భీమిలి ప్రజలు మొత్తం నా వెనుక ఉన్నారు

భీమిలిలో తనపై ప్రజా వ్యతిరేకత ఉందన్నది అవాస్తవమని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురవారం మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. పోటీలో నెగ్గి తీరుతానని పార్టీ నాయకత్వానికి చెప్పదల్చుకున్నానని మంత్రి గంటా పేర్కొన్నారు. మధ్యాహ్నం సీఎం కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గత వారం రోజులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముభావంగా ఉన్న విషయం తెలిసిందే. భీమిలిలో ఆయనపై వ్యతిరేకత ఉందని ఓ సర్వేలో తేలడంతో అప్పటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. సీఎం నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో మంత్రి గంటాతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈరోజు విశాఖలో సీఎం పర్యటన జరుగనుంది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గురువారం మంత్రి గంటా శ్రీనివాస్‌ను కలిసి బుజ్జగించారు. ఎట్టకేలకు రాయబారం ఫలించి మంత్రి గంటా శ్రీనివాసరావు అలకవీడారు. విశాఖలో సీఎం పర్యటనలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సీఎంను ఆహ్వానించేందుకు హోంమంత్రి చినరాజప్పతో కలిసి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com