భారతదేశంలో ఈ నెల భజంత్రీలకు భారీ డిమాండ్

పెళ్లిళ్ల సందడి మొదలయింది. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, కృష్ణా, విజయవాడ నగరాల్లో మూడు రోజుల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉండగా, 23 నుంచి 25 వరకు బలమైన ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. తిరిగి ఫిబ్రవరి 17 తరువాతే ముహూర్తాలు ఉండటంతో ఈలోగా పెళ్లితంతు ముగించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీంతో పెళ్లి మండపాలు మొదలుకొని భజంత్రీలు, పురోహితులు, కేటరింగ్‌ వరకు డిమాండ్‌ ఏర్పడింది. పుణ్యక్షేత్రాల్లో సైతం గదులు దొరకని పరిస్థితి ఉంది.రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, కృష్ణాజిల్లాతో పాటు విజయవాడ నగరంలో వందలాది కల్యాణ మండపాలతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు, పెడన, మచిలీపట్నంలోని కల్యాణ మండపాలు ముందుస్తుగానే బుక్‌ చేసుకున్నారు. ప్రైవేట్‌ కల్యాణ మండపాలతోపాటు తితిదే, కుల సంఘాలకు చెందిన కల్యాణ మండపాలు సైతం ఖాళీగా లేవు. ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరిగిన ఏసీ కల్యాణ మండపాలుసైతం బుక్కయిపోయాయి. గిరాకీని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు అద్దెలు పెంచేశారు. ప్రస్తుతం కల్యాణ మండపం స్థాయినిబట్టి రూ. 30 వేల నుంచి రూ.2 లక్షల వరకు అద్దెలు ఉన్నాయి. ముందస్తుగా బుక్‌ చేసుకోని వారు ఖాళీ స్థలాలు, మైదానాలు, ప్రభుత్వ సంస్థలకు చెందిన స్థలాల్లో వివాహాలు చేసేందుకు అనుమతులు తీసుకుంటున్నారు.
* తిరువూరు, పెడన, కైకలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 50 కల్యాణ మండపాలు ఉండగా, వీటిలో 18 వరకు ఏసీ కల్యాణ మండపాలు ఉన్నాయి. కల్యాణ మండపం సామర్థ్యాన్ని బట్టి గతంలో రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉండే అద్దెలు ప్రస్తుత డిమాండ్‌ నేపథ్యంలో రూ. 40 వేల నుంచి రూ. 80 వేల వరకు పలుకుతున్నాయి.
* ఒక్కో వివాహ వేడుకకు కల్యాణ మండపం అలంకరణ నుంచి భోజనాల వరకు ఆర్థిక స్థోమతను బట్టి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
* అతిథులకు స్వాగతం పలకటం, డెకరేషన్‌ మొదలు క్యాటరింగ్‌ వరకు చాలా మంది కాంట్రాక్టు ప్రాతిపదికన అప్పగిస్తున్నారు. ఇందుకు పెళ్లివారు కోరుకునే సదుపాయాలనుబట్టి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది.
* మంగళవాద్యాలకు అదనంగా సినీ సంగీత విభావరికి రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
* గతంలో వివాహ వేడుకల్లో కానుకలు స్వీకరించేవారు. ప్రస్తుతం కానుకలు తీసుకోవటానికి బదులు వేడుకలకు హాజరైన బంధుమిత్రులకు తమ స్థోమతకు తగిన విధంగా బహుమతులు అందజేస్తూ హోదా చాటుకుంటున్నారు.
**పెరిగిన అమ్మకాలు…
అధిక సంఖ్యలో వివాహాలు ఉండటంతో కొద్దిరోజులుగా వస్త్రదుకాణాలు, బంగారు దుకాణాల్లో కొనుగోళ్లు పెరిగాయి. విజయవాడలోనేగాక చిన్నచిన్న పట్టణాల్లోని వస్త్రదుకాణాల్లో సైతం వ్యాపారాలు బాగానే సాగాయి. పెళ్లిళ్ల కారణంగా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. వరుసగా మూడు రోజులపాటు శుభకార్యాల కారణంగా రైళ్లు, బస్సులు రద్దీగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివాహాలకు హాజరయ్యేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మేలు.
**సామాజిక మాధ్యమం ద్వారా పిలుపులు…
వధూవరులు, కుటుంబ సభ్యుల ఫోటోలతో కూడిన శుభలేఖలు, వీడియోల ద్వారా పెళ్లిపిలుపులు పూర్తిచేశారు. దూరప్రాంతాల్లో ఉన్నవారికి, సమయానుకూలంగా చెప్పలేనివారికి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. వాట్సాప్‌, హైక్‌, టెలిగ్రాం, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌… వంటివాటి ద్వారా బంధుమిత్రులకు శుభలేఖలు పంపించి పెళ్లికి రావాల్సిందిగా కోరుతున్నారు. మొత్తమ్మీద ఈనెల 23 నుంచి నెలాఖరు వరకు పెళ్లిసందడే.
**ఏదీ దొరకడం లేదు…
సామాన్యులు మొదలుకుని ధనవంతుల వరకు ఆర్థిక పరిస్థితిని బట్టి వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి పనులతో హడావుడి కనిపిస్తోంది. మరోవైపు పెళ్లి మండపాలకు పువ్వులు, విద్యుత్తు దీపాలతో అలకరించే నిర్వాహకులు మొదలుకుని మంగళవాద్యాలు, సంగీత కచేరీ చేసే వారి వరకు గిరాకీ పెరగింది. వంటమేస్త్రీలు, క్యాటరింగ్‌, తాగునీరు, ఇలా ఒకటేమిటి పెళ్లి వేడుకలకు అవసరమైన ప్రతి ఒక్కటీ సమకూర్చేందుకు కొందరు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. బంధుమిత్రులకు పసందైన విందు భోజనాలు సైతం వడ్డించే వంటకాలనుబట్టి ఒక్కో విస్తరికి రూ. 150 నుంచి రూ. 500 వరకు కేటరింగ్‌ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. భోజనం అనంతరం ఐస్‌క్రీం, కిళ్లీలు సరేసరి. బంధుమిత్రులు ఒకటిరెండు రోజులు ఉండటానికి వీలుగా గదులను సైతం సిద్ధం చేసుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com