భారతీయులు నిపుణులు. అందువలన…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెస్తున్న వలస ముసాయిదా కార్యాచరణ వల్ల భిన్నత్వ లాటరీ విధానానికి ముగింపు పడుతుందని వైట్‌హౌస్‌ పేర్కొంది. అత్యంత నిపుణులైన శ్రామికులు గ్రీన్‌కార్డుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని వివరించింది. కేటాయింపుల్లో దేశాలవారీ పరిమితిని తొలగించాలని భారత హెచ్‌-1బీ వీసాదారుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత అమెరికన్లలో ఎక్కువమంది ‘అత్యంత నిపుణుల’ కోవలోకే వస్తారు. వారు ప్రధానంగా హెచ్‌-1బీ పనివీసాలపై అమెరికాకు వస్తుంటారు. అయితే చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేదా గ్రీన్‌ కార్డులు కేటాయింపులో దేశానికి ఏడు శాతం చొప్పున కోటాను కేటాయించే ప్రస్తుత వలస వ్యవస్థ వల్ల వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. ఫలితంగా నిపుణులైన భారత వలసదారులు గ్రీన్‌కార్డు పొందడానికి వేచిచూడాల్సిన సమయం 70 ఏళ్ల మేర ఉంది. గతవారం భారతీయ నిపుణులు వాషింగ్టన్‌ డీసీలో సమావేశమై, వలస వ్యవస్థలోని ఈ లోపాన్ని సరిదిద్దాలని ట్రంప్‌ సర్కారును, కాంగ్రెస్‌ను కోరారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌.. వాస్తవ పరిస్థితిని వివరించే ఒక పత్రాన్ని విడుదల చేసింది. ‘‘ట్రంప్‌ ముసాయిదా కార్యాచరణ.. వీసా లాటరీ కార్యక్రమానికి ముగింపు పలుకుతుంది. కొన్ని వీసాల పునఃకేటాయింపు జరిపి.. అత్యంత నిపుణులు, ఉపాధి ఆధారిత వలస కేసుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తాం’’ అని అందులో పేర్కొంది. అనంతరం ఈ అంశంపై ట్రంప్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘వీసా లాటరీకి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వలస వ్యవస్థను, అమెరికన్లను కాంగ్రెస్‌ రక్షించాలి’’ అని అందులో పేర్కొన్నారు. ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్‌ కోరుకుంటున్నారని వైట్‌హౌస్‌ ఉప మీడియా కార్యదర్శి రాజ్‌షా తన తొలి పాత్రికేయ సమావేశంలో తెలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను తమ దేశంలోకి ఆకర్షించడానికి వీలవుతుందని చెప్పారు. ‘‘అధ్యక్షుడు వలస సంస్కరణలను కోరుకుంటున్నారు. ప్రస్తుతమున్న విస్తృత కుటుంబ శృంఖల వలస విధానం నుంచి ప్రతిభ ఆధారిత ప్రక్రియ వైపు మళ్లాలని భావిస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. జాతి, మతం వంటి అంశాలతో నిమిత్తం లేకుండా ప్రతిభావంతులు తమ దేశంలోకి వచ్చేలా చూడాలని ఆయన అనుకుంటున్నట్లు వివరించారు. ‘‘విద్యాపరమైన నేపథ్యాలు, అమెరికాలోని శ్రామికశక్తి సామర్థ్యానికి వారు అందించే సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com