భాజపా ఎంపీలకు నోటి దూల

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే భాజపా నేత, ఎంపీ సాక్షి మహరాజ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశ జనాభా పెరిగేందుకు వారే కారణమంటూ ముస్లింలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరట్‌లోని ఓ దేవాలయ ప్రారంభం కార్యక్రమంలో ఎంపీ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ జనాభా పెరగడానికి హిందువులు కారణం కాదు. నలుగురేసి భార్యలు, నలభై మంది పిల్లలు విధానాన్ని సమర్థిస్తున్న వారే దీనికి కారణం. పిల్లలు కనడానికి తల్లులేమీ యంత్రాలు కాదు’ అంటూ ముస్లింలే దేశ జనాభా పెరుగుదలకు కారణమనే అర్థం వచ్చేట్లు మాట్లాడారు. ‘ట్రిపుల్‌ తలాక్‌’కు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యలు త్రీవమైనవని, ఆయన ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ విమర్శించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్‌ నేత కేసీ మిట్టల్‌ తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే తప్ప పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
విమర్శల నేపథ్యంలో సాక్షి మహరాజ్‌ను మీడియా వివరణ కోరగా.. తాను ఏ మతాన్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, దీనిపై ఎన్నికల సంఘం ముందు విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అంతకుముందు 2015లోనూ సాక్షిమహరాజ్‌ ఇలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ జనాభా పెరగాలంటే ఒక్కొక్కరు నలుగురేసి పిల్లలను కనాలని మహిళలకు సూచించారు. కాగా యూపీలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇటీవలే షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com