భారత మార్కెట్లపై అమెరికా తీవ్ర ప్రభావం

అమెరికాలో సూచీల పతనంతో భారత స్టాక్‌మార్కెట్లు గజగజలాడాయి. ఒకానొక దశలో మార్కెట్ల ఆర్థిక సంక్షోభాన్ని తలపించేలా సెన్సెక్స్‌ 1,200 పాయింట్లు కుప్పకూలింది. కానీ తర్వాత కోలుకొని 561 పాయింట్ల నష్టంతో 34,195వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 168 పాయింట్లు నష్టపోయి 10,498 వద్ద ముగిసింది. మరో పక్క ప్రపంచ ప్రధాన మార్కెట్లు అన్నీ భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. భారత మార్కెట్లలో ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, టీసీఎస్‌ దిగ్గజ కౌంటర్లలో షేర్లు భారీగా అమ్మాకానికి రావడం కూడా మార్కెట్‌ను బాగా కుంగదీసింది. ఈ షేర్లన్నీ సూచీల‌ కదలికలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడవడం మార్కెట్‌ భయాలను తెలియజేస్తోంది.

* శుక్రవారం విడుదలైన అమెరికా జాబ్స్‌డేటా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. 2009 తర్వాత అమెరికాలో వేతనాలు వేగంగా పెరిగిపోతున్నాయని దీనిలో పేర్కొన్నారు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉండటంతో భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా డోజోన్స్‌, నాస్‌డాక్‌లు భారీ నష్టాలను నమోదు చేశాయి.

* అంచనాలకు మించిన వేగంతో ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడంతో అమెరికాలో బాండ్ల లాభదాయకత పెరిగింది. ఫలితంగా షేర్ల కంటే ఇవే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై, కమోడిటీ సూచీలపై కూడా ప్రభావం చూపాయి.

* ఇప్పటికే ఎల్‌టీసీజీతో మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా మారే వాటాలను పెట్టుబడి దారులు భారీగా విక్రయిస్తున్నారు. దీనికి తోడు కంపెనీలు కూడా ఇతర కంపెనీల్లో పెట్టిన క్రాస్‌ హోల్డింగ్స్‌ను వదిలించుకుంటున్నాయి. మరోపక్క మార్కెట్‌ విలువ రోజురోజుకూ పతనం అవుతుండటంతో సంపన్న ఇన్వెస్టర్లు వీలైనంత త్వరగా షేర్లను అమ్మేసే క్రమంలో మర్కెట్లు మరింత కుంగుతున్నాయి. దీనికి ప్రపంచ మార్కెట్ల భయాలు కూడా తోడయ్యాయి.

* త్వరలో జరగబోయే ఆర్‌బీఐ పరపతి సమీక్షలో కూడా కఠిన నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం మార్కెట్లను హడలెత్తిస్తోంది. ఇది నిజమై వడ్డీ రేట్లు పెరిగితే నగదు లభ్యత మరింత ప్రియమవుతుంది. ద్రవ్యోల్బణం 17నెలల్లో అత్యధిక స్థాయిలో నమోదు కావడం కూడా ఆర్‌బీఐ కఠిన నిర్ణయాలకు కారణమవుతుందని భావిస్తున్నారు.

* సూచీలు ఇప్పటికే అధిక విలువ వద్ద (ఓవర్‌ ప్రైసింగ్‌) ట్రేడ్‌ అవుతున్నట్లు ఇటీవల ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ కూడా తెలిపారు. ఆర్థిక సర్వే సందర్భంగా మార్కెట్లో దిద్దుబాటు తప్పదని పేర్కొన్నారు. దీనికి తగినట్లే బడ్జెట్‌ మర్నాటి నుంచే సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. మారో వారం పదిరోజుల్లో మార్కెట్లు మళ్లీ స్థిమిత పడతాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com