భారత్-చాలా దూల తీర్చిన ట్రంప్

భారత్‌, చైనాలు తమ వస్తువులపై ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నారో అంతే సుంకాన్ని వాటికి కూడా వర్తింపజేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ‘చైనా 25% లేదా భారత్‌ 75% పన్ను వేసినా మేం మాత్రం ఎటువంటి పన్ను విధించడం లేదు. ఇప్పుడు 50 లేదా 75 లేదా 25 సంఖ్య ఏదేనా మేమూ అదే వర్తింపజేస్తాం. దీనినే రెసిప్రోకల్‌ విధానం అంటార’ని అన్నారు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై 25%, 10% చొప్పున సుంకం విధించే ఆదేశాలపై సంతకాలు చేయడానికి ముందు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో తయారయ్యే హార్లే డేవిడ్‌సన్‌ మోటర్‌సైకిళ్లపై భారత్‌ అధిక సుంకం విధిస్తోందని ఇటీవల ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకం పెంపు ప్రభావం దేశీయ కంపెనీలపై ఏవిధంగా ఉండనుందో అనే అంశాన్ని పరిశీలించేందుకు అమెరికా నోటిఫికేషన్‌ కోసం వేచి చూస్తున్నామని భారత్‌ పేర్కొంది.అల్యూమినియం, ఉక్కు దిగుమతి సుంకం పెంపు ఆదేశాలు రానున్న 15 రోజుల్లో ఇది అమల్లోకి రానున్నాయి. అయితే పొరుగు దేశాలపైన కెనడా, మెక్సికోలకు టారీఫ్‌ పెంపుల నుంచి అమెరికా మినహాయింపును ఇచ్చింది. మిగిలిన దేశాలు కూడా మినహాయింపు పొందాలంటే అమెరికా వాణిజ్య ప్రతినిధులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ‘అమెరికా జాతీయ పరిరక్షణకు ఉక్కు, అల్యూమినియం పరిశ్రమల బలోపేతం ముఖ్యం. మన ఓడలను విమానాలను, ఇతరత్రా రక్షణ సామగ్రిని మన దేశంలో తయారైన అల్యూమినియం, ఉక్కుతోనే తయారు చేయాలన్నదే ఆకాంక్ష. ఎన్నో ఏళ్లుగా ఇది అలాగే ఉండిపోయింద’ని ట్రంప్‌ అన్నారు. అమెరికా సుంకం పెంపు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందని ఇప్పటికే ఐరోపా, చైనా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న సంబంధాలు చెడిపోయే ప్రమాదముందని కూడా మరికొన్ని దేశాలు హెచ్చరించాయి. ద్వైపాక్షిక సత్సంబంధాలపై ట్రంప్‌ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్‌ అభిప్రాయపడగా.. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని దక్షిణ కొరియా తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై అతిపెద్ద దాడిగా చైనా అభివర్ణించింది. మరోవైపు అమెరికాతో స్నేహ సంబంధంతో మెలుగుతున్న తమకు టారీఫ్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఈయూ ట్రేడ్‌ కమిషనర్‌ సెసిలా మామ్‌స్ట్రోమ్‌ ట్వీట్‌ చేశారు. మినహాయింపులకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈయూ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. సుంకం పెంపు నుంచి తమకు మినహాయింపు ఇవ్వకుంటే 90 రోజుల్లో తమ చర్యలను ప్రకటిస్తామని ఐరోపా కూటమి హెచ్చరించింది. అమెరికా చర్యకు ప్రతిచర్యలో భాగంగా ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై టారీఫ్‌ పెంపు అంశాన్ని బ్రజెల్స్‌ పరిశలిస్తోంది. ఈ వాణిజ్య యుద్ధంలో కేవలం నష్టపోయిన వాళ్లే ఉంటారని ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లె మైర్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com