భార్యలను వేధిస్తున్న 35వేల ప్రవాస సైకో భర్తలు

అల్లుడికి విదేశంలో ఉద్యోగం.. డాలర్లలో జీతం… గ్రీన్‌కార్డూ, ఇల్లూ, కారు… అదృష్టం అంతా మన అమ్మాయిదే… అని నిన్నటి వరకూ గొప్పగా చెప్పుకున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. కానీ అదంతా ఎండమావేనని ఆడబిడ్డ కాళ్ల పారాణి ఆరకముందే తెలుసుకుంటున్నారు. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె కన్నీళ్లతో పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన దుస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు… ఎందుకిలా? ఎవరిది తప్పు? చట్టంలోని లోపామా… మన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పా? ఈ చిక్కుముడులను ఎలా విప్పాలి?
**గత రెండేళ్లుగా ఈ పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి అంటోంది ఓ తాజా నివేదిక. స్త్రీ శిశు సంక్షేమ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విడుదల చేసిన దాని ప్రకారం ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ సాయం కోసం అర్థిస్తోందట. ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకులపై గత కొన్నేళ్లుగా కనీసం ముప్ఫైవేల కేసులకు పైగానే పెండింగులో ఉన్నాయని పోలీసు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి కేసుల్లో పంజాబ్‌ మొదటిస్థానంలో ఉంటే రెండు తెలుగురాష్ట్రాలు ఐదో స్థానాలలోపు చోటు సంపాదించుకోవడం శోచనీయం.
****కారణాలేంటి?
విదేశీ మోజుతో కొందరూ, పిల్ల సుఖపడుతుందనే ఆశతో మరికొందరు.. కారణాలు ఏమైనా విదేశాల్లో ఉన్న వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య గత దశాబ్దకాలంగా పెరిగింది. ఈ కోరికలే ఆ ఆడపిల్లల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దాంతో పెళ్లయ్యాక విదేశాలకు తీసుకెళ్లక కొందరు, తీసుకెళ్లినా సరిగ్గా చూడక మరికొందరు, చిన్నపాటి గొడవలకే అక్కడి చట్టాలను ఉపయోగించుకుని ఇంకొందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నారు. వరుడికి సంబంధించిన వివరాలు సరిగా తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేయడం, విదేశీ వివాహాలూ, చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, సమస్యలు వస్తే ఎలా బయటపడాలో తెలియకపోవడం వంటివే ఇవే కాదు…ప్రాథమికంగా పెళ్లిని పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడం వంటివీ ఈ పరిస్థితికి కారణాలుగా చెబుతున్నారు న్యాయనిపుణులు.
***సాధారణంగా వివాహాల నమోదు అధికారిగా సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల వద్ద కూడా పెళ్లి నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలానే ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఆయా మతాచారాలకు అనుగుణంగా కూడా వివాహాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ…వరుడు ఎన్‌ఆర్‌ఐ అయితే ఇలా రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలు ఏంటి? వేటిని పరిగణనలోకి తీసుకోవాలనే విషయాలపై మాత్రం అధికార యంత్రాంగంలో స్పష్టత లేకపోవడం వల్ల హడావిడిగా నమోదు జరుగుతుందనేది ప్రధాన ఆరోపణ.
****మరేం చేయాలి?
* ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకుతో వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించాలి. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ ఉండదు దానికి బదులుగా సామాజికభద్రతా సంఖ్యను తీసుకోవాలి. పాస్‌పోర్టు, వీసా, గత మూడు సంవత్సరాలుగా పన్ను, రాబడి పత్రాలూ, బ్యాంకు లావాదేవీలు ఎన్నారై వరుడి ఆస్తి తాలూకు ఆధారాలు, విద్యార్హత, ఉద్యోగ నియామక పత్రాలు వంటివి సరిచూసుకోవడం తప్పనిసరి. ఇలా పరీక్షించేటప్పుడు ఎలక్ట్రానిక్‌ కాపీలూ, నకళ్లను కాకుండా ఒరిజినల్స్‌ని పరిశీలించడం తప్పనిసరి.
* హడావిడిగా పెళ్లిళ్లను కుదుర్చుకోకపోవడమే మంచిది. అలానే ఫోన్‌ లేదా- ఈమెయిళ్లలో వాటిని ఖారారు చేసుకోవడం కూడా తప్పే. మరీ ముఖ్యంగా ఏజెంట్‌లూ, బ్యూరోలూ, మధ్యవర్తుల ఒత్తిడికీ, ప్రలోభాలకూ గురికాకుండా నిర్ణయం తీసుకోండి.
* పెళ్లి ఏర్పాట్లు విదేశాల్లో చేస్తామంటే అస్సలు ఒప్పుకోకపోవడమే మంచిది. కొన్నిరోజుల్లో గ్రీన్‌కార్డు వస్తుంది. మరోదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది… వంటి మాటల్ని నమ్మకపోవడమే మంచిది.
* వధువును పంపే సమయంలో స్థానిక పోలీసులూ, ఇతర సహాయ ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయం, స్థానిక భారతీయ సంఘాలూ, నెట్‌వర్క్‌లకు సంబంధించిన నంబర్లు అమ్మాయి దగ్గర ఉండేలా చూసుకోవాలి. అత్తింటికెళ్లాక భర్తా, అత్తమామలు హింసిస్తే తక్షణ సహాయం కోసం అక్కడ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించొచ్చు.
*****చట్టం ఎలా సాయపడుతుంది…
* దేశాలను బట్టి చట్టాలు మారుతూ ఉంటాయి. విదేశీ వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మొదట వాటిపై అవగాహన పెంచుకోవడం మంచిది.
