భారత మహిళల జట్టుకు ఓటమి

మహిళల ఆసియా కప్‌లో టీమిండియా జోరుకు అడ్డుపడింది. టోర్నీలో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఫర్‌గానా హోక్‌ (52 నాటౌట్‌; 46 బంతుల్లో) బంగ్లాదేశ్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(42), దీప్తి శర్మ(32)రాణించారు. అనవసర పరుగుకు యత్నించి మిథాలీ రాజ్‌ (15) రనౌటైంది. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (2) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 19.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌ 142 పరుగులు సాధించి ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించాలనుకున్న భారత్‌ ఆశలకు గండి పడినట్లైంది. బంగ్లాదేశ్‌ బౌలర్‌ రుమాన అహ్మద్‌ అద్భుత ప్రదర్శన చేసింది. 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి మూడు వికెట్లు దక్కించుకున్న రుమాన ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకుంది. టోర్నీలో భాగంగా భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. గురువారం ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com