౌకర్యం కల్పించారు. అపరభక్తగ్రేసరాలు పోకల దమ్మక్క విగ్రహాన్ని ఆలయ ప్రవేశ సమీపంలో ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మింపజేశారు. భక్తులకు ఏసీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో నూతన సంప్రదాయంగా శ్రీరామరక్ష పూజను నిర్వహిస్తున్నారు. ప్రతీ శుక్రవారం సంధ్యాహారతుల వేడుక నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాముని స్వర్ణ కవచ దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com