భాజపాలో వర్గపోరు. సస్పెన్షన్ ఊహాగానాలు.

AP బీజేపీలో వర్గపోరు పరాకాష్టకు చేరింది. అధ్యక్షుడు హరిబాబుతో విభేదిస్తున్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మీపతిరాజాను పార్టీ నుంచి బయటకు పంపేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే సమావేశంలో తీర్మానం చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. లక్ష్మీపతిరాజాపై చర్యలు తీసుకోవడంతో తమను వ్యతిరేకించేవారికి ఓ హెచ్చరిక పంపాలని హరిబాబు ప్లాన్‌గా కనిపిస్తోంది. ఏ తప్పు చేయనప్పుడు బయటకు పంపే ప్రసక్తేలేదని లక్ష్మీపతిరాజా ధీమాతో ఉన్నారు.ఏపీ బీజేపీ రెండు ముక్కలైంది. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గంగా చీలిపోయింది. తెలుగుదేశానికి ఫేవర్‌గా హరిబాబు అండ్ కో కొనసాగుతుండగా.. వ్యతిరేక వర్గంలో సోమువీర్రాజు, పురందేశ్వరీ అండ్ కో చలామణి అవుతున్నారు. అయితే అనుకూల, వ్యతిరేక వర్గాల ఆధిపత్య పోరు ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. వ్యతిరేక వర్గం సభ్యుడుగా భావిస్తున్న రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లక్ష్మీపతిరాజాను పార్టీ నుంచి బయటకు పంపేందుకు హరిబాబు అండ్ కో వ్యూహారచన చేస్తుంది. విజయవాడలో ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో హరిబాబుకు, లక్ష్మీపతిరాజాకు మధ్య మాటామాట పెరిగింది. బస్సు యాత్ర చేపట్టాలని లక్ష్మీపతిరాజా ప్రతిపాదించగా హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిబాబుకు ధీటుగా లక్ష్మీపతిరాజా ప్రతిస్పందించడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత లక్ష్మిపతిరాజా పార్టీ అధికార ప్రతినిధి కాదని, మీడియా చర్చాగోష్టులకు పిలవొద్దని లేఖ విడుదల చేయడంతో అంతర్గతపోరు రాజుకుంది. ఇంతటితో ఆగని హరిబాబు వర్గం.. లక్ష్మీపతిరాజాను పార్టీనుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు కాక పుట్టిస్తున్నాయి. హరిబాబును వ్యతిరేకిస్తున్న రాజాను సస్పెండ్ చేయాలని ఇప్పటికే సంతకాల సేకరణ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. మార్చి 2న జరిగే కృష్ణా జిల్లా బిజేపి సమావేశంలో లక్ష్మీపతిరాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది హరిబాబు వర్గం ప్లాన్‌గా తెలుస్తోంది. లక్ష్మీపతిరాజాపై చర్యలు తీసుకోవడం ద్వారా తమను వ్యతిరేకిస్తున్న సోమువీర్రాజు, పురందేశ్వరి వంటివారికి ఒక సందేశం పంపాలని హరిబాబు వర్గం వ్యూహంగా కనిపిస్తుంది. అయితే తాను ఏ తప్పు చేయలేదని తనపై చర్యలు అనేవి ఊహాజనితమని లక్ష్మిపతిరాజా అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత వేదికపై తన అభిప్రాయం చెప్పాను తప్ప బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదని.. చర్యలు తీసుకుంటారని అనుకోవడం లేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్ష్మీపతిరాజా అంచనాలు తప్పుతాయని బిజేపి కార్యకర్తలు భావిస్తున్నారు. లక్ష్మీపతిరాజాపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలియజెప్పడానికే… విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు, పురందేశ్వరి సమక్షంలో ఆ వర్గానికి చెందిన నాయకుడికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు చర్చనీయాంశంగా మారతాయని వారు భావిస్తున్నారు. మరి ఈ వర్గపోరులో ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com