* పెళ్లిళ్లు మనదేశంలో జరిగినప్పుడు విడాకుల చట్టాలు కూడా ఇక్కడే వర్తిస్తాయి. కొందరు గ్రీన్‌కార్డుదారులకి వారుంటున్న దేశంలో విడాకులు తీసుకునే హక్కు ఉంటుంది. కానీ అక్కడి కోర్టులు తీసుకునే నిర్ణయాలు భారతదేశంలో అమలు కావు. కానీ అక్కడ పుట్టిన పిల్లలకు మాత్రం వర్తిస్తాయి.
* ఎన్‌ఆర్‌ఐ భర్తపై మనదేశంలో సెక్షన్‌ 498ఎ, వరకట్నం, గృహహింస వంటి కేసులు పెట్టొచ్చు. భార్యని మన దేశంలోనే వదిలేసి వెళ్లిపోయినా, అత్తింటివాళ్లు హింసిస్తున్నా కూడా గృహహింస నిరోధక చట్టం కింద రెసిడెన్స్‌ ఆర్డర్‌ లేదా షేర్డ్‌ హౌస్‌హోల్డ్‌ ఆర్డరుని పొందవచ్చు.
*మనదేశానికి వెలుపల భర్తలు చేసే ఆరోపణల్ని సెక్షన్‌ 189 సీఆర్‌పీసీ ప్రకారం ఇండియాలో చేసినట్లుగానే పరిగణిస్తారు. సెక్షన్‌ 156 (1) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్‌పీసీ)ప్రకారం క్రిమినల్‌ కంప్లయింట్‌ ఫైల్‌ చేయొచ్చు.
* మనదేశంలోని ఏదైనా కోర్టులో నేర నిరూపణ జరిగినప్పుడు అతడు ఏ దేశంలో ఉన్నా కూడా తీసుకొచ్చి అప్పగించాలని ఎక్సపరిడేషన్‌ యాక్ట్‌ 1962 లోని సెక్షన్‌ 3 సూచిస్తోంది.
* భారతదేశంలో భార్య వేసిన కేసులకి భర్త హాజరుకాకపోతే పాస్‌పోర్టు చట్టం 1967లోని సెక్షన్‌ 10 ప్రకారం అతని పాస్‌పోర్టుని రద్దు చేయమనవచ్చు. భర్తకి ఏదైనా క్రిమినల్‌ కేసులో శిక్షపడి ఉంటే అతని వీసాను కూడా రద్దు చేయమని ఆ దేశపు రాయబార కార్యాలయాన్ని కోరవచ్చు.
* మనదేశంలో నేరం రుజువైనప్పుడు అతడు విదేశంలో ఉన్నా కూడా వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేయవచ్చు అని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 41(1)జి చెబుతోంది.
* విదేశంలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని లేదా కలిసి జీవిస్తూ ..ఇక్కడ తల్లిదండ్రులు కోసం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే వారి మీద చీటింగ్‌ కేసు నమోదు చేయొచ్చు. అలాంటప్పుడు వారికి సమన్లు జారీ చేసే బాధ్యత విదేశీవ్యవహారాల శాఖ తీసుకుంటుంది.
* సమన్లు తీసుకోకుండా అడ్రస్‌లు మారేస్తే వారి మీద వారెంట్‌ ఇష్యూ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. నిరంతరంగా నోటీస్‌ తీసుకోకపోయినా వారెంట్‌ ఎగ్జిక్యూట్‌ అవ్వకపోయినా సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 82 ప్రకారం తప్పించుకుని తిరుగుతున్న నిందితుడి కింద అతడిని కోర్డు నిర్ణయిస్తుంది.
* భర్త విదేశంలో మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని నిరూపించే ఫేస్‌బుక్‌ సందేశాలు, ఈ-మెయిళ్లను ఎలక్ట్రిక్‌ సాక్ష్యాలుగా చూపించొచ్చు.
* ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల విషయంలో మోసం జరిగినప్పుడు ఆ పెళ్లి మాట్రిమోనీ ద్వారా కుదిరితే ఆ నిర్వాహకులనూ బాధ్యులుగా చేయవచ్చు. భార్యకు తెలియకుండా భర్త విదేశాల్లో విడాకుల కోసం ఎక్స్‌పార్టీ డిక్రీ తీసుకుంటే ఇక్కడ చెల్లుబాటు కాదు. ఇండియాలో భార్య తీసుకున్న విడాకులు లేదా ఇతర కుటుంబ వివాదాలు విదేశంలో చెల్లుబాటు అవుతాయి.
* భర్త విదేశంలో ఉన్నప్పుడు అక్కడ పుట్టిన పిల్లల కస్టడీ గురించి అక్కడి కోర్టు నిర్ణయాన్ని వారి సంక్షేమం దృష్ట్యా సమీక్షించే అధికారం మనదేశంలోని కోర్టులకి ఉంది అని సుప్రీంకోర్టు 2011లో తీర్పునిచ్చింది.
* విదేశాల్లో భర్త భారతదేశంలో వదిలేసిన భార్యలకు కోర్టులకు వెళ్లే స్థోమత లేనప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్‌ ఓవర్సీస్‌ వారు సాయం చేయడానికి వీలుగా 2011లో ఒక పథకాన్ని తెచ్చారు. దీని ప్రకారం మనదేశ పౌరసత్వం కలిగి ఉండి ఆమెను భర్త వదేలిసినప్పుడు, ఎక్స్‌పార్టీ డిక్రీతో విడాకులు తీసుకున్నప్పుడు మూడువేల డాలర్లు న్యాయ సహాయం అందిస్తారు. అయితే ఆమెపై ఎటువంటి క్రిమినల్‌ ఛార్జిషీటు దాఖలు అయి ఉండకూడదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com