భారత్-అమెరికా కలిసి సాగుతాయి

అభివృద్ధి పథంలోకి పయనించేందుకు ఆర్థికపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటూ భారత్‌, అమెరికాలు సంయుక్తంగా ముందుకు సాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ అన్నారు. మరికొన్ని రోజుల్లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఇవాంక ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. హైదరాబాద్‌లో ఈ నెల28 నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు హాజరయ్యే అమెరికాకు మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకుల బృందానికి 36 ఏళ్ల ఇవాంక నాయకత్వం వహిస్తున్నారు. సదస్సుకు 170 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు, అమెరికా నుంచి 350మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో ఎక్కువ మందిప్రవాసభారతీయులు కావడం ఉండటం విశేషం. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించే ఈ సదస్సులో ఇవాంక కీలక ప్రసంగం చేయనున్నారు. నెట్‌వర్క్‌లను విస్తరించుకోవడంతో పాటు, ఆలోచనల మార్పిడి, వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యమని ఇవాంకా వెల్లడించారు. ఆర్థికావకాశాలు, సంఘటిత వృద్ధిని పెంచేందుకు భారత్‌, అమెరికాలు సంయుక్తంగా కలిసి పనిచేస్తాయని ఆమె అన్నారు. భారత్‌లో పర్యటన కోసం ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లను మరోసారి చూస్తానని ఆమె మీడియాకు వెల్లడించారు. అమెరికా-భారత్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదో పారిశ్రామిక వేత్తల సదస్సు ‘ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భద్రత-ఆర్థిక భాగస్వామ్యంతో బలమైన స్నేహానికి ప్రతీక’ అని ఆమె అన్నారు. సదస్సులో ఎక్కువ మంది మహిళలు పాల్గొంటున్నందుకు గర్వంగా ఉందన్నారు. అఫ్గానిస్థాన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర 10 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ఇవాంకను భారత్‌ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